గడ్గరీకి పీఎం కిరీటం? కమలదళం కొత్త వ్యూహం?
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు పూర్తవుతోంది. ఈ ఏడేళ్ళలో ఏమి చేసింది, ఏమి సాధించింది అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రస్త్తుతం అటు ప్రభుత్వం,ఇటు పార్టీ కూడా, ఇంతవరకు ఈ ఏడేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే, కొవిడ్ 19, కమల దళానికి, ఊపిరి అందకుండా, ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దేశంలో చాలా బలంగా వీస్తున్న ప్రతికూల పవనాలకు బీజేపే ఎదురీదుతోంది. పార్టీలో, సంఘ పరివార్ లో పార్టీ భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్మధనం జరుగుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఏమి చేయడం .. ఈ గండం నుంచి ఎలా బయట పడడం’అనే విషయంలో అంతర్గతంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితికి కారణం ఏమిటో వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. కొవిడ్ 19 ఫస్ట్ వేవ్’ను సమర్ధవంతంగా ఎదుర్కుని అందరి ప్రశంసలు పొందిన ప్రదాని మోడీ ప్రభుత్వం, సెకండ్ వేవ్’కి సంబంధించి అన్ని వైపులా నుంచి విమర్శలు ఎదుర్కుంటోంది. కొవిడ్ సెకండ్ వేవ్ విషయంలో ప్రభుత్వం ప్రతి అడుగులో తడబాటుకు గురైంది.. తప్పులు చేసింది.సెకండ్ వేవ్ ప్రభావాన్ని గుర్తించడం మొదలు, మందులు, ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సరఫరా ఇలా అన్నిటా.. ప్రభుత్వం ఫెయిల్ అయింది. నిజమే కావచ్చు, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఫల్యమోమాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు అందరి తప్పులు ఉన్నాయి. అయితే, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వవైఫ్య, ప్రధాని వైఫల్యం అనే భావన, perception ప్రజల్లో ఏర్పడింది. బలపడింది. అయినా, ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించి ప్రధాన మంత్రి నరేంద్ర రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, ప్రజలు డిమాండ్ చేసే వరకు, ప్రభుత్వం జరుగతున్న నష్టాన్ని గుర్తించలేక పోయింది. చివరకు ప్రభుత్వం కళ్ళు తెరిఛి, ఆకులు పట్టుకున్నా, ఫలితం లేక పోయింది. పార్టీ ఇమేజ్, ప్రభుత్వ ఇమేజ్,అన్నిటినీ మించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్, కరోనా డ్యామేజి చేసింది.ఇప్పుడు ఇటు ప్రభుత్వం, అటు పార్టీ, సంఘ్ పరివార్ డ్యామేజి కంట్రోల్, నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టాయి.
పార్టీ భవిష్యత్ వ్యూహం గురించి, పార్టీలో కంటే రాజకీయ వర్గాలు, మీడియాలో చాలా చాలా చర్చ జరుగుతోంది. అనేక ప్రతిపాదనలు, ప్రత్యాన్మాయ విధానాలు చర్చకు వస్తున్నాయి. అందులో, ప్రముఖంగా వినిపిస్తోంది, అధ్యక్ష తరహ పాలన. బీజేపీ అధ్యక్ష తరహ పాలన వైపు మొగ్గుచూపుతోందని, అదికూడా, ప్రస్తుత ఐదేళ్ళ పాలన ముగిసేలోగా, రాజ్యాంగాన్ని సవరించి, అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని, బీజేపీ భావిస్తోందని,అ దిశగా అడుగులు వేస్తోందని ఇలా చాలా కథలు, కథనాలు వచ్చాయి.నిజానికి, అధ్యక్ష తరహ పాలన బీజేపీ అజెండాలో ఎప్పటినుంచో ఉన్నదే. గతంలో పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఈ విషయంగా జాతీయ స్థాయిలో చర్చకు తెర తీశారు. అనేక జాతీయ పత్రికలో వ్యాసాలు రాశారు. అయితే, తర్వాతి కాలంలో ఆ చర్చ తెరమరుగైంది. అదెలా ఉన్నా, రామజన్మ భూమి, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి వంటి పార్టీ మౌలిక సిద్దాంత అంశాలతో పాటుగా అధ్యక్ష తరహా పాలన విషయంలోనూ పార్టీకి స్పష్టత ఉంది. ఇంతకు ముందే అనుకున్నట్ల్గు ప్రస్తుత ఐదేళ్ళ గడవు ముగిసే లోగా, అధ్యక్ష తరహ పాలనను తీసుకురావాలన్న అలోచనపై, పార్టీలో కొంత చర్చ కూడా జరిగిందని అంటారు. అందులో భాగంగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని పదవి చేపట్టరని, తదుపరి ప్రభుత్వం మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా కొత్త తరహ పాలన వస్తుందని, కొంత కాలం క్రితం, మీడియాలో చర్చ జరిగింది. అయితే, ఈ విషయంలో బీజేపీ మాత్రం ఎక్కడా కమిట్ కాలేదు.
ఇప్పడు,మోడీ ఇమేజ్ డ్యామేజి అయిన నేపద్యంలో, మళ్ళీ అధ్యక్ష తరహ పాలన అంశం మరోమారు చర్చకు వచ్చింది. అయితే ఈ సారి ప్రధాని పదవికి అమిత్ షా పేరుకు బదులుగా నితిన్ గడ్గరీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి, ప్రస్తత పరిస్థితిలో రాజ్యాంగ సవరణతో ముడిపడిన అధ్యక్ష తరహ పాలనకు ఆమోదం పొందడం, అయ్యే పనేనా అనేది, ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉందని అంటున్నారు. అయితే, ప్రధాని మోడీ, ఇమేజ్ దెబ్బ తిన్న నేపధ్యంలో అయన స్థానంలో నితిన్ గడ్గరీని ఫ్యూచర్ లీడర్’ గా ప్రొజెక్ట్’ చేసేందుకు సంఘ పరివార్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. నితిన్ గడ్గరీ’ కి ఆర్ఎస్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది.అందులో సందేహం లేదు. అలాగే, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలలో కూడా ఆయన నాయకత్వం పట్ల కొంతలో కొంత సానుకూలత ఉంది. నిజానికి ఒక సందర్భంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నితిన్ గడ్గరీని లోక్ సభలో మెచ్చుకున్నారు. మెచ్చుకోవడమే కాదు, ఆయన్ని ప్రధాని చేయాలని సూచించారు.
ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా, ఊహాగానాలు , వ్యుహాగానాల ఆధారంగా జరుగుతోంది. పరిపాలన విధానం మార్పు, నాయకత్వ మార్పు వంటి సీరియస్ విషయాల్లో బీజేపీ, సంఘ పరివార్ కొంత మంది సూచిస్తున్నట్లుగా, కొంత మంది ఆశిస్తున్న విధంగా, ఇప్పటి కిప్పుడు నిర్ణయం తీసుకుంటారని అనుకోలేము. పరివార్’ ఏ విషయంలో అయినా ఆచి తూచి అడుగులు వేస్తుందే కానీ, తొందరపాటు నిర్ణయాలు సహజంగా తీసుకోదు. ఇది , అందరికీ తెలిసిన విషయమే.అయితే, నిజంగా, పార్టీలో, పరివార్’లో ప్రస్తుతానికి ఎలాంటి అలోచన ఉన్నా, అంతిమ నిర్ణయం మాత్రం వచ్చే సంవత్సం జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే ఉంటుందని బీజేపీ లోతుపాతులు తెలిసిన పరిశీలకులు భావిస్తున్నారు.