ఏపీ రాజకీయాల్లో ఈటల ఎఫెక్ట్! ఎంపీ రఘురామ ఏం చేయబోతున్నారు?
posted on Jun 15, 2021 @ 4:05PM
తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటలను కేసీఆర్ బర్తరఫ్ చేసినప్పటి నుంచి రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నారు. ఎన్నో సమీకరణలు తెరపైకి వచ్చాయి. చివరికి కమలం పార్టీలో చేరారు ఈటల రాజేందర్. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను కాక రేపిన ఈటల రాజేందర్ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈటల అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
టీఆర్ఎస్ తో విభేదించి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ అంశాన్ని ముడిపెడుతూ.. తమకు కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అంశాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వర్తింపజేస్తూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణరాజుకు పౌరుషం ఉంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళితే డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు ఖాయమని మార్గాని భరత్ స్పష్టం చేశారు. అనర్హత వేటుకు సంబంధించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే రిమైండర్ నోటీసు ఇచ్చామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజుపై ఆర్టికల్-10 ప్రకారం తప్పనిసరిగా వేటు పడుతుందని అన్నారు.
వైసీపీ ఎంపీ వ్యాఖ్యలకు కౌంటరిస్తున్నారు ఎంపీ రఘురామ రాజు అనుచరులు. ఈటల రాజేందర్ కు కేసీఆరే ముందు బర్తరఫ్ చేశారని చెబుతున్నారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరని ఆరోపిస్తున్న వైసీపీ... రఘురామ రాజును పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే... పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు కాదంటున్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా రఘురామ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించలేరని స్పష్టం చేస్తున్నారు.