మద్యం సేల్స్ ఢమాల్.. ప్రభుత్వం పరేషాన్!
posted on May 25, 2021 @ 7:10PM
మండు వేసవిలో చల్లటి బీరు గొంతులో జారుతుంటే ఆ కిక్కే వేరప్పా.. అనేది మందుబాబుల మాట. అందుకే, ఎండాకాలం వచ్చిందంటే చాలు తెలుగురాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు రాకెట్‌లా దూసుకుపోతుంటాయి. వచ్చిన స్టాక్ వచ్చినట్టే అమ్ముడైపోతుంటుంది. ఒక్క బీర్లు అనే కాదు.. బ్రాందీ, విస్కీల సేల్స్ కూడా సర్రున ఎగబాకుతుంటుంది. అయితే.. లాక్‌డౌన్, కర్ఫ్యూల కారణంగా ఈ ఏడాది మద్యం సేల్స్ భారీగా పడిపోయాయి. సర్కారు ఖజానాకు పెద్ద చిల్లే పడింది.
ఉదయం ఆరు గంటలకే వైన్స్ ఓపెన్ చేస్తున్నారు. పాల ప్యాకెట్లకు పోటీగా లిక్కర్ అమ్మకాలు సాగిపోతున్నాయి. మద్యం షాపుల ముందు పెద్ద పెద్ద క్యూలైన్లు. ఇంకేం.. ఫుల్లు సేల్సు అనిపిస్తుంటుంది. పైపైన చూస్తే.. అలానే కనిపించినా.. లెక్కలేస్తే మాత్రం లిక్కర్ సేల్స్.. బీరు చల్లదనం తగ్గినట్టు తగ్గిపోతున్నాయి. వైన్స్ అమ్మకాలంతా సాయంత్రం, రాత్రి వేళలోనే జరుగుతుంటుంది. లాక్‌డౌన్‌తో పెందలాడే సరుకు సర్దేస్తుండటంతో మద్యం అమ్మకాలు మసకబారుతున్నాయి. ఆ మేరకు ప్రభుత్వానికి భారీగా రాబడి తగ్గిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైన్స్ సేల్స్ మరీ వెలవెలపోతున్నాయి. షాపుల సంఖ్య తగ్గించడమో.. కర్ఫ్యూ ప్రభావమో తెలియదుగానీ రికార్డు స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి. కర్ఫ్యూ కారణంగా మద్యం దుకాణాల సమయాలను తగ్గించడంతో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో అమ్మకాలు బాగా తగ్గాయి. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు.. ఏపీలో బీరు, లిక్కర్ కలిపి మొత్తం 21,31,558 కేసుల విక్రయాలు జరిగాయి. మే నెల వచ్చే సరికి.. 1వ తేదీ నుంచి 23 వరకు 16,74,343 కేసులే అమ్ముడయ్యాయి. ఆ లెక్కన మద్యం అమ్మకాలు 21.45 శాతం తగ్గినట్లు తేలింది.
ఈసారి వేసవిలో బీరు జోరు బాగా తగ్గింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 28,184 బీరు కేసులు విక్రయించగా.. మే నెలలో కర్ఫ్యూ అమలైన 5వ తేదీ నుంచి 23 వరకు రోజుకు సగటున కేవలం 13,423 బీరు కేసులే విక్రయించారు. దీంతో బీరు అమ్మకాల్లో 52.37 శాతం తగ్గుదల నమోదైందనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. బ్రాందీ, విస్కీ వంటి లిక్కర్ అమ్మకాలు కూడా బాగా తగ్గాయి.
ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 63,455 కేసుల లిక్కర్ విక్రయించగా.. మే నెలలో 5 నుంచి 23 తేదీ వరకు రోజుకు సగటున 56,665 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. లిక్కర్ అమ్మకాలు 10.70 శాతం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక మే నెలలో మద్యంపై వచ్చే ఆదాయం కూడా బాగా తగ్గింది. ఏప్రిల్‌లో 1 నుంచి 23 వరకు మద్యం అమ్మకాలతో రూ.1,531.97 కోట్లు ఆదాయం వచ్చింది. అదే మే నెలలో అయితే 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.1,318.17 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. మద్యపాన నిషేధం దిశగా ఆడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం అమ్మకాల తగ్గుదలను పెద్దగా పట్టించుకునే అవకాశం లేదనేది ప్రభుత్వ వర్గాల మాట.