మీడియాను వదలని రఘురామ.. పరువు నష్టం దావా
posted on Jun 6, 2021 @ 12:57PM
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును మే 12 వ తేదీన, ఏపీ సీఐడీ పోలీసులు నాటకీయ పక్కీలో అరెస్ట్ చేశారు. ఆయన తమ హైదరాబాద్ నివాసంలో ఉన్న సమయంలో, ఎలాంటి ముందస్తు సమాచారం, హెచ్చరికలు లేకుండా, ఒక ఎంపీని అరెస్ట్ చేసేముందు అనుసరించవలసిన విధి విధానాలను పాటించ కుండా ఆయన్ని అరెస్ట్ చేసి అప్పటి కప్పుడు మంగళగిరి తరలించారు. ఏకంగా రాజద్రోహం కేసు పెట్టి, జైలుకు పంపారు. అక్కడి నుంచి, కృష్ణం రాజు అరెస్ట్, తదనంతర పరిణామాలకు సంబందించిన వార్తలు అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేంగా ఆయన సాగిస్తున్న న్యాయపోరాటం. లోక్ సభ స్పీకర్ సహా పలువురు ప్రముఖులను కలిసి, తమకు జరిగిన అవమానం, అన్యాయం గురించి వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా తీరు తెన్నులను ఎండగడుతున్నారు. ఇలా ఓ వంక న్యాయపోరాటం మరో వంక రాజకీయ పోరాటం సాగిస్తున్నారు ఎంపీ రఘురామ రాజు.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో, అయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు, వార్త కథనాలు, చర్చలు ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్, పై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు రఘురామ రాజు. నిజానికి తప్పుడు సమాచారంతో,ఉద్ద్దేశపూర్వకంగా, తమ పరువుకు భంగం కలిగించే విధంగా వార్తలు, వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని,ఎంపీ కృష్ణం రాజు, ఆయన తరపు న్యాయవాదులు పత్రికా ముఖంగా పలు సందర్భాలలో హెచ్చరించారు. ఇదే పద్దతి కొనసాగితే పరువు నష్టం దావా వేయవలసి వస్తుందని స్పష్టం చేశారు.
అయినా టీవీ 9 చానల్ తీరు మారక పోవడంతో, ఎంపీ రఘురామా కృష్ణం రాజు, ఆ చానల్’ కు లీగల్ నోటేసు సర్వ్ చేశారు. ఎంపీ తరపున, హై కోర్టు న్యాయవాది ఉమేష చంద్ర పీవీజీ, టేవీ9 డైరెక్టర్, జే. జగపతి రావు, సీఇఓ బరన్ దాస్ , మేనేజింగ్ ఎడిటర్ వెళ్ళాం చెరువు రజనీకాంత్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళి కృష్ణ కి నోటీసులు సర్వ్ చేశారు. 12 పేజీల నోటీసులో, న్యాయవాది ఉమేష్ చంద్ర, కృష్ణం రాజు అరెస్ట్ దగ్గర నుంచి జరిగిన సంఘటనలు మొదలు, టీవీ చానల్ ప్రసారం చేసిన వార్తలు, చర్చలకు సంబందించిన వివరాలను పొందు పరిచారు. అందుకు సంబందించిన వీడియో లింకులను జత చేశారు.
ఎంపీ కృష్ణం రాజు, ఎంపీ గానే కాకుండా, ఒక పారిశ్రామిక వేత్తగా సమాజానికి చేస్తున్న సేవను, సమాజం నుంచి పొందుతున్న గౌరవానికి సంబందించిన వివరాలను తెలియ చేశారు. నోటీసులో వివరించిన విధంగా టీవీ9 ప్రసారాల వలన, ఎంపీ పరువుకు భంగం వాటిల్లింది, కావున, అందుకు బాధ్యులు అయిన వారు వారం రోజులలోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని,లేని పక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారురు. ఇక ఇప్పుడు టీవీ 9 స్పందనపై భవిష్యత్ న్యాయపోరాటం ఆధారపడి ఉంటుంది.