సొంతగూటికి ముకుల్ రాయ్.. బీజేపీకి మమత షాక్
posted on Jun 6, 2021 9:29AM
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసల చక్రం పూర్తిగా 360 డిగ్రీలు పూర్తి చేసుకుని రివర్స్ జర్నీ స్టార్ట్ చేసిందా? ఇప్పుడు ఇక ఇటు నుంచి అటు వలసలు, ఘర్ వాపసీ మొదలవుతోందా? అంటే, కోల్ కతా పొలిటికల్ సర్కిల్స్ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. 2017లో పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్’ కాషాయం కట్టడంతో తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. ఆయనే, వలసలకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు కూడా కొందరు తృణమూల్ నాయకులు కాషాయం కట్టినా, ముకుల్ రాయ్’ తోనే వలసలు ఊపందుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే, ఘర్ వాపసీ, సొంతింటికి తిరిగిచేరే కార్యక్రమం మొదలయ్యే సంకేతాలు స్పష్ట మవుతున్నాయి.
ఇటీవల కాలంలో ఆయన బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నారని, అటు మీడియా వర్గాల్లో,ఇటు పొలిటికల్ సర్కిల్స్’లో చర్చ జరుగుతోంది. ముదొంచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, మొన్నటి ఆసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన సువేందు అధికారికి బీజేపీ ఢిల్లీ పెద్దలు పెద్ద పీట వేయడం, ఆయనను, బీజేపీ ఎల్పీ నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికోవడం ముకుల్ రాయ్’ జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే ఆయన మళ్ళీ మమత వైపు చూస్తున్నారని అయన సన్నిహిత వర్గాల సమాచారంగా కోల్‌కతా మీడియా కోడై కూస్తోంది.
ఇటీవల ముకుల్ రాయ్’ సతీమణి అనారోగ్యంతో కోల్’కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి ముకుల్ రాయ్ సతీమణిని పరామర్శించడంతో పాటుగా, ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. నిజంగా ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో కానీ, ఆ మర్నాడు ఉదయమే ప్రధాని నరేంద్ర మోడీ ముకుల్ రాయ్’కి ఫోన్ చేసి, అయన భార్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలా, అభిషేక్ బెనర్జీ, ముకుల్ రాయ్’ని కలవడం ఆ వెంటనే ప్రధాని ఫోన్ చేయడంతో ఉహాగానాలు మొదలయ్యాయి. నిజానికి, ఈ పరామర్శల కలయికలు యాదృచ్చికంగా జరిగాయా, లేక కోల్’కతా కబురు ఢిల్లీకి చేరి ప్రధాని నేరుగా లైన్’లోకి వచ్చారా అన్నది, ఎవరికీ తెలియక పోయినా, అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ, ఘన విజయం సాధించి మూడవసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ, దిపేందు బిస్వాస్, సరళ మురు, అమల్ ఆచార్య సహా మరికొందరు సొంతగూటికి చేరేందుకు సిద్దమైన నేపధ్యంలో ముకుల్ రాయ్ ఎపిసోడ్’ ప్రాధాన్యతను సంతరించుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతే కాకుండా ముకుల్ రాయ్’ కుమారుడు, ఆయనతో పాటుగా బీజేపీలో చేరిన శుభరాంషు, కొద్ది రోజుల క్రితం, బీజేపీకి పేస్బుక్’లో చురక అంటించారు. ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే, ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిదని’ ఆయన పార్టీ అధికార ఎఫ్బీలో పేర్కొన్నారు.
మరో వంక మమతా బెనర్జీ కూడా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ముకుల్ రాయ్’ మూల కారణమని భావిస్తున్నారు. ముకుల్ రాయ్’ చేరికతోనే బీజేపీకి ఉపోచ్చిందని, ఆయన్ని వదులుకోవడం పార్టీ చేసిన తప్పని, ఆమె కొంచెం ఆలస్యంగానే అయిన గుర్తించారు.లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 18 స్థానాలు గెలుచుకుని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది. ప్రతిపక్షంగా నిలిచింది. అందుకే మమత మళ్ళీ ముకుల్ రాయ్’ని వెనక్కి తెచ్చుకుంటే, బీజేపీ దూకుడుకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని రాయబేరానికి పంపారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా, బెంగాల్లో రివర్స్ ఆకర్ష్’ మొదలైంది... ముకుల్ రాయ్ ఓకే చేస్తే బీజేపీ వాపు తగ్గి అసలు బలం బయట పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.