జగన్ అసలు రూపం బయట పెడతా.. గోనే ప్రకాష్ సవాల్
ఎక్కడికైనా వస్తా ... పులివెందుల కాదు .. ఇడుపలపాయకైనా వస్తా ... జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం బయట పెడతా ... ఇది ఆయన ప్రత్యర్ధులు ఎవరో చేసిన వ్యాఖ్య కాదు, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనే ప్రకాశ రావు చేసిన సవాల్. నిజం నిప్పులాంటిది, ముట్టుకుంటే కాలుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సుపరిచితమైన, గోనే ప్రకాశ రావు కూడా అంతే, ఆయనతో పెట్టుకుంటే, అంతే, రాజకీయ ప్రముఖుల చీకటి కోణాలు ఆయన మాటల ప్రవాహంలో కొట్టుకుని వస్తాయి. ఇక ఆ తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.
అయితే ఇప్పుడు ఆయన పనిగట్టుకుని తిరుపతి వెళ్లి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంతలా విరుచుకు పడ్డారు ... ఒక్క జగన్ రెడ్డిని మాత్రమే కాదు, ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, ఈ అందరినీ మించి, జగన్ రెడ్డి అంతరంగిక ముఠాలోని ఒక్కరినీ వదల కుండా ప్రతి ఒక్కరినీ పేరు పేరున, ఎందుకు టార్గెట్ చేశారు. ఎందుకు ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అంతటి వాడిని, ‘బ్రోకర్’ అనేశారు, మళ్ళీ దాని మీద వివరణ ఎందుకు ఇచ్చారు, వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డిని కుటుంబ సభ్యులే హత్య చేశారని ఎందుకు కుండబద్దలు కొట్టారు, ఈ హత్యకు సంబంధించి ఇద్దరు ఎంపీలు, అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి మీద ఎందుకు అనుమానాలు వ్యక్తం చేశారు, అంటే, అందుకు ప్రత్యేక కారణం అంటూ ఏమీ ఉండకే పోవచ్చును.నిజానికి, గోనే ప్రకాశ రావుతో సన్నిహిత పరిచయం ఉన్నవారు, ఆయన, ఉన్న నిజాలను బయట పెడతారే కానీ, ఎవరినీ టార్గెట్ చేయరనే అంటారు. అయితే ఉన్న మాటంటే ఉలిక్కి పడే నైజం ఉన్న వారు, నిజాన్ని చూసి భయపడే వారు మాత్రమే ఆయనకు ఉద్దేశాలను అంటగడతారని అంటారు.జగన్ రెడ్డి అభిమానులు అలాగే ఉలిక్కి పడ్డారు.. ఇరుక్కున్నారు.
నిజంగా అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్ర ప్రదేశ్’లో కానీ, ఆయన నిజాయతీని ఎవరు సంకించరు. నిజానికి ఆయన తిరుపతి ప్రెస్క్లబ్’లో శుక్రవారం చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చాల కాలంగా మీడియాలో, రాజకీయ వర్గాలలో చర్చకు వస్తూనే ఉన్నాయి. జగన్ రెడ్డి అభిమానులు గోనే ప్రకాష్’కు దమ్ముంటే ఏపీకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని చేసిన సవాలుకు జవాబుగానే ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్’ లో ప్రెస్ మీట్ పెట్టి, జగన్ రెడ్డి నిజరూపాన్ని, అవిష్కరించారు, అదే ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యేకం. అంతే కాదు, నాకు దమ్ముంది ఇక ముందు కూడా ఏపీలో ఎక్కడైనా, చివరకు పులివెందుల, ఇడుపులపాయలో అయినా జగన్ రెడ్డి గురించి మాట్లాడతా అని ప్రతి సవాలు చేశారు. అలాగే, తనను బెదిరిస్తున్న జగన్ రెడ్డి అమెరికా అభిమానులకు కూడా త్వరలో అమెరికా వస్తున్నానని, సినిమాటిక్’గా “మీ వీధికి వస్తా, మీ ఇంటికి వస్తా, మీ ఇంటి పక్కనున్న హోటల్ కోస్తా” అంటూ సవాలు విసిరారు. మొత్తానికి బంతిని జగన్ రెడ్డి కోర్టులో వేశారు, గోనే ప్రకాశ రావు.
గోనే ప్రకాశ రావు ప్రస్తావించిన, జగన్ మళ్ళీ జైలుకు ప్రస్తావన కొత్తది కాదు. అందులో నిజం లేక పోలేదు.అలాగే, జగన్, విజయమ్మ, షర్మిల త్రయం ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాగిస్తున్న ముక్కోణపు రాజకీయం విషయం ఆయన చేసిన వ్యాఖ్యలో తప్పు లేదు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, వాలంటీర్ వ్యవస్థ, వారి జీతభత్యాల విషయంగానీ, వివేకానంద హత్య గురించి అయన వెలిబుచ్చిన అభిప్రాయాలు, అనుమానాలు గానీ, గీత దాటుతున్న ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు సజ్జల వారికి ఇచ్చిన సలహా విషయంగా గానీ, మరో అభిప్రాయనికి తావే లేదు. జగన్ రెడ్డి, షర్మిల మధ్య రాజకీయ విబేధాలు, కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నా, షర్మిల పెట్టబోయే పార్టీ పేరు విషయంలో, విజయమ్మ ఏ విధంగా ఎన్ఓసీ ఇస్తారని అడగడం తప్పు కాదు,అందరు అడుగుతున్నదే. నిజానికి షర్మిల రాజకీయ ఎంట్రీ విషయంలో, ఎవరికుండే అనుమానాలు వారికున్నాయి. చివరకు బ్రదర్ అనీల్, క్రైస్తవ సంఘాలు ఆమెను వెనకుండి నడిపితున్నాయి అనే అనుమనాలు కూడా ఉన్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉండి షర్మిల దీక్షకు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా దీక్షలో ఎలా పాల్గొంటారన్నారు. వైఎస్ విజమ్మకు, వైఎస్ జగన్ ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించారు.ఈ ప్రశ్నలకు, సమాధానం చెప్పవలసిన బాధ్యత జగన్ అండ్ ఫ్యామిలీ మీద ఉంది.అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలకు గానీ, వాలెంటీర్లకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి మిత్ర బృందం సమాధానం ఇవ్వాలి .. మొత్తానికి జగన్ రెడ్డి అభిమానులు, పిలిచి మరీ చీవాట్లు పెట్టించుకున్నారు. ఇక ఈ రచ్చ ఎంతవరకు పోతుందో , ఎవరి కొంప ముంచుతుందో..