డెల్టా ప్లస్.. అంతకుమించి!.. కరోనాలో డేంజరస్ వేరియంట్..
posted on Jun 15, 2021 @ 10:52AM
ఉన్న వేరియంట్లు సరిపోనట్టు.. కరోనా వైరస్ మారోసారి రూపాంతరం చెందింది. ఇప్పటికే భారత్‌ను బెంబేలెత్తిస్తున్న డెల్టా వేరియంట్.. సరికొత్తగా డెల్టా ప్లస్‌గా మారింది. డెల్టానే ఇంత డేంజరస్‌గా ఉంటే.. డెల్టా ప్లస్ ఇంకెంత ఖతర్నాక్‌గా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ఇప్పటికే వైరస్‌పై ప్రయోగిస్తున్న మెడిసిన్‌కు ఇది విరుగుడు తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎంత పవర్‌ఫుల్ మందును ప్రయోగించినా.. వైరస్ వ్యాప్తి కొనసాగేలా ఇది రూపాంతరం చెందిందని అంటున్నారు.
మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ ట్రీట్‌మెంట్ గురించి వినే ఉంటారుగా. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా సోకితే ఈ మందుతోనే ట్రీట్‌మెంట్ చేశారు. ఇటీవల ఇండియాలో కూడా ఈ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. దేశంలో ఇటీవలే ఆమోదం పొందిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ చికిత్స.. కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన డెల్టా ప్లస్ మీద పని చేయడం లేదు. ఒక్కో డోస్ 60వేలు ఖరీదైన ఇంతటి పవర్‌ఫుల్ మెడిసిన్‌నే డెల్టా ప్లస్ వేరియంట్ ఎదుర్కొంటోందంటే.. ఇది ఎంత శక్తివంతమైన వైరసో తెలుస్తోంది.
మోనోక్లోనల్ యాంటీబాడీలను ల్యాబ్‌లో కృత్రిమంగా తయారు చేస్తారు. వైరస్ నుంచి శరీరాన్ని రక్షించడానికి ఉత్పత్తయ్యే నేచురల్ యాంటీ బాడీలను ఇవి పోలి ఉంటాయి. కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొనేలా ఈ కాక్‌టెయిల్‌ను రూపొందించారు. మన శరీరంలోని రోగనిరోధక స్పందన నుంచి తప్పించుకోవడానికి వైరస్‌లో ఉండే ఒక వ్యవస్థతో ఈ ఉత్పరివర్తనం జరిగి ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్‌కు సంబంధించిన డెల్టా వేరియంట్ మరోసారి ఉత్పరివర్తన చెంది, ‘డెల్టా ప్లస్’ లేదా ఏవై.1 పేరుతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. డెల్టా ప్లస్.. వైరస్ వేరియంట్‌పై ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. భారత్‌లో డెల్టా ప్లస్ ఉనికి చాలా తక్కువగానే ఉందని తెలిపారు.
కరోనాలో బి.1.617.2 అనే రకం తొలుత భారత్‌లోనే వెలుగు చూసింది. అదే ‘డెల్టా’ వేరియంట్. దేశంలో ప్రస్తుత కొవిడ్ సెకండ్ వేవ్‌కు ఇదే ప్రధాన కారణం. ‘డెల్టా’లో కె417ఎన్ అనే ఉత్పరివర్తన కారణంగా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దీన్ని బి.1.617.2.1 అని పిలుస్తున్నారు. వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్‌లో ఈ ఉత్పరివర్తన వచ్చిందని దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్త వినోద్ స్కారియా చెప్పారు. మానవ కణాల్లోకి ప్రవేశించడానికి ఈ ప్రొటీన్ వైరస్‌కు కీలకం.
ప్రపంచవ్యాప్తంగా 62 మంది కొవిడ్ బాధితుల నమూనాల్లో ‘డెల్టా ప్లస్’ వెలుగు చూసింది. గతవారం భారత్‌లో ఏడు నమూనాల్లో ఇది కనిపించింది. ‘‘ప్రస్తుతం ఇది భారత్‌లో పెద్దగా కనిపించడంలేదు. ఐరోపా, ఆసియా, అమెరికాల్లో ఎక్కువగా వెలుగుచూసింది’’ అని ఐజీఐబీ వెల్లడించింది.
డెల్టా ప్లస్‌పై భయాలు అవసరంలేదని అంటూనే.. యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉండటం ఇబ్బందికరమేనని చెబుతున్నారు. కొత్త వేరియంట్ ఉద్ధృతంగా వ్యాపిస్తుందని గానీ, తీవ్ర వ్యాధి కలిగిస్తుందని గానీ ఇంకా నిర్ధరించలేదన్నారు. ఇది మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుంటుందా అనేది తేల్చేందుకు.. పూర్తిస్థాయిలో టీకా పొందిన వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, పరీక్షించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్పటి వరకూ జాగ్రత్తే మనకు రక్ష.