రైతులకు అండగా కేంద్రం.. రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు!
posted on Feb 1, 2020 @ 3:18PM
2020-21 బడ్జట్ లో ఉన్నత జీవన ప్రమాణాలు, ఆర్ధికాభివృద్ధి, సామాజిక భద్రత వంటి మూడు అంశాలపై దృష్టి సారించామని.. అవే బడ్జెట్ ప్రధాన లక్ష్యాలని సీతారామన్ వెల్లడించారు. ఆయుష్మాన్ భవ అద్భుత ఫలితాన్ని ఇచ్చిందని.. దాన్ని గుర్తు చేసుకుంటూ కాశ్మీరీ దీనానాద్ కౌల్ కవితను చదివి వినిపించారు నిర్మల సీతారామన్. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్షమని.. వ్యవసాయ మార్కెటింగ్ విధానం సరళతరంగా ఉన్న నేపధ్యంలో వ్యవసాయాభివృద్ధికి సంబంధించి మూడు కొత్త చట్టాలను రూపొందించామన్నారు. అది కాకుండా నీటి ఎద్దడి ఉన్న 100 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ని..20 లక్షల మంది రైతులకు సోలార్ పంపులను.. బీడు భూములకు సోలార్ ప్లాంట్లకు వేర్ హౌసెస్ నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని సీతారామన్ తెలియజేశారు.
గ్రామీణ స్టోరేజ్ స్కీమ్ పేరుతో కొత్త పథకాన్ని.. స్వయం సహాయక గ్రూపులకు ధాన్యలక్ష్మి రుణాలకు శ్రీకారం చుడుతున్నట్లు సీతారామన్ తెలియజేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్లో జాతీయ స్థాయిలో స్కీమ్ లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలియజేశారు. రైళ్ల ద్వారా పంటల రవాణాకు కిసాన్ రైల్ స్కీమ్ సౌకర్యం కలిగించడమే కాక మరింత విస్తృతంగా నాబార్డ్ రీ ఫైనాన్స్ స్కీమ్ ను ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు.కిసాన్ క్రెడిట్ స్కీమ్ కోసం రూ.15 లక్షల కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 2021లోపు 108 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళతామని వెల్లడించారు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణభివృద్ధి రంగాలకు కలిపి రూ.2.83 లక్షల కోట్లు కేటాయించినట్లు సీతారామన్ వెల్లడించారు.