అంతలోనే ఏమైంది..? కేసులు మాయమైపోయాయా?
posted on Jun 15, 2021 @ 12:30PM
ఆయన ఫైలు చూసి సంతకం పెట్టకుండా ఆపేశారు. క్రిమినల్ రికార్డు ఉన్నవారికి ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తామని ప్రశ్నించారు. పెద్దాయన దగ్గరికి పూలు,పండ్లు పట్టుకుని జగనన్న, వదినమ్మ వెళ్లారు. గౌరవ మర్యాదలన్నీఅవగానే ఫైలుపై సంతకం పెట్టేశారు పెద్దాయన. జగన్ సార్ .. పెద్ద సార్ ని కలిసి కేసుల సెక్షన్లు మార్చి చెప్పాడా.. లేక కేసులు కొట్టేస్తున్నామని చెప్పాడా.. అసలు కేసులే లేవు సార్..అవన్నీ ఉత్తదే అని చెప్పాడా... ఏం చెబితే గవర్నర్ సార్ కన్విన్స్ అయిపోయి ఫైలు ఓకె చేసేశారు? లేక నిబంధనలపై అవగాహన లేక గవర్నర్ ఫైలు ఆపితే... ఆ రూల్స్ వివరించి సంతకం పెట్టించారా జగన్ గారు?
చిత్రంగా ఉంది కదా. నిజమే మరి. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి పేర్లను పంపితే..గవర్నర్ గారు అభ్యంతరం చెప్పారు. వారిద్దరిపై కేసులున్నాయని..నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఎలా పంపుతామని ప్రశ్నించారని వార్తలొచ్చాయి. సంతకం పడి తిరిగి రావాల్సిన ఫైలు రాకపోవడంతో..సీఎంఓ వెంటనే అలర్ట్ అయింది. ముఖ్యమంత్రిగారికి విన్నవించింది..ఆ వెంటనే ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం.. ఇవ్వడం.. కలవడం... సంతకం పెట్టేయడం అన్నీఅయిపోయాయి.
ఎమ్మెల్సీ.. శాసనమండలి..అంటే పెద్దల సభ. మేధావులు శాసనసభకు నేరుగా ఎన్నికయ్యేంతగా ప్రజా మద్దతు దొరకదు కాబట్టి..వారి సూచనలు,సలహాలు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడతాయి కాబట్టి.. శాసనమండలి అని ఒకటి పెట్టి వాటిలోకి ఎమ్మెల్సీలుగా (శాసనమండలి సభ్యులుగా) వచ్చేందుకు ఏర్పాటు చేశారు రాజ్యాంగంలో. కొందరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారు..అలాగే కొందరిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు..అలాగే కొందరిని గ్రాడ్యుయేట్స్,, ఇంకా టీచర్లు, ఇవన్నీ కాక.. స్థానిక సంస్థల సభ్యులు జిల్లాకొకరిని ఎన్నుకుంటారు. ఇలా రకరకాలుగా ఎన్నికై మండలికి వస్తారు. మొదట్లో ఆ మర్యాద బాగానే కొనసాగింది. పోను పోను..ఇది ఒక రాజకీయ షెల్టర్ గా మారింది.
ఎమ్మెల్యేలుగా ఓడిపోయినవాళ్లను.. అప్పటికప్పుడు ఎన్నికలు లేకపోతే..ఎమ్మెల్సీ అవకాశం ఉంటే అందులో పంపడం.. వంటివి మొదలయ్యాయి. చివరికి పరిస్ధితి ఎక్కడికి వెళ్లిందంటే ఎమ్మెల్సీ పదవిని డబ్బులిచ్చి కొనుక్కునేదాకా వెళ్లిందనే ఆరోపణలు వచ్చాయి. పెద్దల సభ అనేది మర్చిపోయి రౌడీలను, కాంట్రాక్టర్లను, అవినీతి తిమింగలాలను ఎమ్మెల్సీలుగా పంపే కల్చర్ వచ్చేసింది. ఈ పరిస్ధితికి జనం కూడా అలవాటుపడిపోయారు.
అయితే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి ఫైళ్లను ఆపగానే...అందరూ ఆశ్చర్యపోయారు. పర్వాలేదు రబ్బర్ స్టాంపులా కాకుండా...గవర్నర్ మంచి పని చేశారు. క్రిమినల్ రికార్డు ఉన్నవారిని పెద్దల సభకు ఎలా పంపుతామనే ఆలోచన రావడమే గొప్ప విషయంగా అందరూ ఫీలయ్యారు. కాని జగన్ వెళ్లి కలవగానే సంతకం పెట్టేశారు.
దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. జగన్ కేంద్రంలోని పెద్దలతో గవర్నర్ కు చెప్పించి ఉంటారని.. ఆ తర్వాతే వెళ్లి కలిసి ఉంటారనే టాక్ నడుస్తోంది. గవర్నర్ గా ఎన్ని అధికారాలున్నా..ఆ పదవి ఇప్పించిన కేంద్ర పెద్దలకు జీహూజూర్ అనడం ఆనవాయితీయే. గవర్నర్ గా ఉన్నప్పటికీ.. పూర్వాశ్రమంలో ఆర్ఎస్ఎస్, బిజెపి నేత విశ్వభూషణ్. అలాంటి మనిషి బిజెపి పెద్దలు చెబితే వినకుండా ఉంటారా? అందుకే మొదట ఏ అధికారో చెబితే ఆగి ఉంటారు..తర్వాత ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే అయితే ఓకె అని ఉంటారనే విమర్శలు వస్తున్నాయి. ఏమైనా.. సరైనకారణంతో ఫైలు ఆపేసి..ఏ కారణం లేకుండానే ఓకె చేసేస్తే... ఇలా రకరకాల అనుమానాలు వస్తుంటాయి మరి.