రాజధానులా.. రఘురామా.. గవర్నర్ హస్తినకెందుకు?
posted on Jun 15, 2021 @ 2:51PM
కేంద్రం నుంచి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ కు పిలుపు వచ్చింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతున్న వేళ.. ఈ పిలుపు రావడంతో.. కాస్త ఆసక్తికరంగా మారింది. మూడు రకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. ఒకటి జగన్, అమిత్ షాల మధ్య మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగిందని.. దానిపైనేనని ఒక వర్గం.. అది కాదు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ మీద మాట్లాడటానికే పిలిచారని ఇంకో వర్గం చెప్పుకుంటుంది.
గతంలో నరసింహన్ రెండు రాష్ట్రాల గవర్నర్ గా ఉండగా పదేపదే పిలుపులు వచ్చేవి. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల పంచాయతీ తెలుసుకోవడానికి పిలిచేవారు. ఇక రెండు రాష్ట్రాలకు చెరో గవర్నర్ వచ్చాక..ఢిల్లీ పిలుపులు ఆగిపోయాయి. పైగా ఏపీ,తెలంగాణ మధ్య ఒక నదీజలాల గొడవ తప్ప ఇంకో గొడవేమీ మిగల్లేదు. రాజకీయంగా ఇద్దరు సీఎంలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు కూడా. సో గవర్నర్ కి పెద్దగా రిపోర్టులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. పైగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఓపెన్ గానే... అది కూడా ఢిల్లీవారికి కబురు పంపాకే చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర బిజెపి నేతలు ఒప్పుకోకపోయినా.. కేంద్ర బిజెపి నేతలు ఖండించనూ లేదు. సో బిజెపివారు రహస్యంగా సమాచారం సేకరించాల్సిన అవసరం అంతకన్నా లేదు.
మరెందుకు పిలిచినట్లు గవర్నర్ గారిని? మొన్ననే ఎమ్మెల్సీ ఫైలు ఆపారు.. మళ్లీ లేటెస్టుగా అప్రూవ్ చేసేశారు గవర్నర్. ఆ పని కూడా అయిపోయింది. ఇంకెందుకు పిలిచినట్లు? ఎక్కువమంది అభిప్రాయపడేది మాత్రం మూడు రాజధానుల వ్యవహారమేనని. ఎందుకంటే అమిత్ షాతో సంప్రదింపుల్లో మూడు రాజదానుల ఏర్పాటుపై చర్చించినట్లు వైసీపీ అధికారికంగానే ప్రకటించింది. మరోవైపు ఆ పార్టీ నేతలు, మంత్రులు అతి త్వరలో విశాఖ నుంచే పాలన ఉండబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ విషయంపైనే గవర్నర్ ను పిలిచి ఉంటారని.. నిబంధనల ప్రకారం ఆ ప్రక్రియ అంతా గవర్నర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంటుంది కాబట్టి..ఆయనతో చర్చించడానికే పిలిచారని చెప్పుకుంటున్నారు. కాని హైకోర్టులో కేసులు విచారణలో ఉండగా..అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని..కాబట్టి దాని గురించి అయి ఉండదనే వాదన కూడా వినపడుతోంది.
ఇక రఘరామకృష్ణరాజు ఎపిసోడ్ నడుస్తోంది. సీఐడీ అధికారులు హింసించారనే ఆరోపణలు చేయడం..తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి గాయాలున్నాయని నిర్ధారించడం..తర్వాత నర్సాపురం ఎంపీ స్పీకర్, ఇతర ముఖ్యులందరికీ లేఖలు రాశారు. ప్రివిలేజ్ మోషన్ కు సైతం రఘురామ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ సైతం రఘురామను సస్పెండ్ చేయాలని పట్టుబడుతోంది. అమిత్ షాతో సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ ను పిలిచారని అంటున్నారు. అయితే గియితే ఏం జరిగిందనేదానిపై గవర్నర్ ని అడిగే అవకాశం ఉంది తప్ప..నిర్ణయాల కోసమైతే అవసరం లేదని అధికారులు అనుకుంటున్నారు.