బీజేపీతో కాదు.. సొంత పార్టీపై ఈటల క్లారిటీ.. త్వరలో రాజీనామా..
posted on May 26, 2021 @ 1:45PM
ఈటల తేల్చేశారు. బీజేపీలో చేరడం లేదని తేల్చి చెప్పేశారు. పనిలో పనిగా.. తాను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ స్పష్టం చేశారు. ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారంటూ రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈటలతో పలువురు బీజేపీ నేతలు భేటీ అయ్యారని.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ నేత ఒకరు హైదరాబాద్ వచ్చి ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారని అంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా రాజేందర్ కలిసి చర్చించారనే ప్రచారం సాగుతోంది. అయితే, రాజేందర్‌ను కలిశారని జరుగుతున్న ప్రచారంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను ఈటలను కలవలేదు.. ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్‌లో ఈటలతో చర్చలు జరుపుతానన్నారు కిషన్‌రెడ్డి.
కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో ఇక ఈటల రాజేందర్ గులాబీ కండువ తీసేసి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ అంతా భావిస్తున్నారు. అయితే, బయట ప్రచారం ఇలా ఉంటే.. ఈటల రాజకీయ వ్యూహం మరోలా ఉన్నట్టు కనిపిస్తోంది. తాను బీజేపీలో చేరుతానంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం.. తన రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని భావించారు. మరింత ఆలస్యం చేస్తే.. అంతా అదే ఫిక్స్ అవుతారని అనుకున్నారో ఏమో గానీ.. అలాంటిదేమీ లేదంటూ.. తాను బీజేపీలో చేరడం లేదంటూ ఘంటాపథంగా చెప్పేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. మద్దతు కోరేందుకే బీజేపీ నేతల్ని కలిశానని అన్నారు.
తన జెండా, అజెండా.. సెపరేటేనని ఈటల స్పష్టం చేశారు. స్వతంత్రంగానే ఉంటానని.. ఎవరితోనూ కలవబోనని చెప్పారు. అంటే.. త్వరలోనే కొత్త పార్టీ పెడతారనేగా అర్థం? అవును, ఈటల మాటలు కొత్త పార్టీ దిశగా సంకేతాలు ఇచ్చాయి. బీసీ ఎజెండాగా ఈటల టీఆర్ఎస్‌ను వీడి వేరుకుంపటి పెట్టుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఆ అనుమానంతోనే ఈటలను కేబినెట్ నుంచి వెళ్లగొట్టారు కేసీఆర్. కొత్త పార్టీ పెట్టడమంటే పాన్‌షాప్ పెట్టినంత ఈజీకాదంటూ పరోక్షంగా హెచ్చరించారు. అయినా.. గులాబీ బాస్ కింద గులామ్‌గిరి చేయడం ఇష్టం లేక.. గులాబీ జెండాకు మేము బానిసలం కాదంటూ.. రెబెల్ జెండా ఎగరేశారు ఈటల రాజేందర్. మంత్రి పదవిని కోల్పోయినా.. కేసులపై కేసులు పెడుతున్నా.. కేడర్‌ను తన నుంచి దూరం చేస్తున్నా.. ఎక్కడా తగ్గకుండా.. సైలెంట్‌గా తనపని తాను చేసుకుపోతున్నారు. కొత్త పార్టీ దిశగా ఇప్పటికే కసరత్తు చేశారని.. తెలంగాణలో అన్యాయానికి గురైన వర్గాలను, నాయకులను కలుపుకుని.. కేసీఆర్‌పై దండయాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లు ఈటలకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని సమాచారం.
కొత్త పార్టీ ఖాయమని.. తన ఉనికిని హుజురాబాద్ ఉప ఎన్నికతో బలంగా చాటుకోవాలని ఈటల భావిస్తున్నారు. అందుకే, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని తాజాగా మరోసారి ఆయనే స్వయంగా ప్రకటించారు. మళ్లీ హుజురాబాద్ నుంచి పోటీ చేసి తన సత్తా చాటుతానని.. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు ఈటల రాజేందర్.
ఈటల రాజీనామా చేస్తారని తెలిసే.. ఉప ఎన్నిక వస్తే ఎలాగైనా ఈటలను ఓడించాలనే సంకల్పంతో అధికార పార్టీ తన బలాన్ని, బలగాన్ని హుజురాబాద్‌పై ఉసిగొల్పింది. నియోజకవర్గంలోని ఈటల వర్గీయులందరినీ నయానో, భయానో దారికి తెచ్చుకుంటోంది. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌లకు ప్రత్యేకంగా హుజురాబాద్ బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. అయితే, ఎంతగా అధికార బలం ప్రయోగించినా.. తనను ఏకాకిని చేసే ప్రయత్నం చేసినా.. నియోజక వర్గ ప్రజలంతా తనవెంటే ఉన్నారనే ధీమా ఈటలలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తాను హుజురాబాద్ బరిలో దిగుతానని.. తనకు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను కోరుతూ.. ఆయా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు ఈటల. ఆ సందర్భంలోనే బీజేపీ నాయకులతోనూ మాట్లాడితే.. ఈటల బీజేపీలో చేరుతారంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. కానీ, తాను బీజేపీలో చేరేది లేదని ఈటల స్పష్టం చేశారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా.. స్వతంత్రంగా ఉంటానని ఈటల రాజేందర్ తేల్చి చెప్పడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.