ఈటల టీమ్ కు పెను ముప్పు.. పైలెట్ అప్రమత్తతతో అంతా సేఫ్..
posted on Jun 15, 2021 @ 10:43AM
బీజేపీలో చేరి హైదరాబాద్ తిరిగొస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి పెను ప్రమాదం తప్పింది. రాజేందర్ తో పాటు ఆయన బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై ఉండగా సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి లేచే టైంలో అప్రమత్తమై పైలెట్ విమానాన్ని ఆపేశారు. పైలెట్ సమయానికి స్పందించడంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సాంకేతిక సమస్య తలెత్తిన విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, మాజీ ఎంపీ వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్నట్లు తెలుస్తోంది.సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఆయనతోపాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, తుల ఉమ, అశ్వత్థామరెడ్డి, ఓయూ జేఏసీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. సోమవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసింది ఈటెల బృందం. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు ఈటల రాజేందర్.