ఎమ్మెల్యే బంధువులకు కాదు.. పేదలకు పంచండి!
posted on May 25, 2021 @ 5:35PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలంటూ ఆనందయ్య మందును పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే తన బంధుమిత్రులు, వ్యాపారస్తులకు ఇచ్చేందుకు మాత్రం ఈ అనుమతులు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆనందయ్యకు భద్రత కల్పిస్తున్నామని బయటకు చెబుతూ ఆయనను.. ఎమ్మెల్యే నిర్బంధంలో ఉంచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఆనందయ్యను నిర్బంధంలో ఉంచి ఎమ్మెల్యే మందు చేయించుకుంటుంటే జిల్లా మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారని నిలదీశారు. కనీసం కృష్ణపట్నం వచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. అనధికారికంగా నిర్బంధంలో తయారుచేయించి చీకట్లో పంపిణీ చేయించడం ఆపించండి..ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించండని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశం కృష్ణపట్నంలో టీడీపీ బృందం పర్యటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్.శివప్రసాద్ తదితరులు ఆనందయ్య ఇంటికి వెళ్లారు. ఆనందయ్య లేకపోవడంతో ఆయన భార్యతో మాట్లాడి వచ్చారు. ఆనందయ్య ఆధ్వర్యంలో సాఫీగా జరిగిపోతున్న ఆయుర్వేదం మందు పంపిణీని ఈ నెల 17న ఆపివేశారని ఈ సందర్భంగా సోమిరెడ్డి ఆరోపించారు. మళ్లీ ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించడంతో 40 వేల మంది వరకు వచ్చారని...గొడవ చోటుచేసుకుని లాఠీచార్జీకి దారితీసిందని చెప్పారు. ఆయుర్వేదం మందుకు మొదట ఐసీఎంఆర్ అనుమతి కావాలన్నారు..తర్వాత అవసరం లేదనన్నారని సోమిరెడ్డి విమర్శించారు. ఆయుష్ బృందం ఆనందయ్య ఆయుర్వేదానికి ఓకే చెప్పినా.. ఇప్పుడు మళ్లీ కేంద్ర బృందం నుంచి అనుమతులు రావాలంటున్నారని అన్నారు. అనుమతుల పేరుతో ఆనందయ్య మందును పేదలకు మాత్రం పంపిణీ చేయించకుండా అడ్డంకులు పెట్టారని మండిపడ్డారు.
ఇది కృష్ణపట్నం గ్రామానికి, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదని జాతీయ స్థాయి అంశమని సోమిరెడ్డి అన్నారు. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుతున్న దేవుడు ఆనందయ్య అని చెప్పారు. ఆనందయ్యకు మద్దతుగా విద్యార్థులు పోరాడాలని సోమిరెడ్డి పిలుపిచ్చారు. ఎమ్మెల్యేని కాదని ఆనందయ్య ఊరుకు వచ్చే దమ్ము మంత్రులు, ఎస్పీలకు లేదన్నారు. హెల్త్ మినిస్టర్ కు అసలు ఓపికే లేదన్నారు. అనధికారికంగా తయారుచేయించుకుని చీకట్లో పంపిణీ చేయించడం ఆపించండి..ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించండని ముఖ్యమంత్రిని కోరింది టీడీపీ బృందం ప్రత్యేక ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు మధ్య టైమ్ స్లాట్ ప్రకారం అందరికీ మందు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆనందయ్యను నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది.