తెలంగాణ మిర్చికి కరోనా వైరస్ దెబ్బ... లబోదిబోమంటున్న రైతులు...
posted on Feb 1, 2020 @ 12:13PM
కరోనా వైరస్... ఇదిప్పుడు మనుషులనే కాదు... మిర్చిని కూడా భయపెడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంటే... తెలంగాణ మిర్చి రైతులు కూడా అల్లాడిపోతున్నారు. అదేంటి... కరోనాకు భయపడాల్సింది మనుషులు కదా? మరి మిర్చికి కరోనాకి లింకేమిటి అనుకుంటున్నారా? పొరపాటున మిర్చికి ఏమైనా కరోనా వైరస్ సోకిందనుకుంటున్నారా? కానే...కాదు? అయితే, కరోనాకు మిర్చికి వ్యాపారులు లింకుపెట్టారు. దాంతో, మిర్చిపై కరోనా ఎఫెక్ట్ పడింది. అది ఎంతలా ఉంటే... మిర్చి రైతు కోలుకోలేనంతగా. ఎందుకంటే, ఈ ఒకే ఒక్క వదంతు... మిర్చి రైతుని నిండా ముంచేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుని నాలుగు రూపాయలు జేబులో వేసుకుందామనుకున్న రైతును అప్పులుపాలు చేసింది. కరోనా దెబ్బకు నిన్నమొన్నటివరకు 30వేలు పలికిన క్వింటాలు మిర్చి.... ఇప్పుడు అమాంతం ఏడెనిమిది వేలకు పడిపోయింది. దాంతో, కనీసం కూలీ డబ్బులు కూడా దక్కక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నిన్నమొన్నటివరకు 30వేల రూపాయలు పలికిన క్వింటా మిర్చి ధర... ఇప్పుడు ఒక్కసారిగా ఏడెనిమిది వేలకు పడిపోవడంతో ఖమ్మం మిర్చి యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. అయితే, మిర్చి ధర పడిపోవడానికి అధికారులు చెప్పిన కారణం తెలుసుకుని కంగుతిన్నారు. కరోనా వైరస్ కారణంగానే మిర్చి ధర పడిపోయిందని చెప్పడంతో మిర్చి రైతులు మండిపడుతున్నారు. అసలు కరోనాకి... మిర్చికి సంబంధమేమిటని ప్రశ్నిస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయని... అందుకే, మిర్చి ధర అమాంతం పడిపోయిందని ఖమ్మం మార్కెట్ యార్డు పాలకపక్షం, అధికారులు అంటున్నారు. ఇక్కడ కొనుగోలు చేసే మిర్చి.... ఎక్కువగా చైనాకే ఎగుమతి అవుతుందని... అయితే, కరోనా కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయని చెబుతున్నారు. ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారని అధికారులు అంటున్నారు.
అయితే, కరోనా పేరుతో తక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేస్తున్న బడా వ్యాపారులు... వాటిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేసి.... ఆ తర్వాత అధిక ధరకు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తు్నారు. కరోనా సాకుతో తమను నిలువు దోపిడీ చేస్తున్నారని మిర్చి రైతులు మండిపడుతున్నారు. ధర తగ్గించడానికి కావాలనే కరోనా పేరు చెబుతున్నారని మిర్చి రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకుని... మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.