ఎంపీ రఘురామ డిశ్చార్జ్.. వెంటనే ఢిల్లీకి..
posted on May 26, 2021 @ 12:05PM
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్ అయ్యారు. ఆ వెంటనే బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. డిశ్చార్జ్ తర్వాత గుంటూరు మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పేపర్స్ సడ్మిట్ చేయడానికి పది రోజుల సమయం ఉండటంతో.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు రఘురామ. ఆర్మీ హాస్పిటల్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరుతారని తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు రఘురామ. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామకృష్ణరాజు నేరుగా దిల్లీ వెళ్లనున్నారు. రఘురామను మరోసారి అదుపులోకి తీసుకునేందుకు ఏపీ సీఐడీ ఆర్మీ హాస్పిటల్ దగ్గర కాపు కాసి ఉందంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో.. రఘురామ వెంటనే ఢిల్లీ వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది.