కమల్ హాసన్ రాజకీయ కథ ముగిసినట్లేనా ?
కమల్ హసన్ చాలా గొప్ప నటుడు ... ఒక్క తమిళనాడు ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతదేశ ప్రజలు అభిమానించే నటుడు. సందేహం లేదు. ఆయన నటించిన సినిమాలను ప్రజలు ఆదరించారు. తెర మీద ఆయన బొమ్మ చూసి ఈలలు వేసారు... హరతులిచ్చారు. కానీ, అదే కమల్ రాజకీయ వేషం కడితే, తమిళ ప్రజలే ఛీ’ పొమ్మని చీదరించుకున్నారు. నిజమే, తమిళ రాజకీయాల సినీ పరిశ్రమ ప్రభావం కొంచెం చాలా ఎక్కవే. అన్నాదురై మొదలు ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత వరకు ఇంచుమించుగా ఓ అర్థ దశాబ్దం పై తమిళ రాజకీయాలలో చక్రం తిప్పిన హేమాహేమీలుఅందరూ ఇంట(సినిమా రంగం) గెలిచి, రచ్చ (రాజకీయ) రంగంలో రాణించారు. అయితే, అదే తమిళనాడులో శివాజీ గనేషన్ మొదలు కమల్ హసన్ వరకు చాలా మంది మహా నటులు రాజకీయ యవనికపై, రాణించలేక పోయారు.
కమల్ విషయాన్నే తీసుకుంటే, ఆయన స్థాపించిన, ‘మక్కల్ నీధి మయ్యమ్’(ఎంఎన్‌ఎం) పార్టీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, చాలా ఘనంగా ఓడిపోయింది. ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ, జన సేన కంటే కూడా ఘోరంగా ఓడి పోయింది. జన సేనకు కనీసం ఒక్క సీటైన దక్కింది, (సరే ఆ గెలిచిన ఒక్క ఎమ్మెల్ల్యే గోడ దూకేశారు అనుకోండి అది వేరే విషయం)కమల్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కలేదు. చివరకు కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హసన్, బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఓటమి కంటే, బీజేపీ చేతిలో ఓడిపోవడం కమల్ హసన్ను, అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుగా మరింత క్షోభకు గురిచేసిందని, ఆయనే స్వయంగా వాపోయారు.
అదలా ఉంటే, కమల్ పార్టీ కథ, ఎన్నికల తర్వాత చాలా ఇంటరెస్టింగ్’గా సాగుతోంది. పార్టీ నాయకులు వరస పెట్టి, కమల్ సారు వాడికి, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎన్నో ఆశలతో, ఏకంగా ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కన్న కమల్’కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వుంది. ఇప్పటికే, పార్టీ ఉపాధ్యక్ష్డుడు ఆర్ మహేంద్రన్, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు, ప్రముఖ పర్యావరణ కార్యకర్త పద్మ ప్రియ సహా అనేక మంది ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా, పార్టీ పురుడు పోసుకున్న క్షణం నుంచి కమల్ వెంట ఉన్న,పార్టీ కీలక నేత సీకే కుమార్ వెల్’ సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతే కాదు, ఆయన పోతూ పోతూ రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన, పనికి రాదని కమల్ వ్యవహార సరళిని తప్పు పడుతూ ఒక చురాక అంటించారు. కమల్ హసన్, ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యూహ బృందం తప్పటడుగులు వేయడంవల్లనే, పార్టీ ఘోరంగా ఓడి పోయిందని మరో వాత పెట్టారు. పార్టీ ఓటమికి కమలే కారణమని తేల్చి చెప్పి మరీ గుడ్ బై చెప్పారు.
కాగా, ఈ రాజీనామాల పరపర ఇలాగే, కొనసాగితే, కమల్ పార్టీ ‘ఎంఎన్‌ఎం’ కూడా మఘలో పుట్టి పుబ్బలో మాయమై పోయిన పార్టీల జాబితాలో చేరిపోవదానికి ఎంతో కాలం పట్టదని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాదు ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపక పోయినా మన పవన్ కళ్యాణ్, తమిళ రాజకీయ తెరపై, విజయకాంత్ అప్పుడప్పుడు అలా మెరుస్తూనే ఉన్నారు. కానీ, కమల్ హసన్ ... కథ ముగిసినట్లేనని, విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కమల్ కథ ఇలా ఉంటే, కన్నడ సినీ నటుడు ఉపేంద్ర తనకు ముఖ్యమంత్రి అయిపోవాలని మహా కోరికగా ఉందని, తమ మనసులోని మాటను ట్విట్టర్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఆయన ‘చిరు’ కోరిక తీరుతుందా..లేక ఆయన కన్నడ కమల్’ లా మిగిలిపోతారో .. చూడాలి.