కేసీఆర్ ఆస్తులే టార్గెట్! ఈటల డైరెక్ట్ అటాక్?
posted on Jun 14, 2021 @ 10:15PM
ఈటల రాజేందర్. ఈ పేరు వినగానే మదిలో ఓ రూపం మెదులుతుంది. పిట్ట కొంచెం.. కూత ఘనం టైప్ లీడర్. ఎప్పుడూ కేసీఆర్ పక్కనే కనిపించే నాయకుడు. మెడలో గులాబీ కండువా. ఇదంతా గతం. ఇకనుంచి టోటల్ డిఫరెంట్. అదే మనిషి. అదే కంఠం. కానీ, వాయిస్‌లో వర్షన్ ఛేంజ్ అయింది. మెడలో కండువ రంగు మారిపోయింది. గులాబీ పోయి కాషాయం వచ్చే డుం..డుం..డుం...
ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయంలో కాషాయ కండువా కప్పేసుకున్నారు ఈటల రాజేందర్. ఇన్నాళ్లూ గులాబీ కండువలో చూసి, చూసి.. ఒక్కసారిగా కాషాయ కండువాలో చూడాలంటే కాస్త కొత్తగా కనిపిస్తోంది. కానీ, త్వరగానే అలవాటు అయిపోతుంది లేండి అది వేరే విషయం. అయితే, ఇక్కడ మేటర్ కండువా గురించి కాదు. బీజేపీ జెండా వెనుక ఉన్న ఎజెండా గురించి. టీఆర్ఎస్‌లో ఉన్నన్నాళ్లూ ఈటల నోటికి పెద్దగా పని పడలేదు. విమర్శలు, వ్యూహాలు వినిపించాల్సిన, పన్నాల్సిన అవసరం ఏర్పడనే లేదు. ప్రెస్‌మీట్లు, మీడియా కవరేజీల అవసరం రాలేదు. ఇకపై.. సీన్ అమాంతం మారిపోనుంది. ఇక నోరు అరిగిపోయేదాకా.. నోటికి పని చెప్పాల్సిన పని ఉంటుంది. స్వతహాగా ఉద్యమ నాయకుడైన రాజేందర్.. ఇక తన ఈటెల్లాంటి మాటలతో కేసీఆర్‌పై యుద్ధానికి సిద్ధం కావాల్సిందే.
కాషాయ కండువా కప్పుకున్న రోజే.. గులాబీ బాస్‌పై ఈటెలు విసిరారు ఈటల రాజేందర్. నీ ఆస్తులు.. నా ఆస్తులు.. లెక్క తేలుద్దాం రా.. అంటూ కేసీఆర్‌ను సవాల్ చేశారు. సిట్టింగ్ జడ్జితో కానీ, సీబీఐతో కానీ.. ఎంక్వైరీకి సిద్దమా అంటూ ఢిల్లీ బీజేపీ ఆఫీసు నుంచి గట్టిగానే తొడగొట్టారు రాజేందర్. ఇది కదా కావాల్సింది.. అంటున్నారు కమలనాథులు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోందని కేసీఆర్‌ను నిలదీశారు ఈటల. అబ్బా ఛా.. ఇన్నాళ్లూ మీరు ఆయన వెంటే ఉన్నారుగా ఆ సొమ్మంతా ఎలా వస్తుందో మీకు తెలీదా? ఆ కిటుకేంటో మీరే బయటపెట్టొచ్చుగా అంటూ ఈటలపైనా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. రాజీ..కీయాల్లో ఇవన్నీ కామనే అనేది వేరే విషయం అనుకోండి...
అయితే, ఈటల బీజేపీలో చేరిన తొలిరోజే కేసీఆర్ ఆస్తులను టార్గెట్ చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. భూకబ్జా ముద్రేసి తనను అవమానకరంగా గెంటేసిన గులాబీ బాస్‌ను.. అదే అవినీతి, అక్రమాల ఎజెండాతో దెబ్బ కొట్టాలనేది రాజేందర్ రాజకీయ వ్యూహంలా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఆస్తులు అనకొండాలా పెరిగిపోతుంటాయి. అందుకే, టీఆర్ఎస్‌కు వందల కోట్లు విరాళాల రూపంలో వచ్చి పడ్డాయి. పార్టీ ఫండ్స్ అనే కాదు.. కేసీఆర్ అండ్ కో.. పర్సనల్ అస్సెట్స్ కూడా కొండంత పోగయ్యాయని అంటారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. ఆ కాసుల గుట్ట నుంచి గుప్పెడు గుప్పెడు సొమ్ము బయటకు తీసి.. ఓటర్లకు గుప్పించి.. గెలుస్తున్నారనేది ఈటల మాటలకు అర్థం, పరమార్థం. అందుకే, కేసీఆర్‌ను రాజకీయంగా ఓడించాలంటే.. ముందు ఆయన కుంభస్థలమైన ఆర్థిక మూలాలను దెబ్బకొడితే.. కొండంత కేసీఆర్ కుప్పకూలడం ఖాయమనేది ఈటల లెక్కలా కనిపిస్తోంది. అందుకే, కాషాయ కండువా కప్పుకున్న వెంటనే.. ఈటల నోటి నుంచి కేసీఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అనే డైలాగ్ దూసుకొచ్చిందని చెబుతున్నారు.
పొడుగోడైన కేసీఆర్ నెత్తి కొట్టాలంటే.. పొట్టోడైన ఈటలకు, పోశమ్మలాంటి బీజేపీ అండా, దండా అవసరమైందని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలో చేరడంతో.. ఇక ఈటలకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టైంది. దొర లోటుపాట్లు, లొసుగులు, లోగుట్లు, లొల్లులు.. అన్నీ తెలిసిన రైట్ హ్యాండ్ లీడర్ కావడంతో.. ఇకపై కేసీఆర్గూ డుపుఠానీలపై ఒక్కొక్క చిట్టా విప్పే పనిలో ఉంటారని తెలుస్తోంది. పెద్ద నోరున్న.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నుంచి సైతం ఫుల్ సపోర్ట్ ఉండటంతో.. ఇకపై కేసీఆర్‌కు దబిడి దిబిడే అంటున్నారు కమలనాథులు.