ఈటలది గడీలను మించిన ప్యాలెస్!
posted on Jun 15, 2021 @ 12:30PM
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్ గా వాయిస్ పెంచారు టీఆర్ఎస్ నేతలు. మూకుమ్మడిగా ఆయనపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీలో చేరిక సందర్భంగా ఢిల్లీలో జరిగిన పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఈటలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ లీడర్లు. కాషాయ కండువా కప్పుకున్న తొలి రోజే రాజేందర్ కు అవమానం జరిగిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఈటల వామపక్ష భావజాలం ఎక్కడికి పోయిందంటూ మండిపడ్డారు.
బీజేపీలో చేరే ముందు రాజేందర్ కు కనీస గౌరవం దక్కలేదని... కనీసం నడ్డా సమక్షంలో చేర్చుకోలేదని కడియం శ్రీహరి అన్నారు. బీజేపీలో చేరిన రోజే ఈటెలకు దక్కిన పరాభవం చూస్తుంటే తనకు జాలి కలుగుతుందన్నారు. బీజేపీలో నచ్చిన సిద్ధాంతాలు, విధానాలేంటో ఈటల ప్రజలకు తెలపాలన్నారు కడియం. బీజేపీ విధానాలు నచ్చికాదు.. కేసులు నుండి తప్పించుకోవడానికే ఆయన పార్టీలో చేరారని తెలిపారు. బీజేపీ పాలనలో పేదల స్థితిగతులు మారాయా ..? అని కడియం ప్రశ్నించారు. బీజేపీ ప్రజలను నమ్ముకొని పరిపాలన చేయడంలేదని.. కేవలం కులమతాలను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. బలహీన వర్గాల పొట్టగొడుతున్న బీజేపీలో ఏం చూసి చేరావో ప్రజలకు వివరించాలని ఈటలను డిమాండ్ చేశారు రాజేందర్.
బీజేపీ లో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో దేశ ప్రజలందరికి తెలుసున్నారు కడియం. ఈడీ దాడులతో గుత్తాదిపత్యం చేలాయిస్తుందన్నారు. గడీలను మించిన ప్యాలెస్, వేల కోట్ల విలువ కలిగిన భూ కబ్జాలు ఏ సోషలిస్టు భావాలని ప్రశ్నించారు. వేల కోట్లు వెచ్చించి వివాహాలు చేయడం ఏ ఫ్యూడల్ సిద్ధాంతమని ఈటలను నిలదీశారు కడియం. అసైన్డ్ భూములు, ఆలయ భూములు కొనుగోలు చేశానని చెబుతున్న రాజేందర్.. చట్ట వ్యతిరేకంగా కొనుగోలు చేసిన భూములు ఎందుకు ప్రభుత్వానికి అప్పగించడం లేదని అన్నారు. ఐదేళ్ల నుండి అభిప్రాయ భేదం ఉన్నా.. ఇంతకాలం ఆత్మవంచన చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. సీఎం పనితీరు బాగాలేదని భావిస్తే ముందే రాజీనామా చేసి ఉంటే ప్రజలు విశ్వసించేవారన్నారు. కేవలం కేసులకు భయపడే బీజేపీలో ఈటెల చేరారన్నారు కడియం.
బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని, జాతీని ముక్కలు చేసే దౌర్భాగ్యపు పార్టీ అని కడియం శ్రీహరి మండిపడ్డారు. వెస్ట్ బెంగాల్ లో మమత బెనర్జీని ఓడించడం కోసం తోడేళ్ళలా మూకుమ్మడి దాడి చేస్తే ప్రజలు షాక్ ఇచ్చారన్నారు. బెంగాల్ ప్రయోగం తెలంగాణలో చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని కడియం ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ లో బీజేపీ ఉనికిలేదన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ కనుమరుగై పోయిందని.. మరో 20 ఏళ్ల వరకు ఏకైక బాహుబలి కేసీఆర్ ఒక్కరే అన్నారు కడియం శ్రీహరి.