కేటీఆర్ పట్టాభిషేకం ఇక లేనట్లే..
posted on Jun 9, 2021 @ 6:33PM
ఒకటి రెండు సార్లు ముహూర్తం వరకు వెళ్ళిన మంత్రి కేటీఆర్ పట్టాభిషేకం ఇక ఇప్పట్లో లేనట్లేనా.. ఈ సారికి మంత్రి పదివితో సర్దుకు పోవలిసిందేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, 2018 లో ముఖ్యమంత్రి కేసీఅర్ ముందస్తు ఆసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించినప్పటి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకం వార్తల్లో నలుగుతూనే ఉంది. అందుకోసమే ముందస్తుకు వెళ్ళారని అప్పట్లోనే మీడియాలో పొలిటికల్ కథలు, కధనాల వంటా వార్పు జోరుగా సాగింది. ఇక 2019 లోక్ సభ ఎన్నికల ముందు అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం ఖాయమని అన్నారు. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్’ ఏర్పడిపోయినట్లే ప్రచారం జరిగిపోయింది. అదే సమయంలో కేటీఆర్’ సైతం పట్టాభిషేకానికి రెడీ అయిపోయారు. అయితే, కారు పదహారు కల బోల్తా కొట్టడంతో కథ అడ్డం తిరిగింది. కేసీఆర్ ఢిల్లీ కలతో పాటుగా కేటీఆర్’ సీఎం కల కూడా ... చెదిరిపోయింది. కట్ చేస్తే .. కేటీఆర్ కల అయితే చెదిరింది కానీ, కోరిక మాత్రం అలాగే వుంది.
కుటుంబ రాజకీయ సమీకరణలో వచ్చిన మార్పులతో కేసీఆర్ పై వత్తిడీ పెరిగింది. ఈ వత్తిడి కారణంగానే, కేసీఆర్, ఇంటి కంటే ఫామ్’ హౌస్ పదిలం అని, ఎక్కువగా అక్కడే ఉండి పోతున్నారని, ఫ్యామిలీలోని బయటి వర్గం ఉవాచ. ఇలా ఫ్యామిలీ పాలిటిక్స్’లో చోటు చేసుకుంటున్న ట్విస్టుల ఫలితంగానే మేనల్లుడు హరీష్ రావు మామకు దూరమయ్యారని, కుటుంబ వత్తిళ్లకు లొంగి ఆయన్ని కేసీఆర్’ దూరంగా ఉంచారని అంటారు. కారణం ఏదైనా కొంత కాలం పాటు కేసీఆర్ వద్ద హరీష్ రావు ప్రాధాన్యత తగ్గింది అనేది మాత్రం నిజం. ఆయనకు ప్రగతి భవన్ గేట్లు మూసుకున్నాయా, తెరుచుకున్నాయా, ఆయన కంటతడి మాత్రమే పెట్టుకున్నారా, కన్నీళ్లు కూడా కార్చారా,అనేది ఎలా ఉన్నా, ఇప్పుడు ఆయన ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నిన్నమొన్నటి వరకు ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గింది అనేది మాత్రం నిజం. అయినా, కేసీఆర్’ను అక్షరం అక్షరం చదివిన హరీష్ ఎప్పుడూ మామ గీసిన గీత దాటలేదు, చివరకు ప్లానింగ్ తమ వద్ద ఉంచుకుని అంతగా ప్రాధాన్యత లేని ఫైనాన్స్ పోర్ట్’ఫోలియో ఇచ్చినా అదే మహా ప్రసాదంగా స్వీకరించి, సుమారు సంవత్సరానికి పైగా సిద్దిపేటకు పరిమితం అయ్యారు. అయితే, ఆయన, మౌనంగా ఉన్నా, వ్యూహం లేకుండా మాత్రం లేరు. సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు.ఇదంతా అందరూ చూసిన చిత్రం.
ఇక విషయంలోకి వస్తే ప్రస్తుతం తెరాస పార్టీలో, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా ఈటల రాజేందర్ బర్తరఫ్’ తదనంతర పరిణామాలను గమనిస్తే, కేసీఆర్ వద్ద హరీష్ ప్రాధాన్యత మళ్ళీ పెరిగింది. ముఖ్యమంత్రి ఆసుపత్రుల సందర్శనలో ఆయన వెంట హరీష్ ఒక్కరే ఉన్నారు. అంతే కాదు,ఈటల బర్తరఫ్ తర్వాత, వైద్య ఆరోగ్య శాఖను తమ వద్దనే ఉంచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆశాఖ వ్యహరాలను చూసేందుకు ఏర్పాటు చేసిన డిఫ్యాక్టోకమిటీకి హరీష్’ ను చైర్మన్ గానియమించారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడే, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు. అయినా, కేంద్ర మంత్రి హర్షవర్ధన్’ రాష్ట్ర మంత్రులతో కొవిడ్ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్’లో హరీష్ రావు పాల్గొన్నారు. ఇక ఇప్పుడు తాజాగా కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపధ్యంలో అసుపత్రుల స్థితిగతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియమకాలు అవసరమైన ఇతర ముదస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆరోగ్య సబ్ కమిటీకి ఆర్థిక మంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి అధ్యక్షునిగా నియమించారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, వేముల ప్రశాంత రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస గౌడ్ సభ్యులగా ఉన్నారు.ఈ కమిటీ ఏమి చేస్తుంది ఏమిటీ అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రభుత్వంలో హరీష్ కీలకంగా మారారు, మరో మారు, ఆయన ప్రధాన్యత పెరిగింది,అనేందుకు ఇది తాజా ఉదహరణగా పేర్కొన వచ్చును.
ప్రభుతంలోనే కాదు పార్టీలోనూ, ట్రబుల్ షూటర్’గా హరీష్ ప్రధాన్యత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. హరీష్ రావు పార్టీ అభ్యర్హ్ది సురభి వాణీ దేవిని గెలిపించి, ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టేశారు. ఇక ఇప్పుడు ఈటల రాజీనామా చేస్తే వచ్చే హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను కూడా హరీష్ రావుకే అప్పగించారు. మాజీ ఎంపీ వినోద కుమార్, మంత్రి గంగులకు కూడా బాధ్యతలు అప్పగించినా భారం మాత్రం హరీష్ బుజాలపైనే ఉంచారని పార్టీలో వినిపిస్తోంది. ఈ విధంగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో హరీష్ మళ్ళీ కీలకంగా మారడంతో , కేటీఅర్ పట్టాభిషేకం ఇక ఇప్పట్లో లేనట్లేనని, అంటున్నారు. ఎందుకంటే హరీష్ తను కేసీఆర్’కు మాత్రమే విధేయుడిగా ఉంటానని, ఆయన పార్టీ అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా ఉన్నత వరకే విధేయత ఉంటుందని,ఆ పదవులలో మరొకరు (అనగా కేటీఆర్) వస్తే తదనంతర పరిణామాలకు తాను బాద్యుడిని కాదని, స్వయంగా మామకే చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ బ్యాక్ డ్రాప్ లోనే కేటీఆర్ పట్టాభిషేకానికి అడ్డుతగులుతారనే, హరీష్ ను కొంత కాలం దూరంగా పెట్టారు. ఇప్పడు ఈటల ఉదంతంతో అనివార్యంగా హరీష్ అవసరం ఏర్పడింది. సో .. కేటీఆర్ పట్టాభిషేకం ఇక ఇప్పట్లో లేనట్లే అంటున్నారు. అదలా ఉంటే ఎంత వరకు నిజమో కానీ, ఈటల ఎపిసోడ్ కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం అన్నీ ‘ఆయనే’ అని కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.