జగన్ కేసుల్లో సీబీఐ సైలెంట్?
posted on Jun 6, 2021 @ 10:33AM
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పక్ష పాతం చూపిస్తోంది? విచారణలో కావాలనే జాప్యం చేస్తుందా? కొన్ని కేసుల్లో కౌంటర్లు కూడా వేయడం లేదా? అంటే అవుననే అంటున్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. సీబీఐ పక్షపాతానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఆయన బయటపెట్టారు.
కొందరు వైసీపీ నేతలు జడ్జిలను తిట్టిన కేసు సీబీఐకి వెళ్లినా.. ఇంకా రిజల్ట్ రాలేదన్నారు వర్ల రామయ్య. దళిత డాక్టర్ సుధాకర్ కేసుపై పోలీసుల దాడి కేసులో హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ జరిగిందన్నారు. కాని ఇంతవరకు ఆ రిపోర్ట్ రాలేదన్నారు. డాక్టర్ సుధాకర్ ఇటీవలే గుండెపోటుతో చనిపోయారు. దివంగత వైఎస్సార్ తమ్ముడు, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద మర్డర్ కేసును కూడా సీబీఐనే విచారిస్తుందని చెప్పారు రామయ్య. ఈ కేసులోనూ ఎలాంటి పురోగతి లేదన్నారు.
అసలు సీబీఐలో ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని అధికారి వర్ల రామయ్య ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని అందరూ నమ్ముతారు… పేదవారికి, ధనవంతులకు, అధికారంలో ఉన్నవారికి, లేనివారికీ, అందరికీ చట్టం సమానమే అని చట్టం చెబుతోంది.. కానీ జగన్ విషయంలో మాత్రం సీబీఐ సమ దృష్టితో వ్యవహరించడం లేదనే అనుమానం వస్తుందని వర్ల రామయ్య అన్నారు. జగన్ కోర్టు వాయిదాలకు రాకపోయినా సీబీఐ ఎందుకు నోరు విప్పదని ఆయన ప్రశ్నించారు.కోర్టులో జగన్ కేసుల విచారణ సరిగా జరక్కపోయినా పట్టించుకోదన్నారు. జగన్ విషయంలో సీబీఐ ఎందుకు సైలెంటుగా ఉంది అని వర్ల రామయ్య నిలదీశారు.