విజయసాయి కనుసన్నల్లో విశాఖ.. సార్ పిలిచారంటే చాలు!!
posted on Feb 1, 2020 @ 11:41AM
ఎందుకో తెలియదు వైసీపీకి విశాఖ అంటే ప్రత్యేక ఆసక్తి. అందుకేనేమో! సీఎం జగన్ కు కీలక సహచరుడు ఇంకా చెప్పాలంటే అత్యంత విశ్వసనీయుడైన విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించారు. అధికారంలోకి రాకముందు ఒకటి రెండేళ్ల ముందు నుంచి సాయిరెడ్డి విశాఖను తన రెండో ఇల్లుగా మార్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశాఖను దత్తతకు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అధికార యంత్రాంగమంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుంది. విజయసాయిరెడ్డి నెలకు కనీసం రెండు మూడు సార్లయినా నగరంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిపైనా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షిస్తుంటారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా ప్రభుత్వ అతిథి గృహానికి పిలిపించుకుని కీలక అంశాలపై చర్చిస్తుంటారు. ఒక్కోసారి తన ఇంటికి కూడా పిలిపించుకుంటారు, ఇలా ప్రత్యేకంగా నిర్వహించే సమావేశాల్లో జిల్లా ఇన్ చార్జి మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనరు.వారికి కనీస సమాచారం కూడా ఉండదు, ఇలాంటి రహస్య భేటీలో ఎక్కువగా భూములకు సంబంధించిన అంశాలపైనే చర్చిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
విజయసాయిరెడ్డి విశాఖ జిల్లాకు వైసీపీ ఇన్ చార్జ్, ఆ హోదాతో ఆయన పార్టీ కార్యక్రమాలపై సమీక్షించవచ్చు, ప్రభుత్వ పథకాలు ఇతర అంశాలపై సమీక్షించే అధికారం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. అయినా సరే సార్ పిలిచారంటే చాలు ఐఏఎస్, ఐపిఎస్ లు రెక్కలు కట్టుకొని వాలి పోవాల్సిందే. ఇక కలెక్టరేట్ లో నిర్వహించే సమీక్షా సమావేశాల్లో సాయిరెడ్డి మధ్యలో కూర్చుంటారు. కలెక్టర్ తో పాటు ప్రతి ఒక్కరూ ఆయనకే అన్ని వివరాలూ చెబుతారు. విశాఖ జిల్లాలో మంత్రుల కంటే ఆయనే పవర్ ఫుల్, ఆయన అపాయింట్ మెంట్ కూడా ప్రముఖులకే లభిస్తుంది. తాము హాల్లో కూర్చుని వెనక్కి రావాల్సిందే తప్ప ఆయనను కలిసే భాగ్యం దక్కదని పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతుంటారు. నిజానికి పార్టీ ఇన్ చార్జి గా ఆయన వైసీపీ కార్యకర్తలు, నేతలకే ఎక్కువగా అందుబాటులో ఉండాలి కానీ, అధికారిక సమీక్షల పైనే అధికంగా దృష్టి సారిస్తుంటారు.
ఇక సాయిరెడ్డి విశాఖ నగరంలోకి వచ్చారంటే చాలు పోలీస్ కమిషనరేట్ లోని ఒక అధికారి పూర్తిగా ఆయన సేవలోనే ఉంటారు. సీతమ్మధారలో ఎంపీ తీసుకున్న నివాసంలోనే మకాం వేస్తారు. సాయిరెడ్డి తిరిగి వెళ్లేదాకా అదే డ్యూటీ. ముందే చెప్పినట్లు సాయిరెడ్డికి విశాఖ పైన ప్రత్యేక ఆసక్తి, రాజ్యసభ సభ్యుడిగా విశాఖనే దత్తత తీసుకున్నారు. మరెక్కడా కాకుండా ఇక్కడే ప్రగతి భారతి పేరిట ఒక సేవా ట్రస్ట్ ను స్థాపించారు. అధికారంలోకి రాగానే ఏర్పాటైన ఈ ట్రస్టుకు విశాఖ నగరంలోని ప్రముఖులు వ్యాపారులు పోటీలు పడి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. విశాఖ లోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తమ ట్రస్టుకు నిధులు ఇవ్వాలని సాయి రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ జిల్లాకు గతంలో మోపిదేవి వెంకట రమణ ఇన్ చార్జి మంత్రిగా ఉండేవారు. మూడు నెలల క్రితమే ఆయనను మార్చి కన్నబాబును నియమించారు.
ఇక్కడ సాయిరెడ్డి అన్ని వ్యవహారాలూ చూసుకోవడంతో ఇన్ చార్జి మంత్రి విశాఖ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని చెబుతారు. ఇటీవల సాయిరెడ్డి విశాఖకు వచ్చారు, నెలకు రెండు మూడు సార్లు వస్తూనే ఉంటారు కదా ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా ఖచ్చితంగా ఉంది. ఈ సారి కొందరు న్యాయ నిపుణులతో కలిసి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన సిరిపురంలోని ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్లారు. ఐఏఎస్ అధికారులు వినయ్ చంద్ సృజన కోటేశ్వరరావులను పిలుపించుకున్నారు. ఈ అతిథి గృహానికి ఎదురుగా ఉన్న వాల్తేరు క్లబ్, పక్కనున్న దస్పల్లా భూముల పైనే చర్చ జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇతరుల స్వాధీనంలో ఉన్న ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి.
విశాఖలో అగ్రశ్రేణి వాల్తేర్ క్లబ్ లీజుకు తీసుకున్న స్థలంలోనే నడుస్తోంది. ఆ భూముల వారసులు వాటిని విక్రయించాలనే యోచనలో ఉన్నారు. క్లబ్ ను ఖాళీ చేయాలని కోరగా కార్య వర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అలాగే దసపల్లా భూములు కూడా చేతులు మారి న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భూములపై ఐఏఎస్ అధికారులతో సాయిరెడ్డి ప్రత్యేకంగా చర్చించడం సంచలనం సృష్టించింది. అధికారుల నుంచి పూర్తి సమాచారం తీసుకుని న్యాయ నిపుణుల సలహాలతో వాటిని కోరుకున్న వారికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. తిరిగి వెళ్తూ రెండు అట్టపెట్టెల్లో ఫైళ్లు కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. ఏదేమైనా విజయసాయి తీరు విశాఖ లోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.