ఖ్యాతి పెంచిన భారతీయుడు.. ప్రముఖ ఐబీఎం సంస్థ సీఈఓగా ఎంపికైన అరవింద్ కృష్ణ
posted on Feb 1, 2020 @ 4:11PM
భారత సంతతి నుండి ఇప్పటికే సుందర్ పిచై, సత్య నాదెళ్ల, అజయ్ బంగా, శాంతను నారాయణ్ వంటి దిగ్గజాలు ప్రపంచఖ్యాతి పొందారు. వారి వంటి స్థాయికి మరో దిగ్గజం చేరుకున్నాడు. అరవింద్ కృష్ణ అనే భారతీయుడు టెక్నాలజీ రంగంలోనే దిగ్గజమైన ఐబీఎం సంస్థకు నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా ఎంపికయ్యారు. ఇది వరకు అదే ఐబీఎం సంస్థలో సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న అరవింద్‌ను కంపెనీ డైరెక్టర్ల బృందం సీఈఓగా ఎన్నుకుంది.
ఐబీఎం నవ శకానికి అరవింద్ నాయకత్వం సరైనదని ప్రస్తుత ఐబీఎం సీఈఓ గిన్నీ రోమెట్టీ అన్నారు. ఐబీఎం రూపొందించిన కీలక సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తయారీలో అరవింద్ బాగా కృషి చేశారని కొనియాడారు. రెడ్ హ్యాట్ కొనుగోలులో అరవింద్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఉన్న ఐబీఎం సీఈఓ గిన్నీ రోమెట్టీ (62) ఈ ఏడాది చివర్లో రిటైర్ అవ్వనున్నారు. కాబట్టి అప్పటి వరకు ఆమె ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు.
1990 సంవత్సరంలో అరవింద్ కృష్ణ (57) ఐబీఎంలో చేరారు. కాన్పూర్ ఐఐటీలో సాంకేతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత ఇల్లినాయిస్ యూనివర్సీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు అరవింద్ కృష్ణ. బోర్డు మెంబర్లు తనపై నమ్మకాన్ని పెట్టుకొని..సీఈఓగా తనను ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అరవింద్. తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ క్లయింట్ లకు ఎదురయ్యే సవాళ్లను మరింత సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమిస్తామని అన్నారు.