యువకుడి కొట్టిన మరో కలెక్టర్.. ఈ పెద్దోళ్లకి ఏమైంది?
posted on May 25, 2021 @ 4:48PM
పోలీసులు కొట్టడం కామన్. ఖాకీలు కొడితే జనాలు సైతం పెద్దగా పట్టించుకోరు. అదే కలెక్టర్ కొడితే మాత్రం. సీన్ సితార్ అయిపోతుంది. వెంటనే ముఖ్యమంత్రి సైతం స్పందిస్తారు. వెంటనే కలెక్టర్‌పై యాక్షన్ తీసుకుంటారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో అలానే జరిగింది. లాక్‌డౌన్ టైమ్‌లో బయటకు వచ్చిన ఓ యువకుడి సెల్‌ఫోన్ పగలగొట్టి.. అతడి చెంప చెల్లుమనిపించిన కలెక్టర్‌ను సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. ఆ ఘటన మరువక ముందే.. తాజాగా, మరో అదనపు కలెక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎప్పటిలానే విమర్శల పాలవుతున్నారు.
మధ్యప్రదేశ్‌లో లాక్‌డౌన్ సమయంలో చెప్పుల షాప్ తెరిచిన ఓ యువకుడిపై షాజాపూర్ అదనపు కలెక్టర్ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు. షాప్ ఎందుకు తెరిచావంటూ.. ఆగ్రహంతో ఆ యువకుడి తలపై ఒక్కటిచ్చారు. అదనపు కలెక్టర్ ఆ షాపు పిల్లాడిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అంతే. ఆ అడిషనల్ కలెక్టర్‌ను కామెంట్లతో ఆటాడుకున్నారు నెటిజన్లు.
కట్ చేస్తే.. ఆ విషయం ఆ రాష్ట్ర మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ వరకూ చేరింది. ఘటనపై దర్యాప్తు జరిపి అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
కలెక్టర్ అంటే వైట్ కాలర్ జాబ్. ఎంచక్కా ఏసీ ఛాంబర్‌లో కూర్చొని పాలించడం వారి విధి. అధికారులతో సరైన రీతిలో పని చేయిస్తూ.. జిల్లా అభివృద్ధికి పాటుపడటం వారి కర్తవ్యం. అందుకే, కలెక్టర్లు చాలామంది ప్రశాంతంగా కనిపిస్తారు. వారిలో కోపం కనిపించడం చాలా అరుదు. అదే కలెక్టర్ రోడ్డు మీదకు వస్తే.. తేడా వచ్చేస్తోంది. కళ్ల ముందు తప్పు కనిపిస్తే.. వారిలో శాంతం నశిస్తోంది. లాక్‌డౌన్ అని చెప్పినా.. షాపులు తెరవద్దు అని సూచించినా.. అనవసరంగా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసినా.. ప్రజలు రూల్స్ పాటించడం లేదు. అందుకే కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కాబట్టే.. రోడ్డు మీదక వచ్చిన ఆ యువకుడిని చూసి ఛత్తీస్‌గఢ్ కలెక్టర్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అనే వారు ఉన్నారు. కోపం వస్తే మాటలతో మందలించాలి కానీ, ఖరీదైన సెల్‌ఫోన్ పగలగొట్టడం, చెంప మీద కొట్టడం ఏంటని మరికొందరు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ అలానే జరిగింది. లాక్‌డౌన్ నిబంధనలను గాలికి వదిదలేసి.. చెప్పుల షాపు తెరచిన యువకుడికి అదనపు కలెక్టర్ ఒక్కటిచ్చారు. అదేమంత తప్పు కాదనేది మరికొందరి మాట. ఇలా ఎవరి వాదన వారిదే.