సొమ్ము ఒకడిది.. సోకు ఇంకొకడిది.. ఆనందయ్య మందు బ్లాక్ మార్కెట్ లోకి..
posted on Jun 10, 2021 9:12AM
పసి పిల్లలు తాగే పాలు కల్తీ.. వంట నూనెలు కల్తీ.. వ్యవసాయ ఎరువులు కల్తీ.. తినే తిండి కల్తీ చేస్తున్నారు.. ఇందు గలదు అందు లేదని సందేహం కలదు ఎందెందు చూసిన అందందే గలదు కల్తీ అనవచ్చు . చివరికి డబ్బు మత్తులో పడి మనుషులు కూడా కల్తీ అవుతున్నారు.. తాజాగా కరోనా కొంత ఉపశమనం ఇస్తుంది అని నమ్మిన ఆనందయ్య మందును కూడా కల్తీ చేశారు.. వివరాల్లోకి వెళ్తే..
ఆయుర్వేద మందుల తయారీకి ఆనందయ్య వినియోగించే వస్తువులు, ఆ మూలికల వివరాలు అందరికి తెలియడంతో వాటి ఆధారంగా ఎవరికి వారు మందులు తయారు చేసి పంచిపెడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొందరు మాఫియా ఇక్కడ కూడా బిజినెస్ చేస్తున్నారు.. కరోనా మందు తయారు చేసి అమ్ముకొంటూ సొమ్ము చేసుకుంటున్నారు..కొందరు ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తుండా.. మరికొందరు వేల రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ చేస్తే వేలాదిగా తరలివచ్చే ప్రజలను కట్టడి చేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఆనందయ్య మందును తామే అన్ని జిల్లాలో పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తామని అధికార యంత్రాంగం ప్రకటించినా అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.ఆనందయ్య ఎన్నో అడ్డంకులు ఎదురుకుని, చివరికి అరెస్ట్ అయి.. హైకోర్టు జోక్యం తో మళ్ళీ మందు పంపిణీని ముందుకు తీసుకెళ్తుంటే.. ఒక వైపు ఆ పంపిణీకి అడ్డంకులు ఎదురవుతుండగా.. మరోవైపు కొంత మంది చిల్లర గాళ్ళు.. కేటుగాళ్లు ఆనందయ్య ముందు ఫార్ములాని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు.
దీనితో ఆనందయ్య ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు స్వయంగా లేఖలు రాసినా ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఆనందయ్య గత ఐదు రోజులుగా తయారు చేసిన మందులను సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటా పంచారు. అయితే ఈ వ్యవహారంలోకి తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ మరో ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు చెపుతున్నారు. ఆయన నియోజకవర్గమంతా సరిపడా మందు తయారుచేసే వరకు ఆనందయ్యకు విశ్రాంతి దొరికే అవకాశం కనిపించడం లేదు. మందు తయారీకి హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిచ్చి వారం రోజులు దాటుతున్నా.. నిజంగా మందు అవసరం ఉన్న యాక్టివ్ కేసులకు ఆ మందు అందడంలేదని స్పష్టమవుతోంది.
దీని ఆసరాగా చేసుకుని అలాగే ఆనందయ్య పేరును అడ్డం పెట్టుకుని పలువురు మోసగాళ్లు బ్లాక్ మార్కెట్లోకి ప్రవేశించారు. మందుల తయారీకి ఏయే పదార్థాలు, మూలికలు వాడతారో, ఆనందయ్య మాట్లాడిన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియడంతో కొంతమంది ‘ఆనందయ్య మందు’ తయారు చేయడం మొదలు పెట్టారు. అధికార పార్టీ నాయకులు ఆనందయ్య ద్వారా రహస్యంగా మందులు తయారు చేయించుకున్న సందర్భంగా క్యాటరింగ్ సిబ్బందిని సహాయకులుగా వినియోగించారు. మందు తయారీని ప్రత్యక్షంగా చూసిన వీరిలో కొందరు ఇప్పుడు దాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. సొంతంగా మందు తయారు చేసి, డబ్బాల్లో ప్యాక్ చేసి కావాల్సిన వారికి ఇస్తున్నారు. కొంతమంది ఉచితంగా పంచి పెడుతుండగా, మరి కొంతమంది రూ.వెయ్యి, రెండు వేలకు అమ్ముకొంటున్నారు.
నెల్లూరు నగరంలోనే ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. అయిన ఇప్పుడు సమాజం లో నడిచే విధానం అదే.. న్యాయాన్ని చెంపేసి అన్యాయాన్ని ఉరేగిస్తున్నారూ.. తెలు మంత్రం రానోడు.. పాము నోట్లో వేలు పెట్టడం అంటే ఇదేనేమో.. ఆయుర్వేదంలో కాసింత పరిజ్ఞానం ఉన్న పలువురు మండలాలను కేంద్రాలుగా చేసుకొని ఆనందయ్య మందు అంటూ సొంత మందును విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందు తయారీలో వాడే పదార్థాలేవీ హానికరం కావు కాబట్టి, ఎలా చేసినా వాటిని తిన్నవారికి ఏమీ కాదన్న ధైర్యంతో కొంతమంది దొరికిన ఆకులు అలుములు వేసి లేహ్యాలు తయారు చేసి, అందులో కాసింత తేనె కలిపి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి జనాలకు ఇస్తున్నారు. ఇది నిజంగా ఆనందయ్య తయారు చేసిన మందుగానే భావించి చాలామంది మోసపోతున్నారు