కొత్త ట్రెండ్.. కుటుంబ సగటు భోజన ఖర్చును ఆర్ధిక సర్వేలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం
posted on Feb 1, 2020 @ 1:50PM
ప్రజల కొనుగోలు శక్తిని కొత్త విధానంలో లెక్కించింది కేంద్ర ఆర్థిక శాఖ. భోజనం కోసం ఒక్కో కుటుంబం పెట్టే ఖర్చు ఆధారంగా ఎకనమిక్ సర్వే విశ్లేషించింది. 2006-2007 నుంచి 2019-20 మధ్య వెజ్ మీల్స్ కొనుగోలు శక్తి 20 శాతం పెరిగిందని నాన్ వెజ్ మీల్స్ కొనుగోలు శక్తి 18 శాతం పెరిగిందని వివరించింది. థాలినామిక్స్ , ది ఎకనమిక్స్ ఆఫ్ ఎ ప్లేట్ ఆఫ్ ఫుడ్డింగ్ ఇండియా పేరుతో 27 పేజీల చాప్టర్ ను ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా చేర్చింది. 2019-20 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ క్రిష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఈ సర్వేను తయారు చేశారు. వెజ్ థాలిలో అన్నం లేదా రొట్టెలు, కూరగాయలు, పప్పు, నాన్ వెజ్ థాలిలో అన్నం లేదా రొట్టెలు, కూరగాయలు, మాంసాహారాన్ని సర్వే పరిగణనలోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 సెంటర్లలో పరిశ్రమల్లోని కార్మికుల నుంచి డేటా సేకరించారు. 2006 ఏప్రిల్ నుంచి 2019 అక్టోబర్ అంటే 13 ఏళ్ల ఇండెక్స్ ఆధారంగా విశ్లేషణ చేశారు.
ఐదుగురు సభ్యులున్న కుటుంబం రోజుకు రెండు పూటల భోజనానికి చేసే ఖర్చు రోజువారి ఆదాయం ఆధారంగా కొనుగోలు శక్తిని లెక్కగట్టారు. 2015-16 ఏడాది వరకు ఆహార ధాన్యాల రేట్ల పెరుగుదల ఎక్కువగా ఉందని ఆ తర్వాత తగ్గుతూ వచ్చిందని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ లెక్కన ఒక కుటుంబం ఏడాది కాలంలో భోజనం పై చేసే ఖర్చు 2015-16 తరువాత కాలంలో బాగా తగ్గిందని ఎకనామిక్ సర్వే తెలిపింది. ఈ లెక్కన వెజ్ మీల్స్ తినే కుటుంబానికి ఏటా సగటున 10,887 రూపాయల ఖర్చు తగ్గిందని లెక్కేసింది. అదే నాన్ వెజ్ తీనే ఫ్యామిలీకి సగటున 11,787 మిగిలిందని వివరించింది. అదే సమయంలో రోజువారీ సగటు ఆదాయంలో భోజనానికి చేసే ఖర్చు ఆధారంగా 2006-2007 నుంచి 2019-20 వరకు వెజ్ మీల్స్ కుటుంబాల్లో కొనుగోలు శక్తి 29 శాతం పెరిగినట్లు అంచనా వేసింది. అదే విధంగా నాన్ వెజ్ మీల్స్ కుటుంబాల్లో కొనుగోలు శక్తి 18 శాతం పెరిగినట్లు లెక్క గట్టింది. ఇతర రంగాల్లో ఇదే రీతిలో కొనుగోలు శక్తి ఉందని వివరించింది. తెలంగాణలో ఐదుగురు సభ్యుల కుటుంబంలో ఒక్కరి రోజు సగటు సంపాదన 479 రూపాయల ఆరు పైసలు ఉందని సర్వే పేర్కొంది. అందులో 40 రూపాయల రెండు పైసలను కుటుంబం సగటున రోజుకు నాన్ వెజ్ కి ఖర్చు చేస్తుందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోజువారి సంపాదన ఎక్కువని విశ్లేషించింది.