ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. కేంద్రంతో కాళ్లబేరానికేనా?
posted on Jun 10, 2021 9:14AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. హస్తిన పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు జగన్. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్, మరికొంత మంది కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. తిరిగి 11వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకోనున్నారు. నిజానికి సోమవారమే ఢిల్లీకి వెళ్లాల్సింది జగన్. కానీ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. దీంతో అమిత్‌షా అపాయింట్‌మెంట్ లభించేలా వైసీపీ ఎంపీలు నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఎంపీతోపాటు... మరికొందరు సోమవారం ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేశారని అంటున్నారు. కొవిడ్ వ్యాక్సిన్, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదల, కరోనా దృష్ట్యా రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని మంత్రులను జగన్ కోరనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధానితో భేటీ కాకపోయినా.. హోం మంత్రి అమిత్‌షాను తప్పకుండా కలుస్తున్నారు. ఆయన అపాయింట్‌మెంట్ దొరకకపోతే.. ఇతర మంత్రులను కలవకుండా తిరిగి వచ్చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, కడప స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ తదితర అంశాలపై మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారంటూ సీఎం కార్యాలయం వాట్సప్ సందేశాలను పంపిస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం వాటిపై మాట్లాడిన సందర్భం లేదు.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. సీబీఐ, సీఐడీ కేసుల ఇబ్బందుల నుంచి బయటపడటమే జగన్ పర్యటన పరమార్థం అని ప్రచారం జరుగుతోంది. రఘురాం విషయంలో జగన్‌రెడ్డి సర్కారు తీరుపై కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఎంపీ రఘురామ రాజు అరెస్ట్.. దాని తర్వాత జరిగిన పరిణామాలపై కేంద్రం కోపంగా ఉందని తెలుస్తోంది. రఘురామ ఘటనలో అసలేం జరిగిందనే విషయంపై ఇప్పటికే కేంద్రహోంశాఖ వివరాలు సేకరించిందని సమాచారం. రఘురామ కస్టడీలో టార్చర్ ఎపిసోడ్‌ను ఢిల్లీ స్థాయిలో న్యాయ, శాసన, రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లడం.. ఇలా సీబీఐ, సీఐడీ కేసులతో జగన్‌రెడ్డి ప్రమాదంలో ఉన్నారని అంటున్నారు. కరోనా వ్యాక్సినేషన్ అంశంలో పలువురు సీఎంలకు జగన్ లేఖ రాశారు. దీనిపైనా కేంద్రం గుర్రుగా ఉందంటున్నారు.
జగన్ బెయిలు రద్దు పిటిషన్‌లో సీబీఐ తన వైఖరి స్పష్టం చేయకుండా విషయాన్ని కోర్టుకే వదిలేయడం ఆసక్తికర పరిణామం.ఈ ఘటనతో జగన్ ను కేంద్ర సర్కార్ టార్గెట్ చేస్తుందనే చర్చ కూడా మొదలైంది. ఏపీపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. తమిళనాడు తరహా రాజకీయానికి ప్లాన్ చేసిందంటున్నారు. జగన్ బెయిల్ రద్దై జైలుకు వెళితే.. ఏపీలో చక్రం తిప్పేలా అమిత్ షా టీమ్ పక్కాగా స్కెచ్ వేసిందంటున్నారు. జగన్ పై కేంద్రం తాజా వైఖరి చూస్తూంటే... ఆయనపై ఆట మొదలు పెట్టిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.