కారెక్కిన ఎమ్మెల్యేల సంగతేంటి? ఈటల బాటలో రాజీనామా చేస్తారా ?
దేశంలో బీజేపీ సహా అన్ని పార్టీలు ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరంటే వారిని తమ పార్టీలోకి లాగేసుకుంటున్నాయి. నిమిషాల వ్యవధిలో చొక్కాలు, చడ్డీలు మార్చినంత సులువుగా నాయకులు పార్టీ మారిపోతున్నారు. సరే, అది వారిష్టం. నిజాకి పార్టీ మారడం నేరం కాదు. కానీ, అలా పార్టీ మారినప్పుడు, ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయక పోవడం నేరం అయినా కాకపోయినా, అనైతికం. ప్రజాస్వామ్య నైతిక విలువలకు విరుద్హం. ఒక పార్టీ ద్వారా వచ్చిన పదవులను అక్కడే విడిచేసి, కొత్త పార్టీలో చేరితే అది నాయకుడి హుందాను, గౌరవాన్నే కాదు పార్టీ ప్రతిష్టను కూడా కొంచెం పెంచుతుంది అయితే ఇప్పుడు,రాజకీయాల్లో హుందాతనం, గౌరవం అనే మాటలకు అర్ధాలే లేకుండా పోయాయి. ఎవరికి వారు ‘నాకేంటి’ నే దగ్గరే ఆగిపోతున్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి.
ఇలాంటి పరిస్థితిలోనూ, మాజీమంత్రి ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ముందుగా పార్టీకి, ఆ తర్వాత శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే, బీజేపీలో చేరారు. అలాగే, హైదరాబాద్ ఎక్సిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. గతంలో, కేసీఆర్ కూడా ఇలాగే, తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ టికెట్ పై గెలిచినఎమ్మెల్యే, తద్వారా వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చసిన తర్వాతనే సొంత పార్టీ తెరాస జెండా ఎగరేశారు. అయితే, ఆ ‘నీతి’ని ఆయన తమ వరకే పరిమితం చేసుకున్నారు. బయటి పార్టీ వారిని తమ పార్టీలో చేర్చుకునే సమయంలో ఆయన ఏ నీతి సూత్రాలను పాటించలేదు. ముఖ్యంగా, రాష్ట్ర విభజన లక్ష్యం నెరవేరి, అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇతర రాష్టాలకు, ఇతర పార్టీలకు భిన్నంగా నూతన రాజకీయ సంసృతిని అవలంబిస్తారని ఆశించిన వారికి, నిరాశనే మిగిల్చారు.
రాజకీయ పునరేకీకరణ అనే అందమైన పేరును తగిల్చి, కాంగ్రెస్, తెలుగు దేశం, చివరకు సిపిఐ ఎమ్మెల్యేలను కారేక్కించారు. అంతే కాదు, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నీచ రాజకీయ సంస్కృతిని మరో మెట్టు కిందకు దించి, సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ ను నేరుగా మంత్రివర్గంలోకే తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఎలాంటి నీతీ నియమాలు లేకుండా, తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీల సభ్యులను పార్టీలో చేర్చుకుని, సంఖ్యా బలాన్ని పెంచుకున్నారు. ఒక్క బీజేపీ, ఎంఐఎం తప్ప వామపక్షాలు సహా మిగిలిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలను గులాబీ గుంపులో చేర్చుకున్నారు. రెండేళ్ళ క్రితం 2018 డిసెంబర్’లో జరిగిన శాసన సభ ఎన్నికలలో, తెరాస 88 స్థానాలు గెలుచుకుంది. కానీ, ఇప్పడు ఆ పార్టీ బలం 103. అంటే 15 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఫిరాయింపుల ద్వారా పార్టీలో కలిపేసుకుంది. ఈటల రాజేందర్’కు కేసీఆర్ ‘బి’ ఫారం ఇచ్చినట్లే, ఈ 15 మందికి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ‘బి’ ఫారం ఇచ్చాయి. హస్తం లేదా సైకిల్ గుర్తు మీదనే వీరు గెలిచారు. అయినా, అందులో ఒకరు కూడా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఇంచక్కా, అధికార పార్టీలో చేరి పోయారు. పదవులు అనుభవిస్తూ, అధికార పార్టీ అండతో, ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు.
ఈటల ఎపిసోడ్ నేపధ్యంలో ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. తెరాస నాయకులను ఇరకాటంలోకి నెట్టేస్తోంది. తెరాస టికెట్ మీద గెలిచిన ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తెరాస నాయకులు, తమ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక చుక్కలు చూస్తున్నారు. అయితే, రాజకీయాలలో ఇవ్వన్నీ మాములే, చివరకు ప్రజలు ఏమి చేస్తారు. ఎలాంటి తీర్పు ఇస్తారు, అన్నదే కీలకం.