బీజేపీలో చేరితే చచ్చిపోయినట్టే! సీనియర్ నేత సంచలనం..
posted on Jun 10, 2021 @ 2:32PM
దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకోవడం లేదు. సరికదా ఇప్పటికే బలహీనంగా ఉన్న హస్తం పార్టీ మరింత బలహీనమవుతోంది. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కీలక నేతలు బయటికి వెళుతున్నారు. తాజాగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జతిన్ ప్రసాద బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ లో అసమ్మతి టీమ్ గా ముద్రపడిన జీ-23 గ్రూపులో జితిన్ ప్రసాద కూడా ఉన్నారు. ఇప్పుడు జితిన్ కమలానికి జై కొట్టడంతో జీ23లోని మిగితా నేతలు కూడా ఎవరి దారి వారి చూసుకుంటారనే చర్చ జరుగుతోంది. మెజార్టీ నేతలు బీజేపీలో చేరవచ్చన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ అసమ్మతి టీమ్ లో కీలక నేతగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో సంస్కరణలు చేయాల్సిన తరుణం వచ్చిందని, తాము చెప్పే మాటలను నాయకత్వం ఇకనైనా వినాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీలోని సమస్యలను ఇంకా పరిష్కరించలేదని చెప్పారు. వాటిని పరిష్కరించనంతవరకూ.. వాటి గురించి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. పార్టీ నాయకత్వం విఫలమైతే పార్టీ నేతలందరూ విఫలమైనట్టేనని కపిల్ సిబల్ అన్నారు.
తాము అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని తేల్చిచెప్పారు కపిల్ సిబల్. అయితే తాను బీజేపీలో మాత్రం చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను పుట్టినప్పటి నుంచి బీజేపీకి వ్యతిరేకమని.. తాను బీజేపీలో చేరడమంటే తాను చచ్చిపోయినట్టే లెక్క అని అన్నారు. బీజేపీలో జితిన్ ప్రసాద చేరికపై ఘాటుగా స్పందించారు. అది 'ప్రసాద రామ' రాజకీయాలని అన్నారు. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని మండిపడ్డారు.
పార్టీ ఏం చేసింది? ఏం చేయలేదు? అన్నది తనకు అనవసరమని సిబల్ అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందన్నారు. పార్టీని వీడడంలో జితిన్ కు కారణాలుండి ఉండొచ్చన్నారు. ఆయన పార్టీని వీడినందుకు విమర్శలు చేయాల్సిన అవసరం లేదని, కానీ, పార్టీని వీడేందుకు ఆయన చెప్పిన కారణాలనే విమర్శించాలన్నారు కపిల్ సిబల్.