ఏపీలో తమిళనాడు తరహా పాలిటిక్స్! బీజేపీ చేతిలో బ్రహ్మాస్త్రం ఉందా?
posted on Jun 5, 2021 @ 8:19PM
బీజేపీ ఫోకసంతా తెలుగు రాష్ట్రాలపైనా ఉందా? ఈటల రాజేందర్ చేరికతో తెలంగాణలో ఆటు మొదలుపెట్టిందా? ఏపీలోనూ బ్రహ్మాస్త్రం తీయబోతుందా? అంటే రాజకీయ, ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ఉత్తరాదిలో బీజేపీ బలం తగ్గిందన్న ప్రచారంతో సౌత్ పైనే కేంద్రం పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. బీజేపీ పెద్దల ఆపరేషన్ వల్లే కొత్త పార్టీ పెట్టాలని భావించిన ఈటల.. కమలం గూటికి జై కొట్టారని తెలుస్తోంది. ఏపీలోనూ తమిళనాడు తరహా పాలిటిక్స్ చేసేందుకు మోడీ టీమ్ స్కెచ్ వేసిందంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై ఉన్న కేసులను తమకు అనుకూలంగా మలుచుకుని పావులు కదపాలని కమలదళం డిసైడ్ అయిందంటున్నారు. తమిళనాడులో జయలలిత చనిపోగానే.. రాజకీయంగా దూకుడు పెంచింది బీజేపీ. అప్పుడు అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకుంది. జయలలిత స్నేహితురాలు శశికళ జైలుకు వెళ్లడానికి బీజేపీ రాజకీయ ఎత్తుగడే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. తమ దారికి రాకపోవడం వల్లే పాత కేసులను తీసి ఆమెను జైలుకు పంపించారని ప్రచారం ఉంది. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత అన్నాడీఎంకే నేతలంతా బీజేపీ చెప్పినట్లే నడిచారు. అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి.. కేంద్రం డైరెక్షన్ లోనే మొత్తం పాలన చేశారని చెబుతారు. అదే సమయంలో తమిళనాడులో పార్టీ బలోపేతానికి బీజేపీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసింది. కొంతవరకు సక్సెస్ అయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఅన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ.. గతంలో కంటే మెరుగైన ఫలితాలే సాధించింది.
ఏపీలోనూ తమిళనాడు తరహా ప్రణాళికలను బీజేపీ పెద్దలు రచిస్తున్నారని తెలుస్తోంది. సీఎం జగన్ పై 18 సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఇప్పుడు జగన్ బెయిల్ పైనే ఉన్నారు. ఇటీవలే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ ప్రారంభమైంది. జగన్ తో పాటు సీబీఐ కౌంటర్ కూడా వేశాయి. అయితే తన కౌంటర్ లో సీబీఐ జగన్ బెయిల్ రద్దును వ్యతిరేకించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న జగన్ కు అనుకూలంగా సీబీఐ కౌంటర్ వేస్తుందని అంతా భావించారు. అందుకు విరుద్ధంగా కోర్టు మెరిట్స్ కే సీబీఐ వదిలిపెట్టడంతో ... జగన్ కేసులో ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. కేంద్రం డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ బ్రహ్మండమైన ప్లాన్ వేసిందంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఒకవేళ జగన్ బెయిల్ రద్దైతే.. వెంటనే తమ కార్యచరణకు అమలులో పెట్టనున్నారట కమలనాధులు. దాని ప్రకారం తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలను ఏపీలో ప్రయోగించబోతున్నారని తెలుస్తోంది. జగన్ జైలుకు పోతే.. ముఖ్యమంత్రి పదవి కోసం వైసీపీలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి ఎప్పటినుంచో సీఎం సీటుపై కన్నేశారని అంటున్నారు. జగన్ కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఉండనే ఉన్నారు. జగన్ రాజీనామా చేస్తే.. అతని కుటుంబంలోనే ఒకరికి అవకాశం వస్తుందని కొందరు చెబుతున్నారు. ఈ లెక్కన జగన్ భార్య భారతీ రెడ్డి రేసులో ముందుండే అవకాశం ఉంది. ఇక్కడే చక్రం తిప్పేలా బీజేపీ వ్యూహం ఉందంటున్నారు. భారతికి పదవి దక్కకుండా షర్మిలను తెరపైకి తేవాలన్నది కమలం పార్టీ స్కెచ్చట.
ఇప్పటికే జగన్ కుటుంబంతో షర్మిలకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కొంత కాలంకా షర్మిల.. జగన్ ఇంటికి వెళ్లకపోవడం, అతన్ని కలవకపోవడం దీనికి బలాన్నిస్తోంది. ముఖ్యంగా భారతి రెడ్డితో షర్మిలకు తీవ్ర విభేదాలు ఉన్నాయంటున్నారు. ఆమెపై కోపంతోనే షర్మిల కొత్త పార్టీ పెట్టారనే టాక్ కూడా ఉంది. ఇదే అస్త్రంగా ఏపీలో పట్టు సాధించాలని కమలనాధులు పక్కాగా ప్రణాళికలు రచించారని తెలుస్తోంది. గతంలో వైసీపీ కోసం ఏపీలో షర్మిల సుదీర్ఘ పాత్రయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం సుడిగాలి ప్రచారం చేశారు. 2011లో జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీని నిలబెట్టేందుకు షర్మిల కష్టపడ్డారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అందుకే వైసీపీ నేతల్లో చాలా మంది షర్మిల నాయకత్వాన్ని ఆహ్వానించే అవకాశం ఉంది. వైసీపీ కార్యకర్తల్లోనూ షర్మిలకు పాజిటివ్ టాక్ ఉంది. ఇవన్ని తమకు అనుకూలంగా మలుచుకుని.. షర్మిల ద్వారా తమ రాజకీయ వ్యూహాలను అమలు చేసేందుకు బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సోమవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని తెలుస్తోంది. తన బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే జగన్ ఢిల్లీకి వెళితే.. అది తీవ్ర చర్చగా మారే అవకాశం ఉంది. తన కేసుల గురించి మాట్లాడేందుకే జగన్ వెళ్లారనే విమర్శలు విపక్షాల నుంచి రావడం ఖాయం. మరీ జగన్ ఢిల్లీకి వెళతారా.. వెళితే ఎవరిని కలుస్తారు అన్నది ఆసక్తికరం. చూడాలి మరీ ఏం జరగనుందో.. ఏపీ రాజకీయాలు రానున్న రోజుల్లో ఎటు వైపు దారి తీస్తాయో... తమిళనాడు తరహా పాలిటిక్స్ జరిగితే మాత్రం ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరగవచ్చు..