కరోనా తగ్గిందని సంబర పడకండి ..
posted on Jun 5, 2021 @ 3:29PM
కరోనా వచ్చింది ... తగ్గింది ఇక భయం లేదు. మళ్ళీ మాములు జీవితంలోకి వచ్చేసినట్లే, అనుకుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. కరోనా తగ్గవచ్చును, పాజిటివ్, నెగిటివ్’గా మారవచ్చును. అయినా, ఉరుకుల, పరుగుల నార్మల్ లైఫ్ లీడ్ చేస్తామంటే మాత్రం కుదరదు. ఒకసారి కరోనా బారిన పడితే, అది మనల్ని అంత త్వరగా వదలదు. కరోనా వచ్చి తగ్గిన వారిని ఆ ప్రభావం అలా వెంటాడుతూనే ఉంటుందని, వైద్యులు, శాస్త్రవేత్తలు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు.
కరోనా తగ్గినా తర్వాత కనీసం మూడు నెలలు, వయసు మీద పడిన వారు, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉన్న వారయితే, ఇంకా ఎక్కువ కాలం ఇంటి పట్టున విశ్రాంతిగా ఉడడం అవసరం. అంతే కాదు, ఇమ్మ్యూనిటి (రోగ నిరోధక శక్తి)ని పెంచి, శక్తిని ఇచ్చే పోషక విలువలు గల ఆహారం తీసుకోవడం అవసరమని వైద్యులు చెపుతున్నారు. అయినా, చాలా మంది, కరోనా తగ్గిందనే ధైర్యంతో, రెగ్యులర్ వ్యాపకాలతో బిజీ అయిపోతున్నారు. సైక్లింగ్, ఇతర శరీర వ్యాయామం చేసి అలసి పోతున్నారు. ఇలా చేయడం వలన మళ్ళీ అనారోగ్యం పాలు కావడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఇందుకు మన ముందే అనేక ఉదాహరణలు ఉన్నాయి.అనేక మంది ప్రముఖ వ్యక్తులు కరోనా తగ్గిన తర్వాత కన్ను మూసిన సంఘటనలు అనేకం చూశాం, విన్నాం.
ఇప్పడు తాజాగా, బర్డ్ గ్రూప్ ఎగ్జికూటివ్ డైరెక్టర్ అంకూర్ భాటియా, కరోనా వచ్చి తగ్గిన తర్వాత కన్ను మూశారు. ఆయన చనిపోయింది హార్ట్ ఎటాక్ వల్లనే అయినా, అందుకు కరోనా కూడా కారణం. అటు విమానయన రంగంలో, ఇటు ఆతిధ్య రంగంలో దూసుకుపోతున్న భాటియా ఈ ఉదయం, సైక్లింగ్ చేస్తూ ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. అంటే ఇక లేవలేదు. అయన ఇక లేరు అన్న విషాద వార్తగా మిగిలారు. కేవలం 48 ఏళ్ల వయసులోనే భాటియా కన్ను మూయడానికి హార్ట్ ఎటాక్ కారణం అయినా, ఆయన ఇటీవలనే కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఆయన, రెగ్యులర్ బిజీ లైఫ్’లో మునిగి పోయారు. అందులో భాగంగానే సైక్లింగ్ చేస్తూ, చనిపోయారు.
భాటియా ఉదంతం ఒక ఉదాహరణ మాత్రామే, మనలో చాలా మంది కరోనా తగ్గిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో అశ్రద్ద చూపుతున్నామని , ఆ విధంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పడు కొత్తగా ఫంగసులు కరోనా నుంచి కోలుకున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందరూ కాదు కానీ, కొందరు రంగు రంగుల ఫంగస్’ల బారిన పడుతున్నారు. కరోనా నుంచి బయటపడ్డామని అనుకునేలోగానే, ఫంగస్ సోకి, మళ్ళీ ఆసుపత్రులకు చేరుతున్నారు.కాబట్టి, కరోనా రాకుండా, రాక ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో , అంతకంటే ఎక్కవ జాగ్రత్తలు కరోనా తగ్గిన తర్వాత తీసుకోవాలని.. వైద్యులే కాదు భాటియా డెత్ కూడా హెచ్చరిస్తోంది. తస్మాత్ జాగ్రత్త.