ఆట మొదలైంది.. ఘోరీ కడతా ! హుజూరాబాద్ లో ఈటల గర్జన
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన కార్యాచరణ మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. రాజీనామా తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వచ్చిన రాజేందర్.. తన సత్తా ఏంటో తెలిసేలా బలప్రదర్శన చేశారు. వేలాది మందితో ర్యాలీ తీసి గులాబీ పార్టీలో గుబులు రేపారు. కొవిడ్ భయం వెంటాడుతున్నా ఈటల కోసం వేలాది మంది తరలిరావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
హుజూరాబాద్ లో ఉద్వేగంగా ప్రసంగించిన ఈటల రాజేందర్.. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. తనను, తన అనుచరులను వేధిస్తే ఘోరీ కడతామని హెచ్చరించారు. హుజురాబాద్ ప్రజలు ప్రేమకు లోగుతారని చెప్పారు ఈటల. తనకు మద్దతు ఇస్తున్న వారిని ఇంటిలీజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వాళ్ళను వేధిస్తే ఖబడ్ధార్ అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవము ఉందా అని ఈటల ప్రశ్నించారు. 2024లో జరిగే ఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నిక రిహార్సల్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ వేదికగా మారిందన్నారు. ఇంటింటికి వెళ్లి అందరిని కలుస్తానని ఈటెల రాజేందర్ తెలిపారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ర్యాలీలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ లో ఆట మొదలైందని, రేపు వేట గా మారొచ్చని చెప్పారు.ఒక్కరు ఇద్దరం అయ్యాం, ముగ్గురమై ఐదుగురిని వేసుకుని అసెంబ్లీలో బిజెపి ఎల్ పి కార్యాలయం సాధిస్తామని తెలిపారు. ఇప్పటివరకు నీతికి నిజాయితీతో ఉన్న హుజురాబాద్, ఇకపై మందుసీసాలకు బిర్యానులకు పట్టం కట్టాలని కోరినట్లు మంత్రి గంగుల తీరు ఉందని రఘునందన్ మండిపడ్డారు. ప్రకృతి వనం, వైకుంఠధామం లకు కేంద్రమే డబ్బులు ఇచ్చిందన్నారు.
కేంద్రం ఇచ్చిన డబ్బుల తోనే గులాబీ రంగు వేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి సొంత నియోజవర్గానికి వచ్చిన ఈటల రాజేందర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. మొదట కాట్రపల్లికి చేరుకున్న ఈటలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ నుంచి ఈటెల సమక్షంలో బిజెపిలో చేరారు. అక్కడి నుంచి హుజూరాబాద్ వెళ్లారు రాజేందర్. ఈటలకు మద్దతుగా వేలాది మంది తరలివచ్చారు. జై ఈటల నినాదాలాతో హుజూరాబాద్ మార్మోగింది. హుజరాబాద్ నుంచి రాంపూర్, శాలపల్లి, చెల్పూర్ మీదుగా జమ్మికుంటకు... అక్కడినుంచి కొత్తపల్లి, ధర్మారం, శాయంపేట, నాగులపేట, గండ్ర పల్లి, తణుగుల మీదుగా వావిలాలకు చేరుకున్నారు రాజేందర్. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ ర్యాలీలో అన్ని గ్రామాల్లో మహిళలు, అభిమానులు ఈటలకు ఘన స్వాగతం పలికారు. జమ్మికుంట మండలం నాగారంలో తన ఇష్టదైవమైన భక్తాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నే చేపట్టడం ఈటలకు సెంటిమెంట్. ఈటెల వెంట ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ఉన్నారు.
మరోవైపు ఈటల రాజేందర్ సతీమణి జమున కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. కమలాపూర్ మండలం గోపాలపురం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బిజెపి మీడియా లీగల్ సెల్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నతో కలిసి ఆమె కమలాపురం మండలంలోని పఅంబాల, గునిపర్తి, మాదన్నపేట, శనిగరం, గోపాలపురం, బత్తివానిపల్లి లో పర్యటించారు. తెలంగాణ రాష్ట్రం కోస రాజేందర్ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. కావాలని తమని పార్టీ నుండి బయటకి పంపించారని ఆరోపించారు. నియోజకవర్గంలో గతంలో కంటే తమకు రెట్టింపు ఆదరణ లభిస్తుందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు ఈటల జమున.