కమలంలో ఈటల ఇమడగలరా?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని తీసుకున్న నిర్ణయం, ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ నియోజక వర్గం నుంచి పోటీచేసేందుకు ఇప్పటికే కర్చీఫ్ వేసుకు కూర్చున్న, మాజీ మంత్రి, మాజీ టీడీపీ నేత పెద్ది రెడ్డి జిల్లా నేతలను సంప్రదించకుండా, రాష్ట్ర నాయకత్వం, ఈటలను ఎలా పార్టీలో చేర్చుకుంటారని, అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అలాగే, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న, మాజీ మంత్రిని పార్టీలోకి తీసుకుని ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని కూడా పెద్ది రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈటలకు వ్యతిరేకంగా పోరాడిన తాను ఇప్పుడు ఆయనతో కలిసి ఎలా పనిచేస్తానని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే, పార్టీలు మారడం, పార్టీలు మారిన ప్రతి సారీ మాటలు మార్చడం రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. నిజానికి పెద్ది రెడ్డి కూడా బీజేపీలో పుట్టి బీజేపీలో పెరిగిన నాయకుడు కాదు. ఆయన కూడా అనేక పార్టీలు మారి వచ్చిన వారే. నిజానికి ఈటలకు ఇది తొలి (ఫిరాయింపు) అనుభవం మాత్రమే. పెద్దిరెడ్డికి అయితే నాలుగైదు సార్లయినా గోడ దూకారు. అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి దేవేందర్ గౌడ్ పార్టీ, నవ తెలంగాణ పార్టీలోకి వెళ్లారు, దేవేందర్ గౌడ్ నవ తెలంగాణను చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంలో విలీనం చేస్తే, ఆయనతో పాటు ఈయన కూడా ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్ళీ, టీడీపీలోకి వచ్చారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు ... సో ... ఈ అన్ని మజిలీలలో ఆయన తిట్టిన నోటితో పొగడడం, పొగిడిన నోటితో తిట్టడం చాలా సందర్భాలలో చేసే ఉంటారు. తెలుగు దేశం నుంచి బయటకు వెళ్ళిన సమయంలో ఆయన టీడీపీని, బీజేపీలో చేరక ముందు ఆ పార్టీని, ఆపార్టీ నాయకులను కూడా పెద్దిరెడ్డి విమర్శించారు. ఇప్పుడు కూడా ఆయన మాజీ మిత్రులను మడత పెడుతూనే ఉన్నారు.
సరే, ఆయన విషయం అలా ఉంటే, అసలు ఈటల బీజేపీలో ఇమడ గలరా, అనేది అన్నిటికంటే కీలక ప్రశ్నగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల రాజకీయ నేపద్యాన్ని గమనిస్తే, ఆయన రాజకీయ జీవితం అతివాద వామపక్ష భావజాలంలో మొగ్గ తొడిగింది. ఆయన కొంత కాలం నక్సల్ ఉద్యమంలోనూ పని చేశారని అంటారు. అలాగే, ప్రాంతీయ ఉద్యమాలలో కీలక పాత్రను పోషించారు. సుమారు 18 సంవత్సరాల పాటు, కేసీఆర్ శిష్యరికం చేశారు. అలాంటి ఈటల బీజేపీ జాతీయ భావజాలం, హిందుత్వ నినాదం, విధానం చట్రంలో ఇమడగలరా? అనేది ఒకకీలక ప్రశ్న. అదీ గాక, ఎంత చెడ్డా తెరాసలో ఆయనకు ఒక స్థానం గుర్తింపు ఉన్నాయి. బీజేపీలో ఆయనకు అంత గుర్తింపు ఉండక పోవచ్చును. ఎందుకంటే, బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గర్భగుడి ప్రవేశం, అంత ఈజీ కాదు. అలాగని,పదవులు ఉండవని కాదు, పదవులు ఉంటాయి ప్రవేశమే ఉండదు. అందుకే, ఇతర పార్టీలలో కీలక పదవులు, బాధ్యతలు పోషించిన వారు, బీజేపీలో ఎక్కువ కాలం ఉన్న సందర్భాలు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల విషయాన్నే తీసుకుంటే, దగ్గుబాటి వెంకటేశ్వర రావు నుంచి నాగం జనార్ధన రెడ్డి వరకు అనేక మంది సీనియర్ నాయకులు బీజేపీ చేరినంత వేగంగా తిరిగి వెళ్ళి పోయారు. అయితే, కేసీఆర్ అష్టదిగ్భంధనంలో చిక్కుకున్న ఈటలకు బీజేపీని కాదనే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం రక్షణ కోసం అయినా ఆయన బీజేపీ చేరక తప్పని పరిస్థితిలో చిక్కుకు పోయారు. అందుకే నువ్వొకందుకు పోస్తుంటే, నేనోకందుకు తాగుతున్నాను అన్నట్లుగా, ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. అయితే, బీజేపీలో ఆయన పయనం ఎందాక .. అంటే ... చెప్పడం కొంచెం కష్టమే.