జైలు భయంతోనే జగన్ లేఖలు..
posted on Jun 5, 2021 @ 5:52PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు, ఓ డజనుకు పైగా, అక్రమాస్తులు, క్విట్ ప్రో ... కేసుల్లో ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బెయిలు రద్దయ్యే అవకాశాలున్నాయా? అంటే, అవుననే అంటున్నారు, సిపిఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డిపై, తీవ్రంగా విరుచుకు పడ్డారు. ముఖ్యంగా, మంచి చెడులు చూడకుండా, అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని వైసీపీ సమర్దిస్తోందని, ముఖ్యమంత్రి స్వప్రయోజనాల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
ప్రదాని మోడీ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక తప్పుడు నిర్ణయాలను సమర్ధిస్తున్న జగన్ రెడ్డి,ఇంతకాలానికి, వ్యాక్సిన్ల కోసం కేంద్రంపై వత్తిడి తెద్దాం, ఒకే స్వరం వినిపిద్దామంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం విడ్డూరంగ ఉందని ఆయన తమదైన శైలిలో ఎద్దేవా చేశారు. అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నందున, నలుగురి సానుభూతి పొందేందుకే జగన్ వాక్సిన్ విషయంలో ‘ఒకే స్వరం’ వినిపిద్దామని కొత్త రాగం ఎత్తుకున్నారని నారాయణ అన్నారు. అందుకే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని నారాయణ అన్నారు.
'కేసుల విషయంలో జరగబోయే పరిణామాల నుంచి బయటపడేందుకే జగన్ వ్యాక్సిన్ల పేరుతో సీఎంలకు లేఖ రాశారు. నిజంగా వ్యాక్సిన్లపై చిత్తశుద్ధి ఉంటే జార్ఖండ్ సీఎంను ఎందుకు తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, జీఎస్టీతో పాటు ప్రజావ్యతిరేక విధానాల అంశాల్లో కేంద్రంపై ఎందుకు పోరాటం చేయటం లేదు...? కేంద్రంపై పోరాడే విషయంలో జగన్కు చిత్తశుద్ధి లేదు' అని నారాయణ పేర్కొన్నారు.
జగన్ లేఖపై, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కూడా, ఇదే విధంగా స్పందించారు. వ్యాక్సిన్ల కొరతకు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని జైరాం రమేష్ ప్రశ్నించారు. వ్యాక్సిన్’ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని ప్రశ్నించేచేందుకు జగన్ రెడ్డికి దిరం లేదా, అని జైరాం రమేష్ సూటిగా ప్రశ్నించారు.