రేవంత్‌రెడ్డికి పీకే ఎఫెక్ట్? పీసీసీ పోస్ట్ ఫసక్! కేసీఆర్ స్కెచ్?
posted on Jun 15, 2021 @ 1:00PM
ఇక్కడ స్విచ్ వేస్తే.. అక్కడ లైట్ వెలిగినట్టు.. అక్కడ ప్రశాంత్ కిశోర్ స్విచ్ ఆఫ్ చేస్తే.. ఇక్కడ రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పోస్ట్ ఫసక్ అంటోంది. రేపోమాపో రేవంత్‌కి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అనుకుంటుండగా.. పీకే ఎంట్రీతో రెడ్డి గారి కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రశాంత్ కిశోర్‌కు, రేవంత్‌రెడ్డికి ఏం లింక్ అనే అనుమానం రాకమానదు. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే అదే మరి. వింటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. 10 జన్‌పథ్ నుంచి అందిన పక్కా సమాచారం ఇది.
రేవంత్‌రెడ్డి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. పేరు ఘనంగానే ఉన్నా.. పవర్ కాస్త తక్కువే. సెకండ్ ప్లేస్‌తో అడ్జస్ట్ అయ్యే రకం కాదాయన. అందుకే నేనే నెంబర్‌వన్ అంటూ నెంబర్ వన్ పొజిషన్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవికి ఆయన అన్నివిధాలా అర్హుడే. కాకపోతే, అది కాంగ్రెస్ పార్టీ కావడమే డిస్అడ్వాంటేజ్. కప్పల సామెత మాదిరి ఉంటుందక్కడ. ఒకరు ఒకడుగు ముందుకు వేస్తే.. నాలుగురు కాలు పట్టి వెనక్కి లాగుతుంటారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం దక్కడంలోనూ అదే జరుగుతోందని అంటున్నారు. రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉందంటూ వార్తలు. అయినా.. అదిగో ఇదిగో అంటూ కాలక్షేపమే కానీ.. రేవంత్‌రెడ్డికి మిఠాయి పొట్లం చేజిక్కడం లేదు. రేవంత్‌రెడ్డికి పీసీసీ దక్కకపోవడం వెనుక ఇన్నాళ్లూ ఇదే కారణాలు వినిపించాయి. కనిపించాయి. కానీ, లేటెస్ట్‌గా.. రేపేమాపో ఇక ఫైనల్ అవుతుందని అనుకుంటుండగా.. మరో చిక్కొచ్చి పడింది. ఈసారి రేవంత్‌రెడ్డి పీఠానికి ప్రశాంత్ కిశోర్ అడ్డుతగిలాడని తెలుస్తోంది.
అవును, ప్రశాంత్ కిశోరే రేవంత్‌రెడ్డి పోస్టుకు ఎసరు పెట్టారట. బీజేపీకి వ్యతిరేకంగా ఈమధ్య పీకే దేశవ్యాప్తంగా రాజకీయ పునరేకీకరణకు పావులు కదుపుతున్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే శరద్‌పవార్‌తో అధికారిక చర్చలు ముగిశాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లతో పాటు ఏపీ సీఎం జగన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతోనూ రహస్య మంతనాలు జరిగినట్టు సమాచారం. ఈ మీటింగే రేవంత్‌రెడ్డి కొంప ముంచేందుకు కారణమైందని అంటున్నారు.
రాహుల్‌గాంధీని పీఎం చేసేందుకు.. కాంగ్రెస్‌కు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు ప్రశాంత్‌కిశోర్. సీఎం జగన్‌రెడ్డి ఎలానూ పీకేకు క్లోజ్ కాబట్టి.. అక్కడ ఈజీగానే పని అయిపోయింది. ఇక తెలంగాణలో కేసీఆర్‌కు బీజేపీ పక్కలో బల్లెంలా మారడం ఆయన్ను అసహనానికి గురి చేస్తోంది. మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నుంచి ఈటల వరకు.. టీఆర్ఎస్ అసంతృప్తులందరినీ కాషాయం పార్టీ అక్కున చేర్చుకుంటుండటంతో కేసీఆర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అదే టైమ్‌లో పీకే నుంచి కాల్ రావడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
భవిష్యత్‌లో రాహుల్‌ను ప్రధాని చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తే.. ఆ మేరకు తమ నుంచి కూడా క్విడ్ ప్రోకో ఉంటుందనేది.. పీకే తీసుకొచ్చిన ప్రతిపాదన. గతంలో ఓసారి యూపీఏతో కలిసి పని చేసి.. కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన చరిత్రను గుర్తు చేశారట. ఎంతకాదనుకున్నా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై ఎక్కడో అభిమానం లేకపోలేదు. అటు.. మోదీని, బీజేపీని అసలేమాత్రం నమ్మే పని లేదు. ఇప్పటికే కేసులు, జైలు అంటూ కమలనాథులు కేసీఆర్‌పై దూకుడు మీదున్నారు. ఇవన్నీ బేరీజు వేసుకున్న గులాబీ బాస్.. భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసేందుకు ఓకే అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక్కడే కేసీఆర్ ఓ కండిషన్ కూడా పెట్టారట. అది.. రేవంత్‌రెడ్డిని పక్కనపెట్టాలని.....
అవును, కేసీఆర్‌కు తెలంగాణలో బద్దశత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రేవంత్‌రెడ్డి మాత్రమే. తనను జైల్లో పెట్టించినందుకు.. ఏనాటికైనా కేసీఆర్‌ను అదే జైల్లో కుక్కాలనేది రేవంత్‌రెడ్డి జీవితాశయం అంటారు. అందుకే, రేవంత్‌రెడ్డి ఎంత ఎదిగితే.. కేసీఆర్‌కు అంత మైనస్. రేవంత్ పీసీసీ చీఫ్ అయితే.. ఇక నెక్ట్స్ స్టెప్ సీఎం కుర్సీనే. అందుకే, రేవంత్‌ను మొదట్లోనే తుంచేలా.. కేసీఆర్ పీకే ముందు కండిషన్ పెట్టారట. తాను కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయాలంటే.. రేవంత్‌రెడ్డి ప్రాధాన్యం తగ్గించాలనేది కేసీఆర్ షరతు. అయితే, కాంగ్రెస్‌తో మాట్లాడి చెబుతానని ప్రశాంత్ కిశోర్ అన్నారట. ఆ తర్వాత.. హస్తం పార్టీ అధిష్టానం ముందుకు కేసీఆర్ ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా ఉండటం ఖాయం. బీజేపీ వార్ వన్‌సైడ్ మాత్రం కాదు. అదే టైమ్‌లో కాంగ్రెస్‌కు మంచి సీట్లు ఏమీ రాకపోవచ్చు. అలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకం. ప్రతీ ఒక్క ఎంపీ సీటు ప్రాధాన్యం. ఆ లెక్కన.. టీఆర్ఎస్ మద్దతు తప్పకుండా అవసరం పడుతుందని పీకే కాంగ్రెస్‌కు నచ్చజెప్పారట. గులాబీ సపోర్ట్ కావాలంటే.. రేవంత్‌రెడ్డిని ప్రస్తుతానికి పక్కనపెట్టాలని సూచించారట. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనతో కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచనలో పడిందట. అప్పటికే టీపీసీసీ చీఫ్ పదవికి రేవంత్‌రెడ్డి పేరు ఖరారైనా.. పీకే ఎంట్రీతో ఆయన పేరు సైడ్‌వేస్‌లోకి వెళ్లిపోయిందట.
ఎలాగూ సీనియర్లంతా మూకుమ్మడిగా రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో చీలిక వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే, ఒక్క రేవంత్‌రెడ్డి కోసం అన్ని సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలనే అభిప్రాయానికి వచ్చేసిందట అధిష్టానం. అటు భవిష్యత్‌లో కేసీఆర్‌తో ప్రయోజనాలు.. ఇటు వర్తమానంలో సీనియర్లతో అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు పీసీసీ చీఫ్ జాబితా నుంచి రేవంత్‌రెడ్డి పేరు డిలీట్ చేశారని అంటున్నారు. అందుకే ఇంత ఆలస్యం అవుతోందని.. మధ్యేమార్గంగా త్వరలోనే జీవన్‌రెడ్డినో, శ్రీధర్‌బాబునో పీసీసీ అధ్యక్షుడుగా ప్రకటిస్తారని తెలుస్తోంది. చూశారా.. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇదేనేమో. ఎక్కడ రేవంత్‌రెడ్డి.. ఎక్కడి ప్రశాంత్ కిశోర్.. ఇంకెక్కడి కేసీఆర్.. ఎవరో ప్రధాని కావడానికి.. ఇంకెవరి పీసీసీ పదవికో ఎసరు రావడం ఆసక్తిగా లేదు.. అందుకే అంటారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని....