ఈటలతో బీజేపీ నయా గేమ్? ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేనట్టే?
posted on Jun 10, 2021 @ 2:32PM
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీతో పాటు కారు సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈటల ప్రకటించి వారం రోజులైంది. అయినా ఇంకా ఆయన రాజీనామా చేయలేదు. స్పీకర్ అపాయింట్ మెంట్ కూడా కోరలేదు. గులాబీ పార్టీకి గుడ్ బై చెపుతూ ఈటల మాట్లాడిన మాటలతో.. ఆ రోజే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని భావించారు. కాని అది జరగలేదు. తర్వాత మంచి రోజుల కోసం చూస్తున్నారు.. సోమవారం రాజనామా చేస్తారనే ప్రచారం జరిగింది. వారం గడిచినా రాజీనామా ఊసే ఎత్తడం లేదు రాజేందర్. రాజీనామాపై క్లారిటీ ఇవ్వని మాజీ మంత్రి.. నియోజకవర్గంలో మాత్రం పర్యటిస్తున్నారు. తన మద్దతుదారులతో కలిసి బల ప్రదర్శన చేస్తున్నారు. తనకు అండగా ఉండాలని ఒకరకంగా ప్రజలను వేడుకుంటున్నారు.
ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి వారమైనా.. ఇంకా ఎందుకు రిజైన్ చేయలేదు... రాజీనామా చేయకుండానే నియోజకవర్గంలో ఎందుకు పర్యటిస్తున్నారన్నది అంతబట్టకుండా ఉంది. అదే సమయంలో ఈటల బీజేపీలో ఎప్పుడు చేరుతారన్నదానిపైనా స్పష్టత లేదు. ఈటల విషయంలో ఇంత గందరగోళానికి కారణం బీజేపీ హైకమాండే అని తెలుస్తోంది. కమలం పెద్దల డైరెక్షన్ లోనే రాజేందర్ నడుస్తున్నారని, అక్కడి నుంచి సిగ్నల్స్ వచ్చాకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. బీజేపీలో ఎప్పుడు చేరాలి, కేసీఆర్ టార్గెట్ గా ఎలా ముందుకు వెళ్లాలన్నది కూడా నడ్డా టీమ్ డైరెక్ట్ చేయనుందని చెబుతున్నారు.
ఈటల విషయంలో బీజేపీ పక్కా వ్యూహం ప్రకారమే వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆయన పదవి లేకుండానే ఉండాల్సి వస్తోంది. కొవిడ్ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం సీఈసీకి లేదని తెలుస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతికి ఐదు రాష్ట్రాల ఎన్నికలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్ థర్ట్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలు ఉన్న కారణంగా ఇకపై నిర్వహించే ఎన్నికలపై సీఈసీ తొందరపడకూడదని భావిస్తుందని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో జరగాల్సి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేసింది. దీంతో ఈటల రాజీనామా చేసినా.. ఖచ్చితంగా 6 నెలల లోపు ఉప ఎన్నిక జరుగుతుందన్న గ్యారంటీ లేదు. వాయిదా వేసుకుంటూ పోతే మరింత కాలం రాజేందర్ పదవి లేకుండానే ఉండాల్సి వస్తోంది. అందుకే రాజీనామాపై తొందర వద్దని బీజేపీ హైకమాండ్ సూచించిందని చెబుతున్నారు. సీఈసీ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా బీజేపీ పెద్దలు ఇచ్చే సూచనల ప్రకారమే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రాజేందర్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు .
రాజీనామాపై ఈటల ఆలస్యం చేయడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరున్న గులాబీ బాస్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఉప ఎన్నికల్లో ఆయన ప్లాన్స్ ఎవరికి అందకుండా ఉంటాయి. రాజీనామాకు ముందే నియోజకవర్గంలో తిరిగి జనాల నాడీ తెలుసుకోవాలని ఈటల భావిస్తున్నారట. అందుకే ఆయన గ్రామాలు తిరుగుతున్నారని చెబుతున్నారు. అవసరమైతే నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని రాజేందర్ ప్లాన్ చేస్తున్నారట. ఎమ్మెల్యేగానే జనాల్లోకి వెళ్లి .. వాళ్ల సమస్యలు తెలుసుకుని... ప్రభుత్వాన్ని నిలదీసే యోచనలో ఈటల ఉన్నారంటున్నారు. అందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రాజేందర్ న్యాయ సలహా తీసుకుంటున్నారని చెబుతున్నారు . ఇదంతా బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు.
మరోవైపు రాజేందర్, బీజేపీ వ్యూహాలకు కౌంటర్ ప్లాన్స్ టీఆర్ఎస్ రెడీ చేస్తుందని తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయకపోతే.. స్పీకర్ కు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయించే ఆలోచనలో గులాబీ లీడర్లు ఉన్నారంటున్నారు. ఇది జరిగిగా తమకు లాభమే అన్న అంచనాల్లో ఈటల వర్గీయులు, బీజేపీ నేతలు ఉన్నారు. ఎమ్మెల్యే పదవిపై వేటు వేస్తే... ఈటలకు జనాల్లో మరింత సానుభూతి పెరుగుతుందని లెక్క కడుతున్నారు. మొత్తంగా రాజీనామాపై ఆలస్యం చేయడం ద్వారా టీఆర్ఎస్ అన్ని విధాలా చెక్ పెట్టేలా రాజేందర్ తో పాటు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.