మహా నేత.. తరగని చరిత్ర! రైతు బాంధవుడు ఎన్జీ రంగా..
posted on Jun 10, 2021 9:14AM
పంచ కట్టిన ప్రతివాడు మహా నేతలు గా రైతు నాయకులు గా చెలామణి అయ్యి పోతున్న ఈ కాలం లో ఈ తరం వారు మర్చిపోతున్న నిజమైన రైతు బాంధవుడు, రైతు నాయకుడు ఆచార్య NG రంగా. చెప్పుకుంటే తరగని చరిత్ర ఆయనది. స్వాతంత్ర ఉద్యమంలో, రైతు పోరాటంలో ఆయన కృషి మరువలేనిది. ఆచార్య ఎన్.జి.రంగాగా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు భారత స్వాతంత్ర సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.
ఎన్జీ రంగా 1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు హేతువాది . 1920లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది.
నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.1933లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు , కొణిజేటి రోశయ్య రంగా శిష్యులే . ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. 1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.
రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ, 1955 లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో ఎకనామిక్స్ ఆఫ్ హండ్లూమ్స్ లో బి. లిట్ పట్టా తీసుకోవడానికి ముందే 1923 లో అప్పికట్ల లో రైతు మహా సభ, నిడుబ్రోలు లో రైతు కూలి మహా సభ నిర్వహించడంతో మొదలు అయ్యిన గోగినేని రంగనాయకులు ప్రస్థానం తర్వాత మరణించే వరకూ సుమారు 70 యేళ్లు రైతులకు రైతు సమస్యల పోరాటానికి అంకితం అయ్యింది. ఆక్స్ఫర్డ్ నుంచి 1926 లో వెనక్కి వచ్చాక మద్రాస్ రాష్ట్రం లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గా పదవీ కి రాజీనామా చేసి ఖద్దరు, గాంధీ టోపీ ధరించి ఒక పక్క జాతీయ స్థాయి లో కాంగ్రెస్ తరపున స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొంటునే, రైతు ఆందోళన ల లో పాలు పంచుకునే వారు.
పెద వడ్లమూడి, రేటూరు, అప్పాపురం ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ఆయన చేసిన కృషి వల్ల 65 వేల ఏకరాలు సాగు లోకి వచ్చి ఆ రోజుల్లో నే రైతులకు 4 కోట్ల లాభంగా అంచనా వేయబడింది. అదే కాలం లో కాలిఫోర్నియా లో M.Sc చేసి వచ్చిన మాగంటి బాపినీడు గారి తో కలిసి 1929 లో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం స్థాపించారు. అదే ఏడాది మద్రాస్ రాష్ట్ర అటవీ పంచాయితీ సెక్రెటరీ గా అటవీ ప్రాంతం లో వున్న 1100 పంచాయితీలు కి గుర్తింపు రైతుల కి గుర్తింపు ఇప్పించారు. అదే సమయంలో ఒంగోలు కరువు బాధ నివారణ సంఘం స్థాపించి కరువు బాధితులకు సహాయ సహకారాలు, కనీస అవసరాల కల్పనకు కృషి చేశారు. బౌద్ధ వాజ్మేయ బ్రహ్మ గా పేరు పొందిన దుగ్గిరాల బల రామ కృష్ణయ్య సహాయం తో కృష్ణా జిల్లా లో నే 300 గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేశారు. 90 ఏళ్ల క్రితమే అన్న దాత ప్రాముఖ్యత పైన జై కిసాన్ నినాదానికి పూర్వమే " రైతు భజనావలి" అనే పాటల పుస్తకం వేసి పంచారు.
రంగా రాజకీయ జీవితము
రంగా 1952 లో కాంగ్రెసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ, ఆ తరువాత 1959 లో చక్రవర్తి రాజగోపాలాచారి కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. రైతులకు నష్టం కలిగించే రష్యా ముద్రగల సహకార వ్యవసాయాన్ని, దానిని ప్రవేశపెట్టిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలను వ్యతిరేకించారు.1972లో రంగా తిరిగి కాంగ్రెసు (ఐ) లో చేరాడు.రెండవ లోక్ సభకు 1957లో తెనాలి నుంచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 1962లో చిత్తూరు ఎంపీగా స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 1967లో శ్రీకాకుళంలోక్ సభకు ఎన్నికయ్యారు. 1980, 1984, 1989లో గుంటూరు ఎంపీ కాంగ్రెస్ ఐ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 1957-62 నుంచి 1989-1991 వరకు కొద్ది కాలం తప్పితే, నిరాఘాటంగా, పార్లమెంట్ లో రాజకీయప్రతినిధిగా సుధీర్గకాలము నిస్వార్దంగా సేవలనందించిన రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యునిగా రికార్డు సృష్టించి గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు.
దేశ రాజకీయాల్లో NG రంగ తనదైన ముద్ర వేశారు. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఇప్పటికీ బెంగాల్ లో వుందీ పార్టీ) కి పేరు పెట్టింది రంగానే. త్రిపుర కాంగ్రెస్ సభల్లో నెహ్రూ - గాంధీల ద్వయం నేతాజీని ఒంటరి చేసినప్పుడు.. నేతాజీకి బహిరంగం అండ నిలిచి అన్నీ తానై త్రిపుర కాంగ్రెస్ మహా సభలను నడిపించింది NGనే. 1940 లో రాంగఢ్ లో కాంగ్రెస్ కి, బ్రిటిష్ కి వ్యతిరేకం గా ఏర్పాటు చేసిన anti కాంప్రమైజ్ కాంగ్రెస్ ఏర్పాటు లో స్వామి సహజనంద, బోసు, రంగాలు కీలక పాత్ర పోషించారు. దానికి ముందే స్వామి సహజానందతో కలిసి లక్నో లో అఖిల భారత కిసాన్ మహా సభ ఏర్పాటు చేశారు NG రంగా.
1926లో అఖిల భారత వయోజన విద్యా కేంద్రం స్థాపించి 4 యేళ్లు తానే వైస్ చైర్మన్ గా నడిపి విద్యకి తాను ఇచ్చే ప్రాముఖ్యత ని తెలియ చేసారు. తన భార్య భారతి దేవికి ఉన్నత చదువులకు అవకాశం ఇచ్చి మహిళా విద్య ఎంత అవసరమో సుమారు 100 ఏళ్ల క్రితమే చేతల్లో తెలియ చెప్పారు రంగ.
రైతు , రైతు కూలీలకు , కళాకారులకు ప్రత్యేక పాఠశాలలు పెట్టి గాంధీ తో వాటిని ప్రారంభించారు. కమ్యూనిస్ట్ లు, సోషలిస్ట్ లు, కాంగ్రెస్ నాయకులు అందరూ క్లాస్ లు చెప్పే వారు.
రంగాకి అత్యంత ఆప్త మిత్రులు ఎంతో మంది వున్నా చెప్పుకోవాల్సింది ప్రకాశం పంతులుతో వున్న మిత్రత్వం, గౌతు లచ్చన్న తో అను బంధం. ఒకటే ఆత్మ గా మెలిగారు గౌతు లచ్చన్న, NG రంగా. రాజ్యాంగ సభలో 1946 నుంచి వున్న NG రంగ నే బాబా సాహెబ్ అంబేద్కర్ ని రాజ్యాంగ సభ కు చైర్మన్ గా ప్రపోజ్ చేసిన విషయం.. మన రాష్ట్రం లో నే మామూలు వాళ్ళకే కాక దళిత ఉద్యమాలలో వున్న వారికి కూడా తెలియక పోవడం శోచనీయం. అలాగే 80 ల్ల క్రితమే ఉన్నవ లక్ష్మి నారాయణ "మాలపల్లి " తో పాటే NG రంగ కూడా "హరిజన నాయకుడు" అనే నవల రాశారు అన్న విషయం కూడా చరిత్రలో లేదు.
రైతాంగానికి వీరు చేసిన విశిష్టసేవలకు తార్కాణంగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ను 'ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా 1997 లో నామకరణ చేసారు.1991 లో భారత ప్రభుత్వం వీరికి పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.ఆచార్య యన్.జి.రంగా గారి చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలాశాఖ వారు 2001 లోఒక ప్రత్యేక స్మారక తపాళాబిళ్ళను విడుదల చేశారు.
రంగా రచనలు..
రైతు కూలీలకోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహామనీషి. రైతుకూలీలరాజ్యం స్థాపనకోసం మహాత్మునితో సుదీర్ఘచర్చలను జరపడమే కాక, సంభాషణలసారాన్ని, 'బాపూ ఆశీస్సులూ ' అని గ్రంధస్థం చేసిన వ్యక్తి.