ఈటలను ఉతికారేసిన హరీష్..
posted on Jun 5, 2021 @ 4:55PM
టీఆర్ఎస్‌ను వీడుతూ కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశారు ఈటల రాజేందర్. వెళ్తూ వెళ్తూ పనిలో పనిగా హరీశ్‌రావునూ గొడవలోకి లాగారు. తనకంటే హరీష్‌రావు కేసీఆర్ చేతిలో ఎక్కువగా అవమానించబడ్డారని.. ఆయన సైతం ఆత్మాభిమానంతో కన్నీళ్లు పెట్టారంటూ బాంబు పేల్చి పోయారు. కేసీఆర్‌కు-హరీశ్‌కు బాగా గ్యాప్ వచ్చిందని అన్నారు. ఈటల పేల్చిన ఈ బాంబు.. టీఆర్ఎస్‌లో ప్రకంపణలు సృష్టించింది.
మొదటి నుంచీ ఈటల, హరీష్ మంచి స్నేహితులుగా ముద్రపడ్డారు. వారిద్దరూ ఒక వర్గమని అంటారు. వారం క్రితం ఈటల మాట్లాడుతూ.. తనపైకి తన స్నేహితుడినే ఉసిగొల్పుతున్నారనే వ్యాఖ్యలు హరీష్‌రావును ఉద్దేశించే అంటున్నారు. అంత దగ్గరి సంబంధం వారిద్దరిదీ. అందుకే, తామిద్దరినీ కేసీఆర్ చిన్న చూపు చూశాడంటూ ఈటల చెప్పిన మాటలను అంతా నమ్మేశారు. రాజేందర్‌లానే హరీష్‌రావుకు కూడా గులాబీ బాస్ చేతిలో అవమానం జరిగిందంటూ అంతా భావించారు. హరీష్ సైతం ఈటల ఆరోపణలను ఖండించకపోవడంతో.. టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత గందరగోళం.
ఈటల ప్రెస్‌మీట్ ముగియగానే.. టీఆర్ఎస్ నాయకులు సైతం మీడియా ముందుకు వచ్చి కౌంటర్ అటాక్ చేశారు. కానీ, హరీష్‌రావు మాత్రం ఈటల వ్యాఖ్యలపై మౌనంగా ఉండిపోయారు. అంటే, మౌనం అర్థ అంగీకారమన్నట్టేనా? లేక, పూర్తి అంగీకారమా? అంటూ చర్చ మొదలైంది. ఒకదశలో ఈటల తర్వాత హరీష్‌రావు సైతం పార్టీని వీడుతారా? అనేంతగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా ఆలస్యం అవుతున్నా కొద్దీ.. అనుమానాలు, రూమర్లు పెరుగుతుండటంతో.. రోజున్నర సమయం గడిచాక.. లేటెస్ట్‌గా హరీష్‌రావు స్పందించారు. ఈటల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అదికూడా ప్రెస్‌మీట్ పెట్టకుండా.. తన కార్యాలయం నుంచి ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. తన పేరు ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన భుజాల మీద తుపాకీ పెట్టాలనుకోవడం వికారమైన ప్రయత్నమంటూ ఈటలపై మండిపడ్డారు హరీష్‌రావు. అయితే, ఈటల అంత పెద్ద ఆరోపణలు చేస్తే.. హరీష్‌రావు ఇంత ఆలస్యంగా రియాక్ట్ అవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో ఏదో జరుగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
హరీష్‌రావు విడుదల చేసిన ప్రకటన యధాతదంగా......
"టీఆర్ఎస్ పార్టీలో నేను నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తను. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధి. పార్టీ కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కార్తవ్యంగా భావిస్తాను. కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, నా మార్గదర్శి, నాకు తండ్రితో సమానులు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నాను.
గతంలో అనేకసార్లు ఇదే విషయం సుస్ఫష్టంగా అనేక వేదికలపై చెప్పాను. ఇప్పుడు మరోసారి చెప్తున్న. కంఠంలో ఊపిరిఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటాను. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల రాజేందర్ గారి వైఖరి. పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం. ఆయన పార్టీని వీడిన టీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ.
తన సమస్యలకు , తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్ భావదారిద్య్రానికి, విజ్ఙత, విచక్షణలేమికి నిదర్శనం. నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న…."
--తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి.