ఆన్‌లైన్ క్లాస్‌లో అసభ్య వేషాలు.. టవల్ చుట్టుకొని పాఠాలు.. టీచర్ అరెస్ట్..
posted on May 25, 2021 @ 6:00PM
స్కూల్ మాట మర్చిపోయి చాలా రోజులవుతోంది. ఇప్పుడంతా ఆన్‌లైన్ క్లాసెస్. ఎవరు చెబుతున్నారో.. ఏం చెబుతున్నారో.. ఎవరు వింటున్నారో.. అసలేం అర్థంకాని పరిస్థితి. ఏ మొబైల్‌ఫోనో, లాప్‌టాపో పట్టుకొని.. ఓ రూమ్‌లో కూర్చొని పాఠాలు వింటున్నట్టు యాక్ట్ చేస్తున్నారు పిల్లలు. పెద్దలు సైతం వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా.. ఓ టీచర్ పాఠాలు చెప్పడానికి బదులు.. వెకిలి వేశాలు వేయడం స్టార్ట్ చేశాడు. ఆన్‌లైన్‌లో అసభ్య కంటెంట్‌ను పంపించడం, బ్యాడ్ మెసేజ్‌లు పెడుతూ వేధించేవాడు. ఆలస్యంగా విషయం వెలుగు చూడటంతో పోలీస్ కేసు నమోదైంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
ఆన్ లైన్ క్లాసుల బోధన సందర్భంగా అసభ్యంగా ప్రవర్తించిన 59 ఏళ్ల ఉపాధ్యాయుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని టాప్ స్కూళ్లలో ఒకటైన శేషాద్రి బాల విద్యా భవన్ లో ఈ దారుణం జరిగింది. అసభ్యంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిని ఆ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. పోస్కో (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను కాపాడే చట్టం) యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతనిని అరెస్ట్ చేశారు.
ఆన్ లైన్ క్లాసుల్లో అసభ్య కంటెంట్‌తో పాటు కేవలం టవల్ మాత్రమే చుట్టుకుని, తన ఛాతీని చూపిస్తున్నాడని విద్యార్థులు ఫిర్యాదులో తెలిపారు. ఆయన గురించి స్కూల్ యాజమాన్యానికి ముందే తెలిసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్టూడెంట్స్ ఆరోపించారు.
ఈ ఉదంతం.. డీఎంకే ఎంపీ కనిమొళి దృష్టికి రావడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తాను షాక్ అయ్యానని ఆమె అన్నారు. విద్యార్థుల ఫిర్యాదుపై తగు విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎంపీ కనిమొళి స్పందించిన వెంటనే స్కూల్ మేనేజ్‌మెంట్ ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. అతని దుష్ప్రవర్తన గురించి తమకు ఇంత వరకు తెలియదని తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇకపై ఇలాంటి అంశాలపై తాము చాలా సీరియస్ గా ఉంటామని తెలిపింది. విద్యార్థుల మానసిక పరిస్థితి, భావోద్వేగాలకు తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని చెప్పింది.