రాజకీయ మలుపులో రైతుల ఆందోళన! 6 నెలలుగా పోరాట దీక్ష..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్’తో రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆరు నెలలలో రైతుల ఆందోళన అనేక మలుపులు తిరిగింది. కొన్ని సందర్భాలలో హింసాత్మకంగా మారింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్ర కోట వద్ద జాతీయ జెండాను,ఆందోళనకారులు తొలగించారు. అవమాన పరిచారు. అలాగే, ఆ రోజు సంయుక్త కిసాన్ మోర్చా’ అధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలోనూ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక వ్యక్తి మరణించారు. ఢిల్లీ రైతుల ఆందోళన దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ వివాదాలకు వేదికగా నిలిచింది. రైతుల ఆందోళన ముసుగులో దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై చర్చా, రచ్చా చాలా జరిగింది.
రైతుల ఆందోళన ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం రైతులు బ్లాక్ డే పాటిస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మోర్చా, బుధవారం దేశ వ్యాప్తంగా బుద్ధ పూర్ణిమ జరుపుకుంటున్నాం. ఈ పర్వదినాన, సమాజంలో రోజు రోజుకు క్షీణించి పోతున్న సత్యం, అహింసల పునరుద్ధరణ జరిగేలా పండగను జరుపుకోవాలి, రైతులంతా నల్ల జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చింది. మరో వంక లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని, ఎక్కడా గుంపులుగా చేరకూడదని రైతులకు డిల్లీ పోలీసులు సూచించారు.
ఎండావానా ప్రకృతి వైపరీత్యాలనే కాకుండా, భయంకరంగా ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనాను సైతం లెక్క చేయకుడా, రైతులు ఆరు నెలలుగా ఆందోళన కొనసాగడం, ఓ వంక ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి, రైతుల అన్దోఅలన శిబిరాలలో సకల సౌకర్యాలు, అన్ని ‘ఏర్పాట్లు’ జరిగిపోతున్నాయి. ఇందుకు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తున్నారు, ఎక్కడి నుంచి నిధుల ప్రవాహం వస్తోంది అనేది అంతుచిక్కని ప్రశ్న గానే మిగిలింది. అందోళన ప్రపంభానికి ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతూనే ఉంది. రైతు చట్టాలకు సంఘాల నాయకులు సవరణలు సూచిస్తే పరిశీలించేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది. ఇంకో అడుగు ముందు కేసి, సంవత్సర కాలం పాటు చట్టాల అమలును నిలిపివేసేందుకు కూడా సిద్దమైంది. అయితే, రైతు సంఘాల సంఘటన, ‘సంయుక్త కిసాన్ మోర్చా’ ముఖ్య నేత రాకేష్ తికాయత్, ‘చట్టాల సంపూర్ణ రద్దు’ తప్ప ఇంకా దేనికీ అంగీకరించేది లేదని చెప్పారు.
మరో వంక, ఒకప్పుడు ఇవే చట్టాల కోసం, ముఖ్యంగా రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అనుమతించాలని, అందుకు అవసరమైన చట్టాలు చేయాలని ఆందోళన చేసిన తికాయత్ ఇప్పడు, అవే చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అలాగే, గతంలో ఇవే చట్టాలు తెస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రామిస్ చేసిన కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో ఎందుకు యూ’ టర్న్ తీసుకున్నాయి? ఆలోచిస్తే, ఈ ఉద్యమం వెంక రైతుల ప్రయోజనాలు ఉన్నాయో లేవో కానీ, రాజకీయ ప్రయోజనాలు, ప్రణాళికలు ఉన్నాయని అనుకోవాల్సి వస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, తికాయత్ చరిస్మాను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఇతర పార్టీలు ఒక వ్యుహంతోనే రైతుల ఆందోళనకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్ ‘లో తికాయత్ జాట్’ మంత్రం పనిచేస్తే, భవిష్యత్’లో జాట్ బెల్ట్ ( రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ,) లో ఆయన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినవస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్’లో జాట్ల ప్రభావం ఉన్న 50 లోక్ సభ నియోజక వర్గాల్లో, తికాయత్ మంత్రం పనిచేస్తే కాంగ్రెస్’కు పునర్జీవనం వచ్చినట్లే అని పార్టీ పెద్దలు లెక్కలు వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సమర్ధవంతంగా ఎదుర్కోవడం రాహుల్ గాంధీతో లేదా మరొకరితో అయ్యే పని కాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. అదీ గాక, మోడీ, బీజీపే వ్యతిరేక శక్తులను ఏక చేసే శక్తి ఒక్క తికాయత్’ కే ఉందని, కాంగ్రెస్ వ్యూహ కర్తలు నిర్ణయానికి వచ్చి నట్లు తెసులుస్తోంది. ఈ నేపధ్యంలో తికాయత్ ఆందోళన రానున్న రోజుల్లో మరింత రాజకీయ రంగును పులుముకుంటుందని,తికాయత్’ను ఆశాజ్యోతిగా భావిస్తున్న బీజేపీ, మోడీ వ్యతిరేక శక్తులు ముందు ముందు, ఆయన సారధ్యంలో పనిచేసినా ఆశ్చర్య పోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.