విశాఖ వాసులకు మే నెల గండం?
posted on May 26, 2021 @ 11:00AM
మే నెల అంటే మండు ఎండాకాలం. భానుడు భగభగమండే సమయం. మే నెల వచ్చిందంటే ప్రస్తుతం విశాఖ వాసులు ఉలిక్కిపడుతున్నారు. అయితే వాళ్లు భయపడుతున్నది భానుడి ప్రతాపానికి కాదు.. ఏ ఫ్యాక్టరీలో మంటలు వస్తాయోమనన్న భయంతో హడలిపోతున్నారు. ఫ్యాక్టరీల్లో జరుగుతున్న ప్రమాదాల వల్ల వచ్చే పొగతో అల్లాడిపోతున్నారు. ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. గత సంవత్సరం మే నెలలోనే ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది చనిపోగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన స్టెరైన్ గ్యాస్.. కొన్ని నెలల వరకు విశాఖ వాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ఘటన ఇంకా మరవకముందే.. ఈసారి కూడా మే నెలలోనే హెచ్‌పీసీఎల్ లో మంటలు వచ్చాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కసారిగా కంపెనీ నుంచి దట్టమైన పొగలు.. ఆ వెంటనే ఆకాశానికి ఎగుస్తూ మంటలు వ్యాపించాయి. దీంతో మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో అలజడి మొదలైంది. ఈ మంటలు పది కిలోమీటర్ల దూరానున్న విశాఖపట్నం వరకు కనిపించాయి.పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో సమీప ప్రాంత ప్రజలు పరుగులు పెట్టారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనతో అంతా ప్రాణ భయంతో వణికిపోయారు.
విశాఖపట్నంలో పారిశ్రామిక ప్రమాదాలకు అంతం లేకుండా పోతోంది. ఏదో ఒక పరిశ్రమలో ప్రతి నెలా ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. హెచ్‌పీసీఎల్‌లో క్రూడాయల్ శుద్ధి చేసే యూనిట్-3లో మంటలు చెలరేగాయి. భారీ ప్రమాదమేనని అంతా భావించారు. అయితే అధికారులు తక్షణమే స్పందించడం, ఆ యూనిట్‌కు క్రూడాయిల్ సరఫరా నిలిపివేయడం, ఆరుకు పైగా అగ్నిమాపక శకటాలతో నీటిని విరజిమ్మడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. మూడో యూనిట్‌కు క్రూడాయల్‌ను సరఫరా చేసే ఓవర్‌హెడ్ పైపులైనులో లీకేజీ వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్ వినయ్‌చంద్ పేర్కొన్నారు. ఈ లీకేజీల వల్ల రెండుచోట్ల మంటలు చెలరేగాయి. ప్రధానంగా చమురుతో వ్యవహారం నడిపే సంస్థలో ప్రధాన పైపులైన్‌కే లీకేజీ ఏర్పడింది అంటే...నిర్లక్ష్యం వహించారని చెప్పక తప్పదు. దానిని తరచూ తనిఖీ చేయాల్సిన యంత్రాంగం ఏమైంది?, రోజువారీ తనిఖీల్లో భాగంగా పరీక్షించారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
విశాఖ పరవాడలోని ఫార్మాసిటీ, అచ్యుతాపురం, నక్కపల్లి పారిశ్రామికవాడలు, స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.హిందూస్థాన్ షిప్‌యార్డులో క్రేన్ పనితీరు పరిశీలిస్తుండగా విరిగిపడి ఎనిమిది మంది మరణించారు. రెండు వారాల క్రితం దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లో విదేశాల నుంచి తుక్కు తెచ్చే ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి పరవాడ మండలం భరణికం గ్రామంలో అనన్య ఫార్మా కంపెనీలో లిక్విడ్ అమోనియం గ్యాస్ లీకై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్ల మంటలు, ఒళ్లంతా దురదలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వినయ్‌చంద్ కంపెనీని తాత్కాలికంగా షట్‌డౌన్ చేయించి, విచారణకు ఆదేశించారు.
ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి సంబంధించి హైపవర్ కమిటీ సిఫారసులను అమలు చేయలేదు. అలాగే స్టీల్‌ప్లాంటులో ఏమి జరిగినా బయటకు పొక్కనివ్వరు. అది ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రమాదం జరిగిన రెండు మూడు రోజులు హడావిడి చేసి ఆ తరువాత దానిని పక్కన పెట్టేస్తున్నారు. దాదాపుగా రూ.20 వేల కోట్ల వ్యయంతో కొన్నేళ్లుగా విస్తరణ పనులు చేపడుతున్న హెచ్‌పీసీఎల్‌లో రోజూ వేయి మందికి తక్కువ లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రమాదం జరిగిన యూనిట్‌లో కూడా 100 మంది వరకు విధుల్లో ఉన్నారు. సైరన్ మోగడం వల్ల వారంతా అప్రమత్తమై ప్రాణాలు దక్కించుకున్నారు. లేదంటే...కొందరు బలి అయిపోయి ఉండేవారు.
పరిశ్రమల్లో భద్రత వ్యవహారాలు పరిశీలించే ఇన్‌స్పెక్టరీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్ ఆర్గనైజేషన్), బాయిలర్స్ విభాగం వంటివి పూర్తిస్థాయిలో అన్ని పరిశ్రమలను సకాలంలో తనిఖీ చేయలేకపోతున్నాయి. ఎవరికి వారు నిర్దేశించిన ప్రమాణాలు పాటిస్తూ, భద్రతకు తగిన జాగ్రత్తులు తీసుకోవాలని చెబుతున్నారు. కానీ కొన్ని సంస్థలు వాటిని పెడచెవిన పెడుతున్నాయి. నిపుణులు, అనుభవజ్ఞులైన వారిని పెట్టుకుంటే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, అరకొర పరిజ్ఞానం కలిగిన వారితో కీలకమైన, ప్రమాదకర యంత్రాల వద్ద పనులు చేయిస్తున్నాయి. అటువంటిచోట్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌లో మంగళవారం జరిగిన ప్రమాదానికి కూడా నిపుణులు ఆ యూనిట్‌లో లేకపోవడమే కారణమని కార్మికులు చెబుతున్నారు. ఆ యూనిట్‌లో క్రూడాయిల్ శుద్ధి ప్రక్రియలో పొగలు, మంటలు వస్తుంటాయి. వాటిని నిపుణులు చాకచక్యంగా అదుపు చేసుకుంటూ పనిచేస్తారు. మంగళవారం సీనియర్లు లేకపోవడంతో ఇటీవలె విధుల్లో చేరిన వారికి ఆ బాధ్యత అప్పగించారని, వారు పొగలు వచ్చినప్పుడు సరిగ్గా వ్యవహరించకపోవడంతో అవి మంటలుగా మారి ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు.
కరోనా సమంలో పరిశ్రమలను నడపడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని అధికారులు పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. అధికారులు ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు. హెచ్‌పీసీఎల్, స్టీల్‌ప్లాంటు, షిప్‌యార్డు, ఫార్మా సిటీ వంటి భారీ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే విచారణకు ఆదేశించినా, ఆ తరువాత నివేదిక బయటకు రాకుండా, ఎటువంటి చర్యలు లేకుండా కాలం గడిపేస్తున్నారు. అధికారులతో తీరుతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ప్రాణభయంతో వణికిపోతూనే ఉన్నారు. ఇక మే నెల వచ్చిందంటే చాలు వణికిపోతున్నారు విశాఖ వాసులు.