రహస్యంగా ఆనందయ్య మందు!.. పాలకుల కుట్రేనా? దాచేయ్.. దోచెయ్..
posted on May 26, 2021 @ 11:34AM
ఆనందయ్య. వారం రోజుల పాటూ మారుమోగిన పేరు. ఆయన ఇచ్చే మందు.. కరోనా బాధితుల పాలిట సంజీవనిలా పని చేస్తోంది. చూట్టానికి నల్లటి చిన్న ప్యాకెట్. ఆ చిన్న ప్యాకెట్‌లోనే ప్రాణాలు నిలిపే ఔషదం దాగుంది. చావు బతుకుల మధ్య ఉన్నవాళ్లైనా.. కంట్లో నాలుగు చుక్కలు వేయగానే నిమిషాల్లో లేచి కూర్చుంటున్నారు. ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పడిపోయిన వాళ్లైనా.. ఆ మందుతో ఉన్నపళాన లేచి కూర్చొంటున్నారు. ఇక, కరోనా సోకక ముందే ఆ మందు తీసుకుంటే.. వైరస్ వారి దరిదాపులకు కూడా రావడం లేదు. అది మందు కాదు.. మహిమాన్వితం. నిజంగా అద్భుతం. ఆ అసాధ్యం ఆనందయ్యకే సాధ్యం. అందుకే ఆనందయ్య పేరు ఒక్కసారిగా యావత్ దేశంలో మారిమోగుతోంది.
కట్ చేస్తే, ఆనందయ్య కనిపించడం లేదు. వారం రోజులుగా ఆయన అడ్రస్ లేడు. ఎక్కడున్నాడో తెలియదు. ఏం చేస్తున్నాడో తెలియదు. చూద్దామన్నా ఆనందయ్య ఆచూకీ తెలీటం లేదు. ఆయన తయారు చేస్తున్న మందు పంపిణీని ప్రభుత్వం ఆపేసింది. ఆయుష్, ఐసీఎమ్ఆర్ అనుమతులు కావాలంటూ కండీషన్ పెట్టింది. ఆయూష్ సైతం ఆనందయ్య మందును ఓకే చేసింది. అన్ని పరీక్షల్లోనూ పాజిటివ్ ఫలితాలే వచ్చాయి. అయినా, ఆనందయ్య బయటకు రావడం లేదు, ఆయన తయారు చేసే మందు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. మందు మాట సరే.. ముందు ఆ మనిషి ఏమై పోయాడు? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇదే ఆసక్తికరం.. అంతకు మించి అనుమానాస్పదం.
ఆనందయ్య విషయంలో కొన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆనందయ్య బయటకు కనిపించకపోవడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. పాలకులు ఆయన్ను హైజాక్ చేశారని చెబుతున్నారు. ఎవరి కంటికి కనబడకుండా.. గప్‌చుప్‌గా ఆనందయ్యతో సీక్రెట్‌గా పెద్ద ఎత్తున మందు తయారు చేయిస్తున్నారట. కృష్ణపట్నం గోపాలపురంలోని ఆర్-బ్లాక్‌లో పోలీసుల వలయంలో ఉన్న ఆనందయ్యతో ప్రతి రోజు వేల మందికి సరిపడే మందుని అనధికారికంగా తయారు చేయిస్తున్నారని సమాచారం. బకెట్ల కొద్దీ మందును.. ప్రభుత్వంలోని పెద్దలకు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధుల బంధువులు, బడా పారిశ్రామిక వేత్తలకు నిత్యం సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. రాత్రి వేళ.. మూడో కంటికి కనిపించకుండా కార్లలో పక్క రాష్ట్ర ప్రముఖులకు, ఢిల్లీ పెద్దలకు సైతం తరలిస్తున్నారని అంటున్నారు. ఆ విషయం బయటకు పొక్కకుండా.. కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించి.. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి.. లోలోన మందు తయారీ, సరఫరా చేసేస్తున్నారట. తమ వారందరికి ఆనందయ్య మందు అందాక.. ఇక సరిపోతుంది అనుకున్నాక.. అప్పుడు ఆనందయ్యను, ఆయన మందును బయటకు వదులుతారని తెలుస్తోంది.
ఆనందయ్యను వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చి మరీ రహస్యంగా ఆయనతో మందు తయారీ చేయిస్తున్నారట. ఇటీవల సిటీ నియోజకవర్గ పరిధిలోని పుట్టా ఎస్టేస్‌లోని ఆర్ఆర్ క్యాటరింగ్‌లో మందు తయారీ జరిగిందని వినికిడి. ఆనందయ్యని వంట మాస్టారుగా మార్చేశారని ప్రతిపక్ష పార్టీల నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ఎమ్మెల్యే బంధువులకు కాదు.. ఆనందయ్య మందును పేదలకు పంచండంటూ టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలంటూ ఆనందయ్య మందును పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని.. ఎమ్మెల్యే తన బంధుమిత్రులు, వ్యాపారస్తులకు ఇచ్చేందుకు మాత్రం ఈ అనుమతులు అవసరం లేదా అని సోమిరెడ్డి ప్రశ్నించడం కలకలం రేపింది. ఆనందయ్యకు భద్రత కల్పిస్తున్నామని బయటకు చెబుతూ ఆయనను.. ఎమ్మెల్యే నిర్బంధంలో ఉంచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. అనధికారికంగా నిర్బంధంలో మందు తయారు చేయించి చీకట్లో పంపిణీ చేయించడం ఆపించాలని.. ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించాలని.. ఆనందయ్యను నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని సోమిరెడ్డి డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.