గ్రహణం వీడుతోంది.. పాపం పండుతోంది.. జగన్‌రెడ్డీ జాగ్రత్త!
posted on Jun 15, 2021 @ 4:05PM
తప్పుది తాత్కాలికంగా పైచేయి కావొచ్చు. కానీ, ఒప్పు ఎప్పటికీ నిలుస్తుంది. కాలం అన్నిటికీ పరిష్కారం చూపుతుంది. సీఎం జగన్‌రెడ్డి విషయంలోనూ ఇదే జరుగుతోందని అంటున్నారు. అందలం ఎక్కగానే అరాచకాలకు తెగబడ్డారని ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టాయి. అవన్నీ పెడచెవిన పెట్టి.. కక్ష్య సాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇచ్చారు. మొదట్లో తాత్కాలిక విజయం సాధించారు.. క్రమక్రమంగా పరాజయాలకు, పరాభవాలకు అలవాటు పడుతున్నారు.. అయినా, సీఎం జగన్‌రెడ్డిలో టెంపర్‌మెంట్ ఏమాత్రం తగ్గడం లేదనే విమర్శ ఇప్పటికీ ఉంది.. హైకోర్టు నుంచి వరుస మొట్టికాయలు పడుతున్నా.. రఘురామరాజు నుంచి గజపతిరాజు వరకు.. కడిగిన ముత్యంలా మెరుస్తున్నా.. జగన్‌రెడ్డికి పట్టిన గ్రహణం ఇంకా వీడటం లేదని మండిపడుతున్నాయి విపక్షాలు. పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి...
అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించేశారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఏ ముక్కనూ చక్కగా చెక్కలేదు. ఇదేమి మూడుముక్కలాట అంటూ హైకోర్టు మొట్టికాయ వేయడంతో.. తలబొప్పికట్టి.. తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రాజధానులకు అన్యాయం చేసి.. ఖరీదైన విశాఖను మాత్రం నెత్తినపెట్టుకుంటున్నారు. ఆక్రమణల పేరుతో టీడీపీ ఆస్తుల ధ్వంస రచన యధేచ్చగా చేస్తున్నారు. విజయనగరంలోనూ మొదట్లో ఇలానే రెచ్చిపోయారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజును టీడీపీ నాయకుడనే ఒకే ఒక్క కారణంతో.. వంశపారంపర్యంగా వస్తున్న హోదా నుంచి తప్పించేశారు. అప్పటి వరకూ సోదిలో కూడా లేని సంచయితను ఎక్కడి నుంచో తీసుకొచ్చి.. ఇక్కడి కుర్చీలో కూర్చోబెట్టి.. పైడితల్లి సాక్షిగా రాజకీయ పావులు కదిపారు. ఇక మేడమ్ గారు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదంటారు స్థానికులు. సిరిమానోత్సవం జాతరలో అశోక్ కుటుంబాన్ని అవమానించి పైశాచిక ఆనందం పొందారంటారు. అయితే, కోర్టు తీర్పు రూపంలో వారి ఆనందం ఆవిరైంది. లేటైనా లేటెస్ట్‌గా.. అశోకుడికి న్యాయం జరిగింది. జగన్‌రెడ్డి సర్కారు తీసుకొచ్చిన జీవోను కోర్టు కొట్టేసింది. అశోకుడికే మళ్లీ పట్టం కట్టింది న్యాయస్థానం. సంచయిత హయాంలో మాన్సాస్ ట్రస్ట్‌లోనూ, సింహాచలం దేవస్థానం వ్యవహారాల్లోనూ అనేక దారుణాలు జరిగాయనేది అశోక్‌గజపతిరాజు ఆరోపణ.
అదే రోజు.. జగన్‌రెడ్డి సర్కారుకు మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. సంగం డెయిరీ ఆస్తుల స్వాధీనానికి చెక్ పెట్టింది అదే హైకోర్టు. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని తెలిపింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలా సంగం.. మళ్లీ ధూళిపాళ్ల ఆధ్వర్యంలోకి వచ్చింది. ఆయన్ను అరెస్ట్ చేసి.. జైలుకు తరలించి.. సంగంను కబ్జా చేయాలనే ప్రయత్నంలో జగన్‌రెడ్డి సర్కారు తాత్కాలికంగా పైచేయి సాధించినా.. కోర్టులు ఉన్నంత వరకూ ఎప్పటికీ న్యాయానిదే అంతిమవిజయం అని మరోసారి రుజువైంది.
ఇక, రాజద్రోహం కేసు. జగన్‌రెడ్డి సర్కారుకు ఫేవరేట్ సెక్షన్. జడ్జి రామకృష్ణను ఇదే కేసులో జైల్లో తోసేశారు. తన వర్గానికి సమకరించలేదనే కక్ష్యతోనే.. మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్భలంతోనే ఆయన్ను అలా కేసులో ఇరికించారని అంటారు. జైల్లో ఆయన హత్యకూ కుట్ర చేశారని రామకృష్ణ కుమారుడు ఫిర్యాదు కూడా చేశారు. కొన్ని వారాలు జైల్లో బంధించగలిగినా.. తాజాగా ఆయన బెయిల్‌పై బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నారు.
ఇక, ఎంపీ రఘురామపై రాజద్రోహం కేసు గురించి అందరికీ తెలిసిందే. పర్మినెంట్‌గా రఘురామను జైల్లో క్లోజ్ చేద్దామని రాజ్యం భవిస్తే.. జగమొండి రాజు గారు.. రయ్‌మంటూ రెక్కలు తొడుక్కొని.. ఢిల్లీకి ఎగిరిపోయారు. పార్లమెంట్ సాక్షిగా జగన్‌రెడ్డి పరువు బజారుకు ఈడుస్తున్నారు. యావత్ దేశం ముందు దోషిగా నిలబెడుతున్నారు.
ఇలా.. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే.. అలిసిపోయేదాక. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ఎంత అబాసుపాలు కావాలో అంతకంటే ఎక్కువే పరువు పోగొట్టుకున్నారు జగన్‌రెడ్డి. ఇక కమ్మ కులం పేరుతో ఆయన చేసిన, చేస్తున్న రాజకీయ రాద్దాంతాన్ని జనం అసహ్యించుకుంటున్నారు. టీడీపీ నేతలపై కేసులు, కుట్రలు, కూల్చివేతలు.. రెండేళ్లుగా ఇదే పని. అభివృద్ధి మాటే లేదు.. ప్రత్యేక హోదా ఊసే లేదు.. విశాఖ ఉక్కుపై చేతగాని తనం.. అమరావతిపై చేతులెత్తేసిన వైనం.. ఇసుక నుంచి మద్యం వరకూ అంతా దోపిడీనే. సంక్షేమం చిరిగిన చొక్కానే. ఇలా జగన్‌రెడ్డి పాలనపై అనేక విమర్శలు, అంతకుమించి ఆరోపణలు. ఇప్పుడిప్పుడే గ్రహణం వీడుతోందని.. జగన్‌రెడ్డి అరాచకపాలనపై ప్రజలకు క్లారిటీ వస్తోందని అంటున్నారు. రెండేళ్లు మీ వ్యక్తిగత అజెండాకే ప్రాధాన్యం ఇచ్చారు.. కోర్టు తీర్పులు, మొట్టికాయలతోనైనా వాస్తవంలోకి వస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. మార్పు మంచిదేనని గుర్తించమంటున్నారు.. అతి అరాచకవాది బాగుపడినట్టు చరిత్రలోనే లేదంటున్నారు విజ్ఞులు. మరి, మంచిమాటలు జగన్‌రెడ్డి చెవికి సోకుతాయా..?