హరీష్ రావుకు అగ్ని పరీక్ష? కేటీఆర్ కోసం బలిపెడుతున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు ఎలా ఉంటాయో, ఊహించడం ఆయన ప్రత్యర్దులకే కాదు, సన్నిహిత సహచరులకు కూడా ఒక పట్టాన అర్ధం కాదు. నరేంద్ర మొదలు ఈటల వరకు ఆయనకు సన్నిహితంగా మెలిగిన ఈ ఒక్కరికీ కూడా, ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు అర్థం కాలేదు. అందుకే అందరూ అలా చతికిల పడి పోయారు. ఇది చరిత్ర.
ఇక నడుస్తున్న చరిత్రలోకి వస్తే ఇటీవల బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఆయన సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో చెక్ పెట్టే బాధ్యతను ముఖ్యంత్రి ముందు మంత్రి గంగులకు అప్పగించారు. ఇప్పడు ఆ ఆ బాధ్యతను హరీష్ రావుకు బదిలీ చేశారు ఈ బదిలీలోనూ కేసీఅర్ మాస్టర్ స్ట్రాటజీ దాగుందని, ఒక విధంగా ఇది హరీష్ రావుకు అగ్నిపరీక్ష అనుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. హరీష్ రావుకు కేసీఆర్’తో ఉన్నది కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య రక్త బంధం కూడా వుంది. కేసీఆర్ రాజకీయ చాణక్యానికి కూడా హరీష్ నిజమైన వారసుడు అంటారు. అలాగే హరీష్ రావుకు ఈటలతో ఉన్నది కూడా కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదు, రాజకీయ స్నేహ బంధం. అంతే కాదు, భవిష్యత్ లో ఇద్దరూ కలిసి ప్రయాణం చేయవలసి ఉందని, అందుకు ఇద్దరూ సిద్ధమయ్యారనే చర్చ ఒకటి రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెరాస వర్గాల్లో చాలా కాలంగా వినవస్తోంది. నిజానికి, ఇద్దరూ నిన్న మొన్నటి వరకు ఒకే పడవలో ప్రయాణించారు. ఎవరో కాదు, ఈటల స్వయంగా, కేసీఆర్ అసలు లక్ష్యం హరీష్ అని చెప్పకనే చెప్పారు. అలాగే, తనతో పాటు హరీష్ కూడా అవమానాలకు గురయ్యారని, ఒకటి రెండు సందర్భాలలో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారని, కలిసి ఏడ్చిన సందర్భాలున్నాయని కూడా ఈటల చెప్పినట్లు వార్తలొచ్చాయి.
తెరాసలో సాగుతున్నఈ రాజకీయ హైడ్రామాకు మూల కారణం ఈ ముగ్గురు కాదు.. కేటీఆర్ అనే చర్చ జరుగుతోంది. కేటీఅర్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది కేసీఆర్ ఫామిలీలో ఒక వర్గం ఆకాంక్ష. ఈమేరకు కేసీఆర్ మీద వత్తిడి వస్తోందని, రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న విశ్లేషణ లేదా విమర్శ. నిజానికి ఇప్పటికే కేటీఆర్ పట్టాభిషేకానికి అటు రాజకీయ వర్గాలు, ఇటు మీడియా రెండు మూడు సందర్భాలలో ముహూర్తాలు కూడా కూడా పెట్టాయి. అయితే,అవేవీ నిజం కాలేదు. అలాగే, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్’ అని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు వంటి వారు, బహిరంగ వేదిక నుంచి అదికూడా, కేటీఅర్ సమక్షంలోనే, ప్రకటించారు. అలాగే ఇతర నాయకులూ కూడా, ‘అయితే ఏంటి ? ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి’ అంటూ అధికార మార్పిడికి పచ్చ జెండా ఊపారు. అయినా, కారణాలు ఏవైనా, ‘వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే’ అన్నట్లు కేటీఆర్ పట్టాభిషేకానికి ఇంతవరకు ముహూర్తం కుదరడం లేదు.
నిజానిజాలు ఎలా ఉన్నా కేటీఆర్ ను ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని చేయడం వలన సమస్యలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారని, ముఖ్యంగా కేటీఆర్’కు పగ్గాలు అప్పగిస్తే పార్టీలో ముసలం తప్పదని కేసీఆర్ గ్రహించారని అంటున్నారు, అందుకే ఒక వ్యూహం ప్రకారం ముందు, ఈటల, హరీష్ మధ్య దూరం పెంచే వ్యుహంతోనే కేసీఆర్.. హుజురాబాద్ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి అల్టిమేట్’గా హరీశ్’ను బలహీన పరచడమే కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ వ్యూహాన్ని గమనించే ఈటల.. రాజీనామాకు, ఉప ఎన్నికకు తొందర పడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల గంగులతో జరిగిన జుగల్బందీ లో కూడా ఈటల.. ఇప్పుడే ఉప ఎన్నిక రాదని చెప్పారు. నిజానికి బంతి ఇప్పడు ఈటల కోర్టులో ఉంది. ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. లేదంటే లేదు. అదే విధంగా, కేసఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం హరీష్ రావు మామ చేయి వదలరని, ఆమేరకు ఆయన కేసీఆర్ కు మాటిచ్చారని అంటున్నారు. కేటీఆర్ సహా ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా, తదనంతర పరిణామాలకు తన బాధ్యత ఉండదని కూడా హరీష్ ఎప్పుడోనే స్పష్టం చేశారని చెబుతున్నారు. అందుకే ముందు హరీష్’ను బలహీన పరిచి, ఆ తర్వాతనే కేటీఆర్’ను ముఖ్యంత్రి చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రస్తుత ఎపిసోడ్ నడుస్తోందని రాజకీయ వర్గాల సమాచారం. అయితే రాజకేయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతోందో ...
ఎవరికి తెలుసు..