ఫ్రంట్ లైన్ వారియర్స్ భోజనానికి బ్రేక్.. వైసీపీ ఎమ్మెల్యే దుర్మార్గం
posted on May 25, 2021 @ 9:11PM
అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు అన్నట్లుగా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు.. అధికార వైసీపీ నేతల వ్యవహారం. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకు అండగా నిలవడంలోప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార వైసీపీ నేతలైతే పత్తా లేకుండా పోయారనే విమర్శలు ఉన్నాయి. కరోనా సోకి తీవ్ర కష్టాల్లో ఉన్నా కనీస సాయం కూడా చేయడం లేదని జనాలు మండిపడుతున్నారు. తాము సాయం చేయకపోగా.. స్వచ్చందంగా సేవ చేస్తున్న సంస్థలను కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తాజాగా వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచితంగా వ్యవహరించారు. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సేవచేస్తున్న వారిపై ఎమ్మెల్యే కన్నెర్ర జేశారు. రోగులకు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేస్తున్నారు. అయితే తక్షణమే శివశక్తి ఫౌండేషన్ సభ్యులను భోజనం పంపిణీ నిలిపివేయాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆదేశించారు. ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా పోలీసులు వెళ్లి భోజనం పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. భోజనం పంపిణీ చేస్తున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై పేద ప్రజలు, స్థానికుల అసహనం వ్యక్తం చేశారు.
కరోనా కష్టాల్లో కనిపించకుండా పోయిన వైసీపీ నేతలు... ఇతరుల సాయం చేయకుండా అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమ వైఫల్యం భయటపడుతుందనే భయంతోనే ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కరోనా రోగులకు సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు భోజనం పెట్టకుండా అపేయించడం ఏంటని మండిపడుతున్నారు.