మోదీతో జగన్‌రెడ్డి డబుల్ గేమ్.. కాళ్ల బేరానికి త్వరలో ఢిల్లీ టూర్?
posted on Jun 5, 2021 @ 5:20PM
ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి కట్టుబానిస.. ఇది విపక్షాల మాట.. కేసుల ఉచ్చు మెడకు బలంగా బిగుసుకుపోయి ఉంది కాబట్టి.. అందులోనుంచి బయటపడటానికి.. ఢిల్లీ పీఠానికి ముఖ్యమంత్రి జగన్ కట్టప్ప వారసుడిగా వెట్టిచాకిరి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో నిజమెంత ఉన్నా.. జగన్ చేసే కొన్ని చర్యలు ఆ అనుమానం కలిగించేలానే ఉంటున్నాయి. అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాను మర్చిపోవడం, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరించడం.. పార్లమెంట్‌లో పలు బిల్లులకు బేషరతుగా మద్దతు తెలపడం.. మోదీ, అంబానీల మనిషిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించడం.. ఇవన్ని మోదీ-జగన్‌ల రహస్య బంధానికి సాక్ష్యాలుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయితే.. కేంద్రానికి కట్టప్పలా సేవ చేస్తూనే.. సమయం చిక్కినప్పుడల్లా.. అదే కట్టప్పలా మోడీకి వెన్నుపోటు పొడిచేందుకూ జగన్ వెనకాడటం లేదని అంటున్నారు.
కరోనా సమయంలో జరిగిన రెండు ఘటనలు సీఎం జగన్.. కట్టప్ప వారసుడేనని చెప్పడానికి నిదర్శనాలుగా చూపిస్తున్నారు. ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. పీఎం మోదీతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌పై పెదవి విరిచారు. ప్రధాని తాను చెప్పాల్సిందే చెప్పారు కానీ, తమ మాట కూడా వింటే బాగుండంటూ ట్వీట్ చేశారు. సోరెన్ ట్వీట్‌కు పలువురు మద్దతు కూడా పలికారు. అయితే, ఎవరూ అడగకుండానే.. అందులో తనకేమాత్రం సంబంధం లేకుండానే.. ట్విట్టర్‌లో అసలేమాత్రం యాక్టివ్‌గా ఉండని జగన్.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్‌ను తప్పుబట్టారు. ఇలాంటి కరోనా పాండమిక్ టైమ్‌లో ప్రధానికి అండగా ఉందాం.. రాజకీయాలు వద్దు బ్రదర్ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. జగన్ ట్వీట్‌పై సోరెన్ పార్టీ సైతం ఘాటు రిప్లై ఇవ్వడం.. కేసుల్లో ఇరుక్కుపోయిన మీ భయమేంటో అర్థం చేసుకోగలమంటూ సెటైర్లు వేయడం.. జగన్ పరువు వేరే రాష్ట్రంలో బజారు పాలవడం తెలిసిందే. ఢిల్లీ పీఠానికి బానిసలా మోదీని సమర్థించి.. జగన్ తన పరువు తానే తీసుకున్నారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
ఇక, కేంద్రంతో సీఎం జగన్ డబుల్ గేమ్ ఆడుతున్న విషయానికి వద్దాం. కరోనా టైమ్‌లో ప్రధానికి అండగా ఉందామంటూ నీతులు చెప్పిన జగన్.. ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. వ్యాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్లపై సీఎం జగన్ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. ఏపీ సహా 9 రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా.. ఒక్క బిడ్ కూడా రాలేదని లేఖలో వాపోయారు. ‘నా అనుభవంతో చెబుతున్నాను. వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలుగా మనం ఏమీ చెయ్యలేం. చాలా సవాళ్లు ఉన్నాయి. విషయం కేంద్రానికే వదిలేద్దాం. కేంద్రమే ఉచితంగా రాష్ట్రాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలని కోరుదాం’ అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు జగన్.
సీఎం జగన్ మిగతా ముఖ్యమంత్రులకు ఇలా లేఖ రాయడం.. కేంద్రంపై రాష్ట్రాలను రెచ్చగొట్టడమేనని ఆగ్రహించారట ఢిల్లీ పెద్దలు. కట్టప్పలా బానిసగా పడుంటాడని అనుకుంటే.. అదే కట్టప్పలా ఇలా వెన్నుపోటు పెడిచే ప్రయత్నం చేయడంపై కేంద్ర వర్గాలు మండిపడుతున్నాయట. జరిగిన నష్టాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన జగన్.. మళ్లీ కేంద్రంతో కాళ్ల బేరానికి వస్తున్నాడట. మోడీని మచ్చిక చేసుకునేందుకు.. ఈ నెల 7న సీఎం జగన్ ఢిల్లీ వెళతారని సమాచారం. వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రుల్ని జగన్ కలిసే అవకాశం ఉందంటున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు తాను అలా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందో.. వివరణ ఇచ్చుకునేందుకే జగన్‌రెడ్డి హస్తిన బాట పడుతున్నారని అంటున్నారు.
తన లేఖతో మోదీకి కోపమొస్తే.. ఊరుకుంటారా? అనే భయం జగన్‌ను వెంటాడుతోంది. ఓవైపు సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ వేసిన బెయిల్ రద్దు పిటిషన్‌పై వేగంగా విచారణ జరుగుతోంది. అటు, సీబీఐ సైతం ఆయనపై కొత్తగా మరో కేసు పెట్టింది. తనకు వ్యతిరేకంగా రాజకీయ వాతావరణం వేగంగా మారిపోతోంది. ఈ సంక్లిష్ట సమయంలో వ్యాక్సిన్లపై లేఖ రాసి.. ప్రధానికి కోపం తెప్పించడం.. జగన్ మనుగడకే ప్రమాదం. అందుకే ఆకులు కాలాక.. మోడీ చేతులు పట్టుకునేందుకు ఢిల్లీకి పయనమవుతున్నారని అంటున్నారు. పాపం.. జగన్.. కట్టప్ప బానిసత్వం. ఎన్నటికీ విముక్తి లేని ఊడిగం. పగోడికి కూడా రావొద్దు ఆ కష్టం. అంటూ ఎద్దేవా చేస్తోంది ప్రతిపక్షం.