కరోనాతో సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి
posted on May 25, 2021 @ 7:10PM
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కరోనా సోకి రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య మృతి చెందారు. గత పదిరోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అదనపు కలెక్టర్.. మంగళవారం ఉదయం చనిపోయారు. నల్గొండ జిల్లాకు చెందిన అంజయ్య... ఆ జిల్లాలో ఆర్డీవోగా, ఆర్వోగా, డీఆర్డీఏ పీవోగా పని చేశారు. అదనపు కలెక్టగా ప్రమోషన్ వచ్చాక కొంత కాలంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్నారు. అంజయ్య మృతితో సిరిసిల్ల జిల్లా ఉద్యోగులు విషాదం మునిగిపోయారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య మృతి బాధాకరమన్నారు మంత్రి కేటీఆర్. మంచి అధికారిని కోల్పోయామని మంత్రి కేటీఆర్ అంజయ్య మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొద్ది కాలంలోనే జిల్లాలో విస్తృత సేవలు అందించారని చెప్పారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ సౌమ్యుడుగా అందరి మనస్సుల్లో స్థానం సంపాదించారన్నారు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో పని చేశారని గుర్తు చేశారు. ఒక మంచి అధికారిగా అర్జీదారులకు ప్రతి నిత్యం అందుబాటులో ఉంటూ, అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించిన అదనపు కలెక్టర్ అంజయ్య మరణించడం జిల్లాకు తీరని లోటని కేటీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు మనోదైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
అడిషనల్ కలెక్టర్ అంజయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ . రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ఒక మంచి అధికారిని కోల్పోయిందన్నారు. కలెక్టర్. కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని, ఆయన లేరనే వార్త నమ్మలేకపొతున్నామని విచారం వ్యక్తం చేశారు. అన్ని శాఖలతో సత్సంబంధాలు నెలకొల్పి అనతి కాలంలోనే మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారని చెప్పారు.