మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి షాకిచ్చిన జగన్ సర్కార్...
posted on Feb 1, 2020 @ 1:59PM
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. గతంలో కేటాయించిన సున్నపురాయి గనుల లీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా యాడికి మండలంలోని జేసీకి సంబంధించిన త్రిశూల్ సిమెంట్స్ కు కొనుప్పలపాడులో కేటాయించిన 649.896 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ భూములు రాశి సిమెంట్ కు లీజులో ఉండేవి. వీటి కాల పరిమితి 2004 మార్చి 31 కి పూర్తయింది, 2005 లో ఈ భూములను వైఎస్ ప్రభుత్వం త్రిశూల్ సిమెంట్స్ కు లీజుకిచ్చింది. మూడేళ్ళలో త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సూచించింది. 2010 కి లీజు కాల పరిమితి ముగిసింది, మళ్లీ దరఖాస్తు చేసుకోగా 2015 ఆగస్టు 1 వరకు ప్రభుత్వం పొడిగించింది. అప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోవడంతో మరో అయిదేళ్లు పొడగించాలని ప్రభుత్వాన్ని కోరగా 2020 జూలై 31 వరకు గడువు పొడిగించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.
ఫ్యాక్టరీ నిర్మాణం జరగకపోయినా 38,212 మెట్రిక్ టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వి విక్రయించారన్న ఆరోపణలున్నాయి. లీజుకు సంబంధించి 38,3,376 రూపాయలు చెల్లించకపోవడం, ఇప్పటి వరకు సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయకపోవటం, అక్రమంగా మైనింగ్ చేయడం వంటి కారణాలతో లీజ్ ను రద్దు చేశారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ గనుల లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై జేసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ తనపై పగతో రగిలిపోతుంది అని అన్నారు. అనుమతుల రద్దుపై తనకు బాధగా లేదని, ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే తనకు జరిగినది చిన్నపాటిదేనని చెప్పారు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులపై వైసీపీ సర్కారు దృష్టి సారించింది. సరైన అనుమతులు లేవంటూ పలు బస్సు సర్వీసులను సీజ్ చేసింది. తాజాగా వారి సిమెంట్ గనుల లీజును రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.