జయభేరి కోసం రైతులకు అన్యాయం చేసిన చంద్రబాబు!!

టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అనడం సరికాదని హితవు పలికారు. సమస్యలు చెప్పుకొనేందుకు సీఎం జగన్ ని రాజధాని రైతులు కలిశారని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా పూలింగ్‌ పేరిట చంద్రబాబు బలవంతపు భూసేకరణ చేశారని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మిత్ర అని చెప్పుకునే చంద్రబాబు మంగళగిరిలో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. నేషనల్ హైవేను ఆనుకుని జయభేరి అపార్ట్ మెంట్స్ కట్టారు. వాటికి సమీపంలో ఈస్ట్‌ ఫేస్‌తో రైతులకు సంబంధించిన భవనాలు కడుతుంటే.. వాటి కారణంగా జయభేరి అపార్ట్ మెంట్స్ అమ్ముడుపోవనే కారణంతో వాటిని రిజర్వు జోన్‌లో పెట్టారని ఆరోపించారు. స్దానికంగా 600 ఎకరాల రైతులకు అన్యాయం చేయలేదా అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు.. తన ఇంటి దగ్గర బల్బుల కోసమని... ఉండవల్లి పంచాయతీ నుంచి రూ. 50 లక్షలు డ్రా చేయించారని ఆరోపించారు. రైతుల సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయాలు చేస్తూ గ్రామస్థాయి నేతలా చంద్రబాబు మాట్లాడుతున్నారు అని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్భయ దోషులకు డెడ్ లైన్... ఇక మిగిలింది ఒకే ఒక్కడు...

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సస్పెన్స్ కొనసాగుతోంది. క్షమాభిక్ష అండ్ క్యురేటివ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ నిర్భయ దోషుల ఉరిపై జనవరి 31న పాటియాలా కోర్టు స్టే విధించడంతో నిలిచిపోయిన శిక్ష అమలు మళ్లీ ఎప్పుడనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే, పాటియాలా కోర్టు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం... అలాగే, ఢిల్లీ సర్కారు సవాలు చేయడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పు సంచలన తీర్పు వెలువరించింది. పాటియాలా కోర్టు తీర్పును సమర్ధిస్తూనే... న్యాయ ప్రక్రియను ముగించుకునేందుకు నిర్భయ దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. అలాగే, దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. న్యాయ ప్రక్రియను ముగించి నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని చెప్పింది. అయితే, న్యాయ ప్రక్రియ ముగించుకోవడానికి నిర్భయ దోషులకు వారం రోజులు గడువిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నలుగురు నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయడానికి ఆదేశాలు ఇవ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. అలాగే, నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీసేందుకు వీల్లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంలో కేంద్రం సవాలు చేసింది. ఇదిలాఉంటే, నిర్భయ దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దాంతో, నలుగురు నిర్భయ దోషుల్లో ఇఫ్పటికే ముగ్గురు మెర్సీ పిటిషన్లపై నిర్ణయం పూర్తయింది. ఇక, ఒకే ఒక్కడు మిగిలున్నాడు. అయితే, నిర్భయ దోషులకు ఢిల్లీ హైకోర్టు... వారం రోజుల గడువు ఇవ్వడంతో.... ఇక, మిగిలిన ఒకే ఒక్కడు పవన్ గుప్తా....ఈలోపే మెర్సీ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం రోజుల గడువులోగా పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకుంటే రాష్ట్రపతి కూడా వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇఫ్పటికే ముగ్గురు దోషుల మెర్సీ పిటిషన్స్ ను రిజక్ట్ చేసి ఉండటంతో... ఒకవేళ పవన్ గుప్తా క్షమాభిక్ష కోరినా తిరస్కరించే అవకాశమే కనిపిస్తోంది.

ఇంగ్లీష్ లెక్చరర్ అవతారమెత్తిన జగన్... స్టూడెంట్స్ గా మారిపోయిన విద్యావేత్తలు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొఫెసర్‌ అవతారమెత్తారు.  విజయవాడలో నిర్వహించిన... ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్ ఎడ్యుకేషన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు ప్రవేశపెట్టారో వివరించారు. మన విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అన్నారు. అంతేకాదు, ఎడ్యుకేషన్‌లో ప్రపంచ దేశాలతో భారత్‌‌ను... ఆంధ్రప్రదేశ్‌ను పోల్చుతూ లెక్కలతో సహా వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుంటే... సదస్సుకు హాజరైనవారంతా స్టూడెంట్స్ లా మారిపోయి... శ్రద్ధగా విన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడని, అయితే ఒక తండ్రిగా నా పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని కోరుకుంటానని, అందుకే.... ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామన్నారు. పేద విద్యార్ధులకు కూడా ఇంగ్లీష్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏలుతుందన్న జగన్మోహన్ రెడ్డి... ఇంగ్లీష్ లాంగ్వేజ్ లగ్జరీ కాదని... అందరికీ నెస్సస్సరీ లాంగ్వేజ్ అన్నారు. అయితే, పేద విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నదని, అందుకే... తాము ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అదే సమయంలో, మాతృభాషకు అన్యాయం జరగకుండా తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేశామని జగన్ గుర్తుచేశారు. తాము తీసుకున్న నిర్ణయంతో పేద విద్యార్ధులు సైతం ప్రపంచంతో పోటీపడగలరని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. 99శాతం ప్రైవేట్ స్కూళ్లన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండగా, పేద పిల్లలు మాత్రమే తెలుగు మీడియంలో ఎందుకు చదవాలని జగన్ ప్రశ్నించారు. మీరైనా, నేనైనా మన పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించగలమా అన్నారు. కేవలం, ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడమే కాదు... మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేస్తూ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు జగన్ తెలిపారు. నాడు నేడుతో పాఠశాల రూపురేఖలే మార్చేయబోతున్నామని జగన్ వెల్లడించారు. నాణ్యమైన విద్యతోపాటు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

తెలంగాణలో పసుపు యుద్ధం... స్పైసీ వద్దంటోన్న గులాబీ నేతలు...

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పసుపు యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ టార్గెట్ గా గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. పసుపు బోర్డు తీసుకొస్తానంటూ రైతులను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన అర్వింద్... ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపాడని విమర్శిస్తున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానన్న ధర్మపురి అర్వింద్... ఇప్పుడు స్పైస్ సెంటర్ పై ప్రకటన చేయించి ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ లో స్పైస్ సెంటర్ ఏర్పాటుతో రైతులకు ఒరిగేదేమీ ఉండదని విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇఛ్చినట్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిందేనని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పసుపునకు మద్దతు ధర కల్పించి కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. బీజేపీ జాతీయ నేతలు, అలాగే ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పినట్లుగా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా... కేవలం ఇద్దరు అధికారులతో స్పైస్ సెంటర్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగమంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే, వరంగల్‌‌లో ఉన్న స్పైస్ బోర్డును కదిలిస్తే మాత్రం ఊరుకునేది లేదని టీఆర్ఎస్ హెచ్చరించింది. మరోవైపు, నిజామాబాద్ లో స్పైస్ సెంటర్ ఏర్పాటులో అర్వింద్ పాత్రేమీ లేదంటున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. మాజీ ఎంపీ కవిత కృషి వల్లే నిజామాబాద్లో స్సైస్ బోర్డు ఏర్పాటవుతోందని అంటున్నారు.

కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోనుందా? జగన్ ప్రభుత్వంతో కియాకి పడటం లేదా?

వైసీపీ ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పలువురు పారిశ్రామికవేత్తలు సైతం వైసీపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతుందంటూ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మోహన్‌దాస్ పాయ్ ఆమధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రముఖ కంపెనీలు, పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శలు నిజమేనేమోననిపిస్తున్నాయి. ఎందుకంటే, దక్షిణకొరియా దిగ్గజ కంపెనీ కియా మోటార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలగేందుకు ప్రయత్నిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తన ప్లాంట్ ను తరలించాలనే ఉద్దేశంతో ఉందనే ప్రచారం జరుగుతోంది. 1.1 బిలియన్ డాలర్లతో అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కార్ల ప్లాంట్ ను తమిళనాడుకు తరలించే సాధ్యాసాధ్యాలపై కియా మోటార్స్ చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. కియా మోటార్స్ ప్రతినిధులు ఇఫ్పటికే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు ప్రముఖ వార్తసంస్థ రాయిటర్స్ సంచలన కథనం ప్రచురించింది. దాంతో, రాయిటర్స్ కథనంపై ఏపీలో కలకలం రేగుతోంది.  ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కారు మార్కెట్ కలిగివున్న కియా మోటార్స్... భారత్ లోకి ఎంట్రీ ఇచ్చి తన తొలి ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పింది. అనంతపురం జిల్లాలో రెండేళ్ల నిర్మాణ పనుల తర్వాత గతేడాది డిసెంబర్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. ఏడాదికి 3లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నెలకొల్పిన ఈ ప్లాంట్లో ప్రత్యక్షంగా 12వేల మందికి ఉద్యోగాలను కల్పించింది. అయితే, చంద్రబాబు హయాంతో రాష్ట్రానికొచ్చిన కియా మోటర్స్.... జగన్ ప్రభుత్వం వచ్చాక కొన్ని ఇబ్బందులను ఎదుర్కొందనే ఆరోపణలు వినిపించాయి. అందుకు రుజువుగా, అసెంబ్లీ సాక్షిగా కియాకి చంద్రబాబు కల్పించిన రాయితీలు, సౌకర్యాలపై మంత్రి బుగ్గన తప్పుబట్టారు. దాంతో, కియా మోటార్స్ తో జగన్ ప్రభుత్వానికి సఖ్యత లేదనే మాటలు వినిపించాయి. ఇఫ్పుడు, రాయిటర్స్ కథనంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక టీడీపీ నేతలైతే జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ వంటి వారైతే.. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారని ఈ శిక్ష అనుభవించాలి, ఏపీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, రాయిటర్స్ కథనాన్ని ఏపీ అధికారులు ఖండిస్తున్నారు. కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమంటున్నారు. కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఏపీ ఇండస్ట్రీస్ సెక్రటరీ రజత్ భార్గవ చెబుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా రాయిటర్స్ కథనాన్ని ఖండించారు. ఏపీ నుండి కియా తరలిపోతుందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సీఎం జగన్ కియాతో సంఖ్యతగా ఉన్నారని, రాష్ట్రంలో కియా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తారని విజయసాయి చెప్పుకొచ్చారు. అసలు రాయిటర్స్ లాంటి సంస్థ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏంటని అధికార పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కియా తరలిపోతుందన్న అసత్య ప్రచారంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో.. అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. నష్టనివారణ చర్యలు చేపట్టారు. అయితే, రాయిటర్స్ కథనంపై కియా మోటార్స్ స్పందించాల్సి ఉంది. అలాగే, ఏపీ నుంచి ప్లాంట్ ను తరలించే ఉద్దేశం లేదని ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే అనుమానాలు కంటిన్యూ కావడం ఖాయం.

పవన్ బాటలో రజనీ... ఇద్దరి అజెండా ఒక్కటే...

ఒకరు తమిళ సూపర్ స్టార్... మరొకరు టాలీవుడ్ పవర్ స్టార్... ఇద్దరూ ఇద్దరే... వీళ్లిద్దరూ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే.... ఎందుకంటే వీళ్ల మాటలు అంత పవర్ ఫుల్ గా జనాల్లోకి దూసుకెళ్తాయి. అయితే, దేశంలో అలజడి రేపుతున్న సీఏఏకి మద్దతు పలకడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై అనుమాన మేఘాలు తొలగకపోయినా.... దానికి వకాల్తా పుచ్చుకుని, మోడీ సర్కారుకు బాకా ఊదుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటికే పవన్ కమలంతో కలిసి నడుస్తుండగా... రజనీ కూడా కాషాయ బాటలోనే వెళ్లాలనుకుంటున్నారని అంటున్నారు. అందుకే, రజనీ కూడా బీజేపీ భాషలోనే మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీతో కలిసి ముందుకు సాగుతోన్న జనసేనాని పవన్ కల్యాణ్... సీఏఏకి మద్దతు ప్రకటించారు. బీజేపీతో స్నేహం కుదిరిన నాటినుంచి మోడీ ప్రభుత్వంపై పవన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగానే సీఏఏకు మద్దతివ్వడమే కాకుండా అపోహలు అవసరమే లేదంటూ కామెంట్ చేశారు. ఇక, ఇప్పుడు రజనీకాంత్ కూడా పవన్ బాటలోనే నడిచారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలికారు. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని తలైవా హామీ ఇచ్చారు. దేశ విభజన తర్వాత భారత్‌లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్న ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ఎలా అనుకుంటున్నారు? సీఏఏతో భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని రజనీ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలకు విద్యార్థులు ఆ అవకాశం ఇవ్వరాదని రజనీ సూచించారు. అయితే, దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టంపై రజనీ నేరుగా స్పందించడం ఇదే తొలిసారి. రజనీ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీకి బాకా ఊదడటమే రజనీ పనయ్యిందన్నాయి. సీఏఏతో ముస్లింలు అభద్రతాభావానికి గురవుతున్నారని... షహీన్‌బాగ్‌ ఆందోళనలు... రజనీకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నాయి. అయితే.... రజనీకాంత్, పవన్‌లు అదేపనిగా మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం, హిందూత్వ భావజాలంలో మాట్లాడటం వెనుక వ్యూహం కనిపిస్తోంది. ముఖ్యంగా వీళ్లిద్దరూ తమ రాజకీయ ఎదుగుదలకు, పోరాటానికి బీజేపీ బలం అవసరమని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఆరెస్సెస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ వంటి బీజేపీ దళాలు తోడ్పడుతాయని, రజనీ, పవన్‌లు ఆశిస్తున్నారని, అందుకే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, బీజేపీ మన్ననలు పొందేందుకు ట్రై చేస్తున్నారని అంటున్నారు. అందుకే సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు  జరుగుతున్నా, వీరు మాత్రం, ప్రశంసలు కురిపించడం వెనుక మతలబు ఇదేనంటున్నారు. మొత్తానికి మొన్న పెరియార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, బీజేపీ మన్ననలు పొందే ప్రయత్నం చేసిన రజనీ.... ఇప్పుడు ఇద్దరూ పౌరసత్వ సవరణ చట్టమైన సీఏఏకు మద్దతిచ్చి, తమిళనాట సరికొత్త చర్చకు తెరలేపారు.

ఉపముఖ్యమంత్రిగా కేటీఆర్.! ఆ తర్వాత నేరుగా సీఎం కుర్చీయే.!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ దాదాపు ఏడాదిగా ప్రచారం జరుగుతోంది. మంత్రులు సైతం ఈమధ్య కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆరేనంటూ ప్రకటనలు కూడా చేశారు. ఐటీ అండ్ మున్సిపల్ మంత్రిగా తెలంగాణను ప్రగతిపథంలో నడిపిస్తున్న కేటీఆర్... ఏదోఒక రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు ముగిశాక మంచిరోజు చూసుకుని కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ ఖండించగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కొట్టిపారేశారు. అయితే, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కేటీఆర్ కోసం కేసీఆర్ సరికొత్త ఆలోచన చేశారట. ఇప్పటికిప్పుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకుండా.... ఉపముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇటీవల టీఆర్ఎస్ ముఖ్యనేతలతో తన మనసులో మాటను కేసీఆర్ బయటపెట్టారని అంటున్నారు. కేటీఆర్ ను డిప్యూటీ సీఎంను చేస్తే ఎలాగుంటుందంటూ అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, గత ప్రభుత్వంలో ముగ్గురికి ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్... రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం ఎవరికీ డిప్యూటీ సీఎమ్ లుగా అవకావమివ్వలేదు. అయితే, ఏ నిర్ణయమైనా వ్యూహాత్మకంగా తీసుకునే కేసీఆర్.... ఈసారి ఉపముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ కోసం రిజర్వు చేశారని అంటున్నారు. ఒక్కో స్టెప్ ఎక్కిస్తూ ఫైనల్ గా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా ఇప్పుడు కేటీఆర్ ను ఉపముఖ్యమంత్రిని చేయనున్నారని అంటున్నారు. అంతేకాదు, డిప్యూటీ సీఎం హోదాలో కేటీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. ముఖ్యమంత్రి లేనిసమయంలో అవసరమైతే మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించవచ్చని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో కొన్ని కీలక ఫైల్స్ పై సంతకాలు చేసే అధికారం ఉంటుందని అంటున్నారు. ఈవిధంగా పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ కేటీఆర్ ను కీలకం చేయడం వల్ల కేటీఆరే ఫ్యూచర్ సీఎం అంటూ అటు పార్టీని, ఇటు ప్రజలను మానసికంగా ప్రిపేర్ చేయబోతున్నారని విశ్లేషిస్తున్నారు. అయితే, ఎవరేమనుకున్నా డేంట్ కేర్ అంటూ కేటీఆర్ ను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేసే అధికారం కేసీఆర్ కు ఉంది. కానీ, ఉన్నట్టుండి కేటీఆర్ ను సీఎంను చేస్తే కొందరు సీనియర్ల నుంచి వ్యతిరేకత రావొచ్చు. అది చివరికి ఎటువైపైనా దారి తీయొచ్చు. అందుకే, కేసీఆర్ తెలివిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తనయుడు కేటీఆర్ ను ఒకేసారి ముఖ్యమంత్రిని చేయకుండా ఒక్కో స్టెప్ ఎక్కిస్తూ ఫైనల్ గా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నది కేసీఆర్ వ్యూహమని చెబుతున్నారు. మొత్తానికి, త్వరలోనే కేటీఆర్... డిప్యూటీ సీఎం హోదాకి ప్రమోషన్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. అలా, కొన్నాళ్లు ఉపముఖ్యమంత్రి పదవి నిర్వహించాకే... ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశముందంటున్నారు.  

పవన్ కు దీటుగా చిరంజీవి కొత్త రాజకీయం... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో పెరిగిన పలుకుబడి..!

సైరా మూవీ ప్రమోషన్లో భాగంగా తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవికి పలుకుబడి పెరిగిందంటున్నారు. ఇండస్ట్రీకి సంబంధించినది ఏదైనాసరే చిరంజీవి ద్వారానే చేస్తామంటూ సీఎం జగన్ చెప్పారనే మాట వినిపించింది. అందుకు తగ్గట్టుగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయంగా అమరావతి కోసం పోరాడుతుంటే, చిరంజీవి మాత్రం జగన్‌కే సపోర్ట్ ఇచ్చారు. ఇక, చిరంజీవి సైరా విడుదల, అదనపు షోస్ విషయంలోనూ ఉదారంగా వ్యవహరించింది. అప్పట్నుంచే సీఎం జగన్ తో చిరంజీవికి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. అయితే, ఇప్పుడు సడన్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్... ఏకంగా చిరంజీవి ఇంటికి వచ్చి సమావేశం కావడం కీలకంగా మారింది.  చిరంజీవి, నాగార్జునతో భేటీలో సినిమా రంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు తలసాని తెలిపారు. అయితే, ఈ భేటీలో సినీ ఇండస్ట్రీ చర్చలతోపాటు, తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయాలపై సమాలోచనలు జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రాజకీయాలకు అతీతంగా చిరంజీవి పోషించబోతున్న పాత్రపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పైగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే చిరంజీవితో మంత్రి తలసాని సమావేశమయ్యారన్న మాట ఉత్కంఠ రేపుతోంది. అయితే, ఇఫ్పటికే ఏపీ సీఎం జగన్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న చిరంజీవి... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ మెరుగైన సంబంధాలకు కోరుకుంటున్నారని, దానిలో భాగంగానే తలసాని ...మెగాస్టార్ ఇంటికి వచ్చారని అంటున్నారు. ఇటు తెలంగాణ... అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో చిరంజీవి స్నేహపూరిత సంబంధాలను కోరుకోవడం వెనుక ఆయనకంటూ ఒక వ్యూహముందన్న చర్చ నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా వ్యవహరించాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారట. అందుకే ఎప్పుడూ లేనిది ఈమధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొంటూ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడు ముందుంటాననే సంకేతాలను పంపారు. తన పనేదో తాను చేసుకుపోవడం తప్పా... ఇంతకుముందెప్పుడూ ఇండస్ట్రీ గురించి పెద్దగా పట్టించుకోని చిరంజీవి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదాలు, సమస్యలపై స్పందిస్తున్నారు. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించాలంటే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలు అవసరమని గ్రహించిన చిరంజీవి, అటు జగన్ తోనూ... ఇటు కేసీఆర్ తోనూ... అలాగే, అధికార పార్టీల నాయకులతోనూ టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. అదే సమయంలో, ఇరు ప్రభుత్వాధినేతలు, అలాగే అధికార పార్టీల నేతలు కూడా చిరంజీవికి సహకరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. కాపు వర్గంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న చిరంజీవితో కలిసిమెలిసి ఉండటం లాభమే కానీ నష్టమేమీ ఉండదని అధికార పార్టీల అధినేతలు భావిస్తున్నారట. ఇరువైపులా పరస్పర అవగాహనతో సహకరించుకుంటున్నారని అంటున్నారు. అందుకే... ఇటు తెలంగాణ ప్రభుత్వంలో... అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ... చిరంజీవికి పలుకుబడి ప్రాధాన్యత పెరిగిందని చెబుతున్నారు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా మారాలని, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే తన వద్దకే రావాలని, తన ద్వారానే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇండస్ట్రీకి సంబంధించిన పనులు చేయాలని చిరంజీవి కోరుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనున్న ఏపీ టిడిపి..కళా వెంకట్రావు స్థానంలో వచ్చేదెవరు..?

ఏపి టిడిపిలో జోష్ నింపడానికి భారీ మార్పులకు రెడీ అయ్యారు చంద్రబాబు. రాష్ట్ర అధ్యక్షుడ్ని త్వరలోనే మార్చబోతున్నారు అనే వార్తలు పొలిటికల్ సర్కిల్ లో తిరుగుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే కళా వెంకట్రావు స్థానంలో వచ్చే ఆ నేత ఎవరు, రాష్ట్ర కమిటీ కసరత్తు ఎప్పటికి పూర్తవుతుంది. ఏపి టిడిపిలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకటరావును నియమించారు. తరువాత ఆయన కేబినెట్ లోకి తీసుకున్నారు కానీ, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న నిస్సత్తువను పోగొట్టేందుకు సమూల మార్పులు చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే కళా వెంకట్రావు స్థానంలో మరో నేతకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లోనే టిడిపి రాష్ట్ర కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో ఆ పని పక్కన పడింది. అయితే ఇప్పటికే ఆలస్యం అవడంతో ఈ నెలాఖరు లోగా పార్టీ కమిటీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమించారు. పార్టీ అధ్యక్ష మార్పు జరిగితే శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.  దీంతో అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకట్రావు స్థానంలో అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, అచ్చెన్నాయుడు పేరును పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కూడా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచే అధ్యక్షుడిని తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటే అచ్చన్నకే ఎక్కువ అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సామాజిక కోణంలో చూసుకున్న బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంటుందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అధ్యక్ష పదవి అచ్చెన్నకిచ్చిన, రవిచంద్రను ఎంపిక చేసిన కలిగే లాభ నష్టాలపై పార్టీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినప్పటికీ మరోవైపునుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఒకవేళ అచ్చెన్నకు రాష్ట్ర అధ్యక్షుడు పదవిస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆయన స్థానంలో వేరేవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి కమిటీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

హాజీపూర్ వరుస హత్యల కేసులో ఈరోజే తుది తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం ఇవాళ ఏం తీర్పు వెల్లడించబోతుందోనని సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతేడాది వెలుగులోకొచ్చిన హాజీపూర్ సీరియల్ హత్యల కేసులో నల్గొండ పోక్సో కోర్టు తీర్పు చెప్పనుంది. ముగ్గురు మైనర్ బాలికలకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు విచారణను చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు తొంభై రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. జూలై ముప్పై ఒకటిన నల్గొండ లోని ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో మూడు కేసులకు సంబంధించి వేర్వేరుగా చార్జిషీటు దాఖలు చేశారు. అక్టోబరు పద్నాలుగు నుంచి న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ముగ్గురూ మైనర్ బాలికలే కావడంతో నల్గొండ లోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సాగింది. సుమారు రెండున్నర నెలల పాటు మూడు కేసుల్లో ప్రాసిక్యూషన్ తన వాదనను వినిపించింది. మూడు కేసుల్లో మొత్తం నూట ఒక్క మంది సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పారు. నిందితుడికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ బలంగా వాదన వినిపించడంతో పోక్సో కోర్టు ఎటువంటి తీర్పును వెల్లడిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నిర్భయ కేసులో ఉరిశిక్ష వేయడం, దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం, సమతా కేసులో నిందితులకు ఉరిశిక్ష వేయడం హాజీపూర్ నిందితుడికి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిందితుడికి ఉరిశిక్ష విధించినట్లయితే నల్గొండ జిల్లా కోర్టులో ఉరిశిక్ష విధించబడిన తొలి కేసుగా రికార్డుల్లోకి ఎక్కుతుంది.

ఇసుక పాలసీ విషయంలో కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన ఏపీ సిఎం జగన్

ఏపీ నూతనంగా తీసుకువచ్చిన ఇసుక పాలసీ అమలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు సీఎం జగన్. అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇసుక పాలసీపై జిల్లా కలెక్టర్ లతో తన కార్యదర్శి ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇసుక పాలసీ అమలులో అలసత్వం వహిస్తే ఊరుకోమని హెచ్చరించారు జగన్. ఒక్కరు నిర్లక్ష్యం చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. చిన్న పొరపాటు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. తాము తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు జగన్. ఒక వైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారదర్శకమైన అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు జగన్. ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు. అలా జరగకుండా కలెక్టర్ లు సీరియస్ గా పని చేయాలని ఆదేశించారు.

తిరుమల భద్రతలో డొల్లతనం... మూడ్రోజులుగా విమానం చక్కర్లు...

తిరుమల సప్తగిరులపై మూడు రోజులుగా విమానం చక్కర్లు కొట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషిద్ధం. పైగా, తిరుమల ఆలయం నో ఫ్లైయింగ్‌ జోన్‌ కింద ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు ఆలయంపై నుంచి వెళ్లకూడదనే నియమం ఉంది. అంతేకాదు తిరుమల కొండపై దేవతలు సంచరిస్తుంటారని, అందుకే అక్కడ విమానాలు తిరిగితే అపచారమనే భావన కూడా ఉంది. అలాగే సైన్స్ ప్రకారం కూడా ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉండటం వల్ల విమానాలు తిరిగితే అవి పేలిపోతాయనే ప్రచారం ఉంది. బ్రిటీష్ కాలంలో ఇలా రెండు విమానాలు ఈ ప్రాంతంలో పేలినట్లు ఆధారాలు ఉన్నాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ఏడుకొండలవాడిపై ఎప్పటినుంచో ఉగ్రవాదుల కన్ను ఉంది.. నిత్యం లక్షలాది మంది వచ్చి వెళ్లే ఈ పుణ్యక్షేత్రానికి ఆకాశ మార్గం ద్వారా ముప్పు పొంచి ఉందన్నది నిఘావర్గాల వాదన. అందుకే, ఆలయ సమీప ప్రాంతాన్ని  కూడా నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అయితే, ఏడుకొండలపై మూడు రోజుల నుంచి ఎగురుతున్న విమానం భక్తులతోపాటు, అధికారులను కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ భయాలు, ఈ ఆందోళనలు పక్కనపెడితే శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడాన్ని మాత్రం భక్తులు అపచారంగా భావిస్తున్నారు.  అయితే, తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌‌కు ఫిర్యాదు చేశారు. అయితే... దేశ భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా... ఐదేళ్లకోసారి విమానాల ద్వారా సర్వే చేయిస్తుంది. అందులో భాగంగానే కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా ఛార్టెర్డ్‌ విమానం శ్రీవారి ఆలయంపై తిరుగుతుందన్నది చెన్నై ఏటీసీ అంటే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అధికారులు చెబుతున్నారు. అయితే... మరోసారి అలా జరగకుండా చూస్తామంటూ హామీ ఇచ్చింది.  భౌగోళిక అధ్యయనాల కోసమే విమానాలు తిరుగుతున్నాయన్న ఏటీసీ అధికారుల వాదనతో తాము ఏకీభవించేది లేదంటున్నారు భక్తులు. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అమెరికాలో ట్విన్‌ టవర్స్‌‌పై జరిగిన వైమానిక దాడులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

తుగ్లక్ లా జగన్ అంటూ గల్లా ఘాటు వ్యాఖ్యలు... లోక్ సభలో టీడీపీ-వైసీపీ రాజధాని ఫైట్.... 

ఆంధ్రప్రదేశ్లో రాజధాని రగడ చల్లారడం లేదు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదంటూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టత ఇచ్చినా మూడు రాజధానులపై రాజకీయ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు, తాను అనుకున్న మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం చాపకింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే... ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానిని అమరావతి నుంచి తరలించనివ్వమంటూ రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తూ తమ గోడు చెప్పుకుంటోంది అమరావతి జేఏసీ. రాజధాని కోసం తమ భూములను త్యాగంచేస్తే ఇఫ్పుడు జగన్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందంటూ ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, ఏపీ రాజధాని వివాదం రాష్ట్రం పరిధిలోనిదని, రాజధాని ఏర్పాటుపై పూర్తి అధికారం రాష్ట్రానిదేనంటూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టతనిచ్చినా మరోసారి మూడు రాజధానుల ఇష్యూను లోక్ సభలో లేవనెత్తారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఏపీ రాజధాని ఇష్యూ రాష్ట్రానిది కాదని... జాతీయ సమస్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మూడు రాజధానులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అలాగే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా గల్లా జయదేవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో జగన్ ను తుగ్లత్ తో పోలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దాంతో, గల్లా ప్రసంగానికి వైసీపీ ఎంపీలు అడ్డుతగిలారు. ఇక, స్పీకర్ సీట్లో కూర్చున్న డి.రాజా కూడా గల్లా స్పీచ్ పై అభ్యంతరం తెలిపారు. గల్లా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.  వైసీపీ ఎంపీలు అడ్డుతగులుతున్నా, గల్లా జయదేవ్ మాత్రం వాడివేడిగా తన స్పీచ్ ను కొనసాగించారు. అయితే, గల్లా కామెంట్స్‌కు అదే స్థాయిలో వైసీపీ ఎంపీలు కౌంటర్‌ ఇచ్చారు. అమరావతి విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నారని తెలిపారు. అమరావతికి కూడా ముఖ్యమంత్రి జగన్‌ న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేముంటే అక్కడ కేవలం 20 పీట్ల రోడ్డును మాత్రమే ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని జీవీఎల్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.

దమ్ముంటే రా...అంటూ జగన్ కు బాబు సవాల్... మరోసారి పోరాటానికి పవన్ రెడీ...

కేంద్రం చెప్పినట్లు రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉన్నా... మార్చే హక్కు మాత్రం లేదన్నారు చంద్రబాబు. జగన్ కు దమ్ముంటే అమరావతిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. జగన్ రాజీనామా చేసి... మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్న బాబు... మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతామంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. అమరావతిని కేంద్రం ఆమోదించిందన్న చంద్రబాబు... దాన్నెలా మారుస్తారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు కూడా ఇస్తోందని... ఇఫ్పుడు రాజధానిని మారిస్తే ఆ నిధులు కూడా ఆగిపోతాయని వాదిస్తోంది. మరోవైపు, అమరావతి ఆందోళనల్లో మరోసారి పాల్గొనడానికి జనసేనాని రెడీ అవుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్న పవన్ కళ్యాణ్... ఫిబ్రవరి పదిన రైతుల ఆందోళనల్లో పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. అమరావతి రైతులు, మహిళల ఆందోళనలు, దీక్షలు 50రోజులు దాటిన నేపథ్యంలో స్పందించిన పవన్.... రాజధాని ప్రజలు చేస్తున్న శాంతియుత ఉద్యమం తెలుగు జాతి మొత్తానికి స్ఫూర్తిదాయమన్నారు. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకుని కలిసి పయనిస్తోన్న జనసేనాని స్టాండ్ కి భిన్నంగా ఏపీ రాజధాని ఇష్యూపై కేంద్రం ప్రకటన చేయడం పవన్ ను ఇరకాటంలో పడేసింది. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర పరిధిలోని అంశమని... రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం స్పష్టం చేయడంతో... అమరావతి రైతులకు పవన్ ఏం చెబుతారో చూడాలి. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ నేతలు ఘాటు విమర్శలు చేశారు. రాజధాని అంశంపై రాష్ట్రం పరిధిలోనిదని... కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం చూస్తుంటే... జగన్, మోడీ కుమ్మక్కయ్యారని అర్ధమవుతోందన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందని, అందుకే రాజధానిపై అధికారం రాష్ట్రానిదేనంటూ కేంద్రం ప్రకటించిందని విమర్శించారు. అయితే, టీడీపీ, సీపీఐ నేతల వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఏపీ రాజధాని వివాదంపై కేంద్రం స్పష్టత ఇచ్చినా భ్రమ కలిగించేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడుతున్నారు. రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్రం పరిధిలోని అంశమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్, అలాగే ఎమ్మెల్సీ మాధవ్ తేల్చిచెప్పారు. అయితే, రాజధాని పేరుతో ఏపీలో రాజకీయ, రాక్షస, వ్యాపార క్రీడ జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పులనే జగన్ కూడా చేస్తున్నారని విమర్శించారు. ఇదిలాఉంటే, అమరావతి పరిరక్షణ సమితి, రైతుల బృందం ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తూ రాజధానిపై వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విన్నవిస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిసిన జేఏసీ, రైతులు.... ఏపీ రాజధాని తరలింపు వల్ల జరిగే నష్టాన్ని వివరించారు.

ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్.. ఆ ఫోటోలేంటి?.. పార్లమెంట్ పై పీఎం ఫోటో ఉందా?

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. పంచాయితీ కార్యాలయాలకు అధికార పార్టీ వైసీపీ రంగులు వేయడంపై నేడు ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పంచాయితీ కార్యాలయాలపై వేసిన రంగులు, పార్టీ జెండాలు రంగులు వేర్వేరు అని ప్రభుత్వ తరపు న్యాయవాది అనగానే.. రంగులను తాము పోల్చుకోగలమని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. పంచాయితీ కార్యాలయాలపై సీఎం ఫోటోను ఎందుకు ముద్రించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాష్ట్ర సీఎంగా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టే సీఎం ఫోటో ముద్రించారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. న్యాయవాది వ్యాఖ్యలపై న్యాయమూర్తి  ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ పై ప్రధాని ఫోటో సుప్రీం కోర్ట్ పై ప్రధాన న్యాయమూర్తి ఫోటో ఉందా? అని నిలదీశారు. ఇలాంటి సాంప్రదాయం ఎక్కడ ఉందో చూపించాలని ప్రశ్నించారు. పార్టీ జెండా, గుర్తులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

నిర్భయ కేసు నిందితుల ఉరికి గడువు పెంచిన హైకోర్ట్...

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎప్పుడు ఉరిశిక్ష అమలవుతుందో అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది. నలుగురు దోషుల ఉరిపై స్టే విధిస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హై కోర్టు కూడా సమర్థించింది. నిర్భయ దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. దోషుల ఉరితీతపై విధించిన స్టే ఎత్తివేయలేమని తెలిపింది. ఈ కేసులో నలుగురు దోషులను వేరువేరుగా ఉరితీయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ పిటిషన్ ను న్యాయ స్థానం కొట్టేసింది. పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, దినేష్ శర్మల కు పిటిషన్ దాఖలు చేసుకోవడాని కి వారం రోజుల గడువిచ్చింది కోర్ట్. నిర్భయ కేసులో అధికారుల అలసత్వంతోనే రివ్యూ పిటిషన్ల పై విచారణ ఆలస్యం అవుతుందని హై కోర్టు స్పష్టం చేసింది. నలుగురు దోషులు క్రూరమైన నేరానికి పాల్పడ్డారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  నలుగురు దోషుల మరణశిక్షపై పటియాలా కోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ కేంద్రం వేసి న పిటిషన్ పై విచారణ జరిపింది న్యాయస్థానం. విచారణ సందర్భంగా సుదీర్ఘంగా వాడి వేడి వాదనలు సాగాయి. ముందుగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దోషులు న్యాయవ్యవస్థని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మొదట జనవరి 22న నలుగురు దోషులు ఊరికి డెత్ వారెంట్ జారీ చేసిన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో శిక్ష అమలు వాయిదా పడింది.  ఫిబ్రవరి 1న ఉరితీయాల్సినప్పటికి  న్యాయపరమైన అంశాలు ఉన్నాయని అవకాశాలున్నాయని స్టే విధించింది ఢిల్లీ కోర్టు. నలుగురు దోషులు ముఖేష్ వినయ్ క్షమాభిక్ష పిటిషన్ ను ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. మరణశిక్షను వాయిదా వేయించుకునేందుకు తమకున్న అన్ని అస్త్రాలనూ ఉపయోగిస్తున్నారు దోషులు. రకరకాల పిటిషన్ లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. హై కోర్టు తాజా తీర్పు తో నలుగురు దోషుల కు ఎప్పుడు ఉరిశిక్ష అమలవుతుందో అర్థం కావట్లేదు. 7 ఏళ్ళ నుంచి తమకు అన్యాయం జరుగుతోందని నిర్భయ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులకు ఇన్ని అవాకాశాలను ఎందుకు కల్పిస్తుందో అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. శిక్ష నుంచి కాపాడే ప్రయనం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం.  

పేదల ఇళ్ళ కోసం 5 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం...

ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కోసం భూమిని కొనుగోలు చేసేందుకు రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం 5000 కోట్ల రూపాయలను రుణంగా ఇచ్చేందుకు హడ్కో సంస్థ ముందుకు వచ్చింది. పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలను ఉగాది నాటికి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 27,000 ల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. మరో 15,000 ల ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.  25 లక్షల ఇళ్ల పట్టాల కోసం 40,000 ల ఎకరాలు అవసరమవుతుందని రెవిన్యూ శాఖ అంచనా వేసినట్లు సమాచారం. ఇందులో 12,000 ల ఎకరాల భూ యజమానుల నుంచి కొనుగోలు చేసి 3,000 ల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం హడ్కో రుణాన్ని ఉపయోగించనున్నట్లు సమాచారం. జిల్లాల్లో ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలోనే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో కొనుగోలు చేయాల్సిన భూ పరిమాణం తగ్గింది. ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 48 గజాల చొప్పున ఉచితంగా ఇళ్ల పట్టాలను అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది

దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు!!

ప్రకాశం జిల్లా దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతంలో రక్షణ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని పరిశ్రమలశాఖామంత్రి గౌతంరెడ్డి వెల్లడించారు. లక్నోలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్ పోలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గౌతంరెడ్డి పరిశ్రమల శాఖ అధికారులు హాజరయ్యారు. దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టు మంత్రి తెలియజేశారు. దీనికి అవసరమైన భూమి కూడా అందుబాటులో ఉందని రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇతర ఏరోస్పేస్ పరిశ్రమలు ఇక్కడ తమ యూనిట్ లను ఏర్పాటు చేసుకోవచ్చని డిఫెన్స్ ఎక్స్ పోలో ప్రజెంటేషన్  ఇచ్చారు. ఈ అంశాలను ఫ్రెంచ్ ఇండో రక్షణ పరిశ్రమల సదస్సులో మంత్రి గౌతంరెడ్డి వివిధ దేశాల ప్రతినిధులకు వివరించారు. ఏరోస్పేస్ రక్షణ రంగ పరిశ్రమల స్థాపనకు వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం కీలకమని స్పష్టం చేశారు. దొనకొండకు అతి చేరువలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టు నుంచి ఎగుమతి దిగుమతులకు అవకాశం ఉందని మంత్రి వివరించినట్లు సమాచారం.

రాజధాని మార్పు మా చేతుల్లో లేదు... ప్రజలను మభ్య పెట్టొద్దు!! 

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 23 ఏప్రిల్ 2015 న ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో కాపీ కూడా ఎక్కడా కేంద్ర ప్రభుత్వం మార్పు చేయలేదని ఇది రాష్ట్ర ప్రభుత్వం తనంత తానుగా తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు.  రాష్ట్రంలో రాజధాని మార్పు గురించి కానీ ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానులు అన్న విషయం పై కేంద్రానికి అధికారిక సమాచారం ఏమి లేదని మీడియా ద్వారానే విషయాలను తెలుసుకోగలిగామని జీవీఎల్ వెల్లడించారు. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధానిని పెట్టుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని  ఈ విషయంలో  కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారం అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిందని ఆయన వెల్లడించారు.  కొత్త రాజధాని విషయం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి తాను ఇదే విషయాన్ని అనేక  ప్రెస్ మీట్ లలో ప్రస్తావించినట్లు ఆయన అధికారికంగా ప్రస్తావించినట్లు తెలియజేశారు. అయితే అమరావతే రాజధానిగా కొనసాగాలని తాము భారతీయ జనతా పార్టీ ద్వారా అధికారికంగా స్పష్టం చేసినట్లు జీవీఎల్ తెలియజేశారు. అమరావతిలో అక్రమ భూముల దందా కొనసాగిందన్న విషయాన్ని తమ ఎన్నికల మానిఫెస్టోలో కూడా  ఒప్పుకున్నామని  కేవలం ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాజధాని మార్పు చేయడం సరికానిదని జీవిఎల్ తెలియజేశారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని దుర్వి నియోగం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసి రాజధానిని మార్చడం అనేది దుర్మార్గం అవుతుంది తప్పితే అది రాజకీయం కాదని  జీవీఎల్ వెల్లడించారు. రాజధాని మార్పు కేంద్రం చేతిలో ఉందని ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పొద్దని అన్నారు. రాజధాని మార్పు అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మేము రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేము కానీ.. ఒక రాజకీయ పార్టీగా మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని జీవీఎల్ అన్నారు.