షర్మిల బాణం గురి ఒకవైపు.. లక్ష్యం మరోవైపు
posted on Jun 9, 2021 @ 6:10PM
అన్నపై కోపంతో ఇక్కడకొచ్చారని చెబుతున్నారు. కాని అన్న స్నేహితులంతా ఇక్కడ చెల్లెమ్మకు ఫ్రెండ్స్. అన్న అనుమతి లేకుండానే వారొస్తున్నారా? అంటే ఏమో అంటున్నారు. కనుబొమ్మలెగరేస్తేనే కన్నెర్ర చేసే కల్వకుంట్లవారు ఈ చెల్లెమ్మ చేతులెగరేసినా.. ఏమీ అనటం లేదు. గజ్వేల్ కే వచ్చి సవాల్ విసురుతున్నా చాలా కూల్ గా ఉంటున్నారు. ఇందులో కిటుకు ఏంటో అర్ధం కావటం లేదు. ఇంతకీ ఈ చెల్లెమ్మ ఎవరికి నష్టం చేస్తారు? ఎవరికి లాభం చేస్తారనే దానిపై ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. కాని ఇప్పుడిప్పుడే కాస్త క్లారిటీ వస్తోంది.
తెలంగాణలో షర్మిల పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రంగం సిద్ధమైపోయింది. అన్నపై కోపంతో.. అలిగి మరీ తెలంగాణ వచ్చిందని ఓ మీడియా కథనాలు వండి వార్చింది. ఆ మీడియా చెప్పిందే షర్మిల వింటుందని.. అసలు అన్ని విషయాలు వారికి ఈవిడే చెప్పిందని గుసగుసలాడుకున్నారు. దానికి తగ్గట్టే మేడమ్ కు కవరేజ్ అదిరిపోయింది. కవరేజ్ కి తగ్గ ప్యాకేజిలు కూడా అందాయని చెప్పుకున్నారు. కాని వీరిని వారు వాడుకున్నారా..వారిని వీరు వాడుకున్నారా అనేదే కొన్నిరోజులైతే గాని క్లారిటీ రాదు.
అన్న పేరు ఎత్తడం లేదు..ఎత్తితే మొహం సీరియస్ అవుతుంది..అమ్మ కూడా ఇటే వచ్చిందని చెప్పుకున్నారు. కాని అన్నతో టచ్ లో ఉన్న రిటైర్డ్ అధికారులు... దాదాపు రిటైర్ అయిన రాజకీయ నేతలు.. వైసీపీలో గతంలో కనిపించిన సెలెబ్రిటీలు ..వీళ్లే షర్మిల ఆస్థానంలో దర్శనమిచ్చారు. జగన్మోహన్ రెడ్డి కి ఇష్టం లేదని తెలిస్తే వారు అడుగుపెట్టేవారా.. ఆ సాహసం చేసేవారా అంటే లేదనే చెప్పాలి. తనకు ఇబ్బంది వస్తే జగన్ ఎవరినీ వదిలిపెట్టరనేది చరిత్ర చెబుతున్న సత్యం.
కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు కురిపిస్తున్నా సరే షర్మిలపై ఎలాంటి ఒత్తిడి కేసీఆర్ శిబిరం నుంచి రావటం లేదు. కేసీఆర్ సహజధోరణికి ఇది విరుద్ధం.
షర్మిల శిబిరం ఫోకస్ చేస్తున్న సామాజికవర్గాలు సైతం రెడ్డి, దళితులు. ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ ఓటు బ్యాంకులే. ఆ రెండు వర్గాలను, అలాగే కాంగ్రెస్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతలనే దగ్గరికి తీయడం అంటే.. వారు కాంగ్రెస్ కే దెబ్బ వేయడానికి వ్యూహం నడుస్తుందనే టాక్ వినపడుతోంది. కాంగ్రెస్ కు దెబ్బపడి.. బిజెపితో సహా మూడు రకాలుగా ఓట్లు చీలితే బెనిఫిట్ కేసీఆర్ కే..ఆ బెనిఫిట్ షేరింగ్ ఎటూ జగన్ కూ ఉంటుంది.
కాకపోతే షర్మిలకు లాంగ్ స్ట్రాటజీ ఉందని చెబుతున్నారు. ఇప్పటికి ఎవరికో ఒకరికి ఉపయోగపడటమే అయినా..భవిష్యత్ లో బలమైన నాయకురాలిగా ఎదగాలని.. అన్న తర్వాత చెల్లే అనిపించుకోవాలనేదే లక్ష్యమని అంటున్నారు. కొత్త ట్విస్ట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీ అనుకున్నా..అది కుదరకపోవడంతో.. ఇప్పుడు సుదీర్ఘకాలంగా ఓ ప్రముఖ చానల్ సీఈఓగా ఉంటున్న వ్యక్తి డైరెక్షన్ లో షర్మిల శిబిరం నడుస్తుందని తెలుస్తోంది.