స్వామి భక్తి అన్ లిమిటెడ్..అందుకే ఇప్పుడు ట్రబుల్
posted on Jun 10, 2021 @ 1:12PM
బిగ్ బాస్ చూసి రమ్మంటే.. ఈ బాస్ కాల్చి వచ్చే రకం. అధినేత అంతరంగాన్ని బాగా అర్ధం చేసేసుకుని.. ఆయన మనసులోని కోరికలన్నీ తీర్చేస్తారు మన పోలీస్ బాస్. ఆయన ఆదేశమిచ్చారంటే.. ఏ సెక్షన్ అడ్డొచ్చినా సరే..విసిరిపారేసి మరీ.. పాటించేస్తారు ఈయన. ఆయనే సీఐడీ డీజీ సునీల్ కుమార్. ఆయన గురించి ఏపీలో ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఇలాగే కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీ చీఫ్ అయిన సునీల్ కుమార్.. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. లేటెస్టుగా రికార్డులు బద్దలుగొట్టి.. చిక్కుల్లో పడిపోయారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు అయినా..అమరావతి కేసులైనా.. లేటెస్టుగా ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు అయినా సరే.. కేసు ఏదైనా.. అది సెన్సేషనల్ కావాల్సిందే...మీడియాలో మార్మోగిపోవాల్సిందే. ఆయన మాట్లాడేది తక్కువే అయినా.. ఆయా కేసుల్లో ఆయన యాక్షన్ మాట్లాడేది మాత్రం చాలా ఎక్కువ. అందుకే చాలా తక్కువ టైములో డీజీపీని మించిన పాపులారిటీని సంపాదించారు ఈ సునీల్ కుమార్.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉండగా స్థానిక ఎన్నికల్లో ఎక్కడెక్కడ హింస జరిగింది, అవకతవకలు జరిగింది వివరిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ముందు ఆ లేఖ నిమ్మగడ్డ రాయలేదని సృష్టించారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఆ తర్వాత నిమ్మగడ్డ తానే రాశానని ఓపెన్ గా చెప్పాక... ఆ లేఖ రాసింది నిమ్మగడ్డ కాదని.. టీడీపీవారే రాసి..ఆయన పేరుతో పంపారని ఆరోపించారు. అంతేకాదు దీనిపై విచారణ జరపాలని ఎంపీ విజయసాయిరెడ్డి కంప్లయింట్ ఇవ్వడంతో.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ రంగంలోకి దిగారు. విచారణ మొదలెట్టారు. ఈసీ ఆఫీసులోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు అన్నీతిరగేశారు..ఏమీ దొరకలేదు.
అయితే ఇక్కడే సునీల్ కొత్త రికార్డు సృష్టించారు. విచారణ మధ్యలో ఉండగా... ఏమీ తేలకుండా.. మీడియాకు బ్రీఫ్ చేయడమనేది సీఐడీ, సీబీఐలు చేయవు. వారు కోర్టులో సమర్పించే నివేదికల ఆధారంగానే మీడియా రాసుకోవాలి. అలాంటిది ఈయన ముందు ప్రభుత్వానికి అనుకూలంగా ఓ మీడియా చానెల్ ను.. ఆ తర్వాత మరి రెండు చానెళ్లను పిలిపించుకుని స్పెషల్ గా బ్రీపింగ్ ఇచ్చారు. లేఖ ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చిందని.. ఇక్కడ ప్రింట్ తీసి నిమ్మగడ్డ పంపించారని.. అయితే ఇంకా ఆధారాలు దొరకాలని మళ్లీ ముక్తాయింపు ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ఇప్పటివరకు ఏమీ తేల్చలేకపోయారు ఈ కేసులో.
తర్వాత అమరావతిలో టీడీపీ నేతలు రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఓ కేసు పెట్టారు. దీని కోసం కొందరు రైతులతో కంప్లయింట్ ఇప్పించారని చెప్పారు. అంతా మన సునీల్ కుమార్ గారి డైరెక్షన్ లోనే. చివరకు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇదంతా ఫేక్ కంప్లయింట్లని.. ఆయా రైతులతో మాట్లాడించారు. చివరకు కోర్టులో కూడా నిలబడలేదు సీఐడీ రిపోర్టులు. ఆ కేసు అలాగే ఉండిపోయింది. ఈ కేసులో ఏకంగా చంద్రబాబుకే నోటీసులిచ్చి.. విచారణకు పిలిపించాలని చూశారు.. కాని హైకోర్టు ఆదేశాలతో కుదరలేదు.
ఇక రఘురామకృష్ణరాజు కేసులోనూ అదే తంతు. కేసు పెట్టడమే సుమోటోగా పెట్టారు. అదే పెద్ద రికార్డు. పెట్టిన కేసు రాజద్రోహం... ఇది మరో రికార్డు. ఇంటరాగేషన్ లో సిట్టింగ్ ఎంపీని కొట్టారని ఆరోపణలు రావడం మరో రికార్డు.. ఇలా సునీల్ కుమార్ రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. అలాంటి సునీల్ పై ఇప్పుడు తాజాగా కంప్లయింట్ ఒకటి వచ్చింది. ఆయన రిజర్వేషన్ మీద ఉద్యోగం పొంది తర్వాత మతం మారారని.. మత ప్రచారం కోసం ఓ సంస్థను కూడా నడుపుతున్నారని .. ఆయనను తొలగించాలని కంప్లయింట్ చేశారు.
ఇప్పటికే రఘురామకృష్ణరాజు కేసులో.. సుప్రీంకోర్టు విచారణలో అన్ని విషయాలు తేలితే.. ముందుగా వేటు పడేది సునీల్ కుమార్ పైనే. అలా పరిమితికి మించి స్వామి భక్తిని ప్రదర్శించినందుకు ఇప్పుడు సునీల్ కుమార్ పీకల్లోతు చిక్కుల్లో పడిపోయారు.